బల్దియా.. నిధులు ఆగయా
మున్సిపాలిటీలకు మంచి రోజులొచ్చాయి. నిన్న మొన్నటి వరకు నిధులు లేక నిరసించిన పురపాలికలు ప్రగతి వైపు వడివడిగా అడుగులు వేయనున్నాయి. సమస్యలతో సతమతమవుతున్న జనం సరికొత్త పనులతో ఉపశ మనం లభించనుంది. జిల్లాలోని తూప్రాన్, నర్సాపూర్, రామాయంపేట మున్సిపాలిటీలకు దాదాపు రూ. 50 కోట్ల నిధులు మంజూరయ్యాయి. – తూప్రాన్
మున్సిపాలిటీల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే పుర అభివృద్ధికి నిధులు కేటాయించింది. వాటితో వార్డుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకు సంబంధించి టెండర్ల ప్రక్రియ సైతం ప్రారంభమైంది. త్వరలోనే అర్హులకు పనులు అప్పగించనున్నారు. ప్రభుత్వం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ (బడ్జెట్) డిపార్ట్‌మెంట్, (సీడీఎంఏ) ద్వారా జిల్లాలోని తూప్రాన్, నర్సాపూర్, రామాయంపేట మున్సిపాలిటీలకు రూ. 15 కోట్ల చొప్పున నిధులు మంజూరు చేసింది. ప్రధానంగా అంతర్గత రహదారులు, మురుగు కాలువలు నిర్మించి పారిశుద్ధ్య వ్యవస్థను మెరుగు పరుచనుంది. జిల్లాలో నూతనంగా ఏర్పడిన ఈ మున్సిపాలిటీల్లో నూతనంగా అనేక కాలనీలు ఏర్పడ్డాయి. వాటిలో కనీస సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇతర వార్డుల్లో గతంలో నిర్మించిన మురికి కాలువలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు అధ్వానంగా నిర్మించారని చెబుతున్నారు. ప్రస్తుతం చేపట్టే పనులైన నాణ్యతగా చేపట్టాలని కోరుతున్నారు.
టెండర్ల ప్రక్రియ ప్రారంభం
తూప్రాన్ పట్టణంలోని రూ. 15 కోట్ల నిధులతో నల్లాల బావి వద్ద రూ. కోటితో షాపింగ్ కాంప్లెక్స్, 16 వార్డుల్లో సీసీ రోడ్లు, మురికి కాలువల నిర్మాణం, చిల్డ్రన్స్ పార్కులు, డివైడర్లు, సెంట్రల్ లైటింగ్, విద్యుత్ స్తంభాల ఏర్పాటు, చెరువు కట్టపై విద్యుత్ దీపాలు, తదితర మౌలిక వసతుల కల్పనకు టెండర్ల ప్రక్రియ ప్రారంభమైంది. అలాగే రామాయంపేట, నర్సాపూర్ మున్సిపాలిటీల్లో మౌలిక వసతుల కల్పినకు రంగం సిద్ధమైంది. కాగా మెదక్ మున్సిపాలిటీకి ప్రభుత్వం ఇంకా నిధులు మంజూరు చేయలేదు. ఇక్కడ జనాభా 70 వేలకుపైగా ఉండటంతో పాటు వార్డుల సంఖ్య ఎక్కువగా ఉంది. కాగా ప్రభుత్వం 50 వేల కంటే తక్కువ జనాభా ఉన్న మున్సిపాలిటీలకు మాత్రమే నిధులు విడుదల చేసింది. అయితే ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ ప్రభుత్వ పెద్దలతో చర్చించి నిధులు రాబట్టేందుకు కృషి చేస్తున్నట్లు తెలిసింది.
మున్సిపాలిటీ జనాభా వార్డులు మంజూరైన నిధులు
రామాయంపేట 18,000 12 రూ. 15 కోట్లు
నర్సాపూర్ 25,000 15 రూ. 15 కోట్లు
తూప్రాన్ 23,000 16 రూ. 15 కోట్లు
మెదక్ 71,000 32 –
15 రోజుల్లో పనులు ప్రారంభిస్తాం
తూప్రాన్ మున్సిపాలిటీకి ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 15 కోట్ల నిధులకు సంబంధించి ఆన్‌లైన్ టెండర్లు పిలిచాం. ఇందులో సగం టెండర్లు వచ్చాయి. మిగితా సగం పనులకు టెండర్లు రాగానే, రానున్న 15 రోజుల్లో అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతాం.
– గణేశ్‌రెడ్డి, తూప్రాన్ మున్సిపల్ కమిషనర్


