మక్క రైతుకు తప్పని కష్టాలు
● కొనుగోలు కేంద్రాలు లేక అవస్థలు ● విక్రయించాలంటే 80 కిలోమీటర్లు వెళ్లాల్సిందే..
అల్లాదుర్గం(మెదక్): మక్క రైతులకు తిప్పలు తప్ప డం లేదు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకోవడానికి ఇబ్బందులపాలవుతున్నారు. అందుబాటులో కొనుగోలు కేంద్రాలు లేక అరిగోస పడుతున్నారు. మక్కలు విక్రయించాలంటే 80 కిలో మీటర్లు వెళ్లాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో మక్కల కొనుగోలు కేంద్రాలను మార్కెటింగ్‌శాఖ రామాయంపేట, నర్సాపూర్, తుప్రాన్‌లో మాత్రమే ఏర్పాటు చేసింది. అల్లాదుర్గం, పెద్దశంకరంపేట, టేక్మాల్, రేగోడ్ మండల ప్రజలు మక్కలను విక్రయించాలంటే సుమారు 80, 90 కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తోంది. దీంతో అంతదూరం వెళ్ల లేక, రవాణా ఖర్చులు భరించలేక అవస్థలు పడుతున్నారు. కల్లాలు చేసినప్పటి నుంచి వర్షంతో ఆందోళన చెందుతున్నారు. టార్పాలిన్లు కప్పి ఉంచడంతో మక్కల రంగు మారుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అల్లాదుర్గంలో మక్కల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పెద్దశంకరంపేట, రేగోడ్, టేక్మాల్ మండలాలకు అల్లాదుర్గం కేంద్రంగా ఉంటుందని చెబుతున్నారు. ఇప్పటికై న ప్రభుత్వం, మార్కెటింగ్‌శాఖ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


