తెల్లబోతున్నారు..!
కొల్చారంలో వర్షానికి దెబ్బతిన్న పత్తి చేను
మెతుకుసీమలో వరి తర్వాత అత్యధికంగా రైతులు పత్తి పంట పండిస్తారు. ఈ ఏడాది జిల్లాలో 35,087 ఎకరాల్లో సాగు చేశారు. పెద్దశంకరంపేట, రేగోడు, అల్లాదుర్గం, టేక్మాల్ మండలాలతో పాటు చేగుంట మండలంలోనూ కొంతమేర పంట సాగు చేశారు. కాగా ఈ వానాకాలం సీజన్ ప్రారంభం నుంచి అనావృష్టి, అతివృష్టి రైతులను వెంటాడుతూనే ఉంది. ముందస్తు వర్షాలతో విత్తనాలు నాటిన తర్వాత వర్షాలు ముఖం చాటేశాయి. అనంతరం ఆగస్టు చివరివారంలో కురిసిన భారీ వర్షాలకు సుమారు ఆరు వేల పైచిలుకు ఎకరాల్లో వివిధ పంటలు దెబ్బతినగా, అందులో వెయ్యి ఎకరాల్లో పత్తి పంటకు నష్టం వాటిల్లింది. ప్రస్తుతం మిగిలిన పంట చేతికందే సమయంలో మోంథా తుఫాన్ ప్రభావంతో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పత్తి పంటకు తీవ్ర నష్టం వాటిళ్లే పరిస్థితి ఉందని రైతులు ఆవేదన చెందుతున్నారు.
తేమశాతం 12 మించకూడదు
ఈఏడాది పత్తి సాగు చేసిన రైతులకు పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితులు లేవు. సక్రమంగా పంటపండితే ఎకరాకు 12 క్వింటాళ్ల దిగుబడి వస్తోంది. కానీ ఈసారి అతివృష్టితో ఎకరాకు 6 నుంచి 8 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వస్తుందని చెబుతున్నారు. పత్తిని ప్రభుత్వం కొనుగోలు చేయాలంటే తేమ శాతం 8 మించకూడదు. అలా ఉంటేనే ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ. క్వింటాల్‌కు రూ. 8,110 అందిస్తారు. అదే 12 శాతం తేమ ఉంటే క్వింటాల్‌కు రూ. 8 వేల వరకు కొనుగోలు చేస్తారు. అంతకుమించి తేమశాతం ఉన్నా, నల్లబడినా కొనుగోలు చేయటం లేదు.
వరుస వర్షాలతో పత్తికి తీవ్ర నష్టం
నల్లబారి, కుళ్లిపోతున్న కాయ
ఆందోళన చెందుతున్న రైతులు
జిల్లాలో 35,087 ఎకరాల్లో సాగు
పత్తి రైతు కుదేలవుతున్నాడు. వరుసగా కురుస్తున్న వర్షాలు కంటిమీద కనుకు లేకుండా చేస్తున్నాయి. రంగు మారి, కాయ మురిగిపోతుండటంతో ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే అతివృష్టితో వేలాది ఎకరాల్లో పంట నష్టపోయారు. మిగిలిన పంట చేతికందే సమయంలో ‘మోంథా’ తుఫాన్ రూపంలో మరో ఉపద్రవం ముంచుకొచ్చింది. వర్షాలు ఇలాగే కొనసాగితే కనీసం పెట్టుబడి సైతం వచ్చే పరిస్థితి లేదని దిగాలు చెందుతున్నారు. జిల్లాలో 35,087 ఎకరాల్లో రైతులు తెల్లబంగారాన్ని సాగు చేశారు. – మెదక్‌జోన్
ప్రభుత్వమే ఆదుకోవాలి
నాకున్న 6 ఎకరాలతో పాటు మరో 10 ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి సాగు చేశాను. ఎకరాకు రూ. 50 వేల చొప్పున రూ. 8 లక్షల పెట్టుబడి పెట్టి పెట్టా. ఆగస్టులో కురిసిన వ ర్షాలకు కొంత మేర నష్టం జరిగింది. ఇప్పుడు పత్తి తీసే సమయంలో వర్షంతో నల్లబారుతోంది. ఈసారి పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. ప్రభుత్వమే ఆదుకోవాలి. – శివరాములు, గొల్లకుంటతండా, అల్లాదుర్గం
తెల్లబోతున్నారు..!


