
కొత్త రేషన్ కార్డులు ఎప్పుడో?
అయోమయంలో దరఖాస్తుదారులు
మెదక్ కలెక్టరేట్: కొత్త రేషన్‌కార్డుల కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. ఇటీవల ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ, రాజీవ్ యువవికాసం వంటి పథకాలు ప్రవేశపెట్టడంతో దరఖాస్తుదారుల్లో మరింత ఆతృత పెరిగింది. తమకు రేషన్‌కార్డులు ఎప్పుడొస్తాయన్న ఆందోళన నెలకొంది. రేషన్‌కార్డు ప్రమాణికం కావడంతో సంక్షేమ పథకాలు పొందలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఏళ్ల తరబడి పెండింగ్‌లో..
ప్రభుత్వం గతేడాది నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమం ద్వారా రేషన్‌కార్డుల కోసం ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించింది. కానీ ఇప్పటికీ కొత్త కార్డుల పంపిణీ ప్రక్రియ పూర్తి చేయలేదు. ఇటీవల కార్డులు జారీ అయినట్లు వచ్చిన జాబితాలపై అధికారులు మరో మారు ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు తల్లిదండ్రుల పేరిట ఉన్న కార్డుల్లో ఉన్న వారు పెళ్లి చేసుకొని భార్య పిల్లలతో కలిసి కొత్త కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలో తల్లిదండ్రుల పేర ఉన్న కార్డుల్లో తమ పేర్లను తొలగించుకున్నారు. కొత్త కార్డు రాక, పాత కార్డులో పేరు లేక పోవడంతో రేషన్ బియ్యానికి, రాజీవ్ యువ వికాసం వంటి సంక్షేమ పథకాలకు దూరమవుతున్నారు. దీంతో చాలా మంది రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. జిల్లాలో ఇప్పటివరకు మొత్తం 2,13,828 రేషన్‌కార్డులు ఉండగా, 522 రేషన్ దుకాణాల ద్వారా లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నారు.
మీసేవ ద్వారా 1,816 దరఖాస్తులు
ఇటీవల జిల్లావ్యాప్తంగా 21 మండలాలకు నుంచి మీ సేవ ద్వారా కొత్త కార్డుల కోసం 1,816 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీటితో పాటు ప్రజాపాలన ద్వారా 35,831 దరఖాస్తులు స్వీకరించారు. అందులో 2,488 దరఖాస్తులపై క్షేత్రస్థాయిలో పరిశీలన పూర్తికాగా, మరో 33,343 దరఖాస్తుల పరిశీలన కొనసాగుతుంది. అయితే చాలా వరకు కొత్తగా పెళ్లి అయిన యువత తల్లిదండ్రుల నుంచి వేరుగా ఉంటూ కొత్తకార్డుల కోసం అప్లయ్ చేసుకున్నారు. మరికొంత మంది తమ పిల్లల పేర్లు రేషన్‌కార్డుల్లో చేర్చాలని అర్జీలు సమర్పించారు.