ఎట్టకేలకు అనుమతి
అటవీ ప్రాంతంలో
రోడ్డు విస్తరణకు మోక్షం!
స్టేజ్ వన్ అనుమతి ఇచ్చిన
కేంద్ర అటవీశాఖ
మూడేళ్లుగా నిలిచిన
జాతీయ రహదారి నిర్మాణం
విస్తరణకు నోచని మెదక్– రామాయంపేట
మధ్య జాతీయ రహదారి
రామాయంపేట(మెదక్): మూడు జిల్లా కేంద్రాలను కలుపుతూ కేంద్రం మంజూరు చేసిన జాతీయ రహదారి (765 డీజీ) నిర్మాణానికి అటవీశాఖ అనుమతులు అడ్డంకిగా మారగా, ఎట్టకేలకు అటవీశాఖ స్టేజ్ వన్ కింద అనుమతులు మంజూరు చేసింది. మూడేళ్లుగా అటవీప్రాంతంలో నాలుగు కిలోమీటర్ల మేర రోడ్డు విస్తరణకు నోచుకోలేదు. జిల్లా పరిధిలోని మెదక్ నుంచి రామాయంపేట, సిద్దిపేట మీదుగా వరంగల్ జిల్లా ఎల్కతుర్తి వరకు జాతీయ రహదారి నిర్మాణానికి గాను గతంలో కేంద్రం నిధులు మంజూరు చేసింది. ఈమేరకు మెదక్ నుంచి సిద్దిపేట వరకు మొదటి బిట్టు కింద 70 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్రం రూ.882 కోట్లు మంజూరు చేసింది. మెదక్, సిద్దిపేట, వరంగల్ జిల్లాల్లోని గ్రామాలను కలుపుతూ ఈరోడ్డు నిర్మించనున్నారు. మూడేళ్ల క్రితమే పనులు ప్రారంభం కాగా, మెదక్, రామాయంపేట మధ్యలోని అటవీప్రాంతంలో నాలుగు కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణానికి కేంద్ర అటవీశాఖ అనుమతులు అవసరం కాగా, గతంలోనే ప్రతిపాదనలు పంపారు. సుమారు మూడు వేలకు పైగా చెట్లను తొలగించాల్సి ఉండగా, వాటి నష్టం విలువను రూ. 3.60 కోట్లుగా తేల్చారు. అయితే అనుమతులు రాకపోవడంతో పనులు ప్రారంభం కాలేదు. ఎట్టకేలకు కేంద్ర అటవీశాఖ నుంచి స్టేజ్ వన్ కింద అనుమతులు వచ్చాయి.
అనుమతులు వచ్చాయి
మెదక్, రామాయంపేట మధ్య అటవీప్రా ంతంలో రోడ్డు నిర్మాణానికి స్టేజ్ వన్ కింద అనుమతులు వచ్చాయి. ఈమేరకు తమశాఖ నుంచి నిధులు చెల్లించాలని ఆర్‌అండ్‌బీకి నోటీస్ ఇచ్చాం. డబ్బు చెల్లించిన తర్వాత క్లియరెన్స్ వస్తుంది. తర్వాత పనులు ప్రారంభించుకోవచ్చు.
– జోజి, జిల్లా అటవీశాఖ అధికారి
ఎట్టకేలకు అనుమతి


