
ఈత.. కారాదు కడుపు కోత
తల్లిదండ్రులూ ఓ కన్నేయండి
మెదక్‌జోన్: పిల్లలకు వేసవి సెలవులు రావడంతో సంతోషంతో ఎగిరి గంతులు వేస్తున్నారు. కొందరు అమ్మమ్మ ఇంటికి వెళ్తే.. మరికొందరు సరదాగా గడిపేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం ఎండలు మండుతున్నాయి. దీంతో యువకులు చెరువులు, కుంటల వైపు పరుగులు పెడుతున్నారు. ఈత కొడుతూ కేరింతలు కొడుతున్నారు. ఈ క్రమంలో తల్లిదండ్రులు పిల్లలను ఓ కంట కనిపెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.
మూడేళ్లలో 25 మంది మృత్యువాత
వేసవి సెలవులు రావటంతో గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులు ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు అత్యధికంగా ఈతకోసం వెళ్తుంటారు. ప్రస్తుతం వరి కోతలు.. ఉపాధి పనులు జోరుగా కొనసాగుతున్నాయి. పెద్దలు ఉదయం నుంచి సాయంత్రం వరకు పనుల్లో నిమగ్నం అవుతున్నారు. పిల్లలు చెరువులు, కుంటలు, వాగుల్లోకి ఈత కోసం వెళ్లి ప్రమాదాల బారిన పడుతుంటారు. ఈ క్రమంలో తల్లిదండ్రులు పిల్లలను ఓ కంట కని పెట్టాల్సిన అవసరం ఉంది. గడిచిన మూడేళ్లలో జిల్లాలో పాతిక మందికి పైగా యువకులు ఈత కోసం వెళ్లి నీట మునిగి మృత్యువాత పడ్డారు. జిల్లాలో ఏడుపాయల ఆలయం వద్ద ఘనపూర్, మెదక్– కామారెడ్డి జిల్లాల సరిహద్దులో పోచారం ప్రాజెక్టు ఉంది. వీటిలో స్నానానికి దిగి పలువురు మృత్యువాత పడిన సంఘటనలు ఉన్నాయి. అలాగే మెదక్ మండలం బాలనగర్ శివారులో గల బొల్లారం మత్తడి ఏడాది పాటు నీటితో కనివిందు చేస్తుంది. మెదక్, హవేళిఘణాపూర్ మండలాలకు కెనాల్ ద్వారా సాగు నీరు పారుతుంది. గడిచిన ఆరు నెలల్లో ఈ మత్తడి ఆరుగురు యువకులను పొట్టన పెట్టుకుంది.
ప్రమాదాలకు ప్రధాన కారణాలు
చెరువులు, బావుల్లో నీటి లోతు తెలుసుకోకపోవడం, దరికి దూరంగా ఈత కొట్టుకుంటూ వెళ్లే క్రమంలో అలిసిపోవడం, అక్కడి నుంచి వెనుకకు వద్దామన్నా రాలేక.. ఊపిరాడక నీటిలో మునిగిపోతున్నారు. మద్యం మత్తులో ఈతకు వెళ్లే సందర్భాల్లోనూ ప్రమాదాలు జరుగుతున్నాయి. నీటి ప్రవాహానికి ఎదురీదడం, చెరువులు, కాలువ, బావి గట్ల వద్ద సెల్ఫీలు దిగే సందర్భంలో ప్రమాదవశాత్తూ నీటిలో పడి మృత్యువాత పడుతున్నారు.