టైటిల్: 18 పేజెస్
నటీనటులు: నిఖిల్, అనుపమ పరమేశ్వరన్, సరయూ, దినేశ్ తేజ్, అజయ్, పోసాని కృష్ణమురళి, రమణ, రఘుబాబు తదితరులు
నిర్మాణ సంస్థలు: జీఏ2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్ బ్యానర్స్
నిర్మాత: బన్నీ వాసు
కథ, స్క్రీన్ ప్లే: సుకుమార్
దర్శకత్వం: పల్నాటి సూర్య ప్రతాప్
సంగీతం: గోపీ సుందర్
సినిమాటోగ్రఫీ: ఏ. వసంత్
ఎడిటర్: నవీన్ నూలి
విడుదల తేది: డిసెంబర్ 23, 2022
నిఖిల్ సిద్దార్థ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం 18 పేజెస్. సుకుమార్ కథను అందించిన ఈ సినిమాకి సూర్యప్రతాప్ దర్శకత్వం వహించారు. కార్తికేయ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత సరికొత్త స్టోరీతో నిఖిల్ ప్రేక్షకుల ముందుకొచ్చారు. డిసెంబర్ 23 రిలీజైన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
కథేంటంటే..
సిద్ధు( నిఖిల్) ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. ఇంటికి దూరంగా ఓ రూమ్‌లో ఉంటూ ఆఫీస్‌కు వెళ్తుంటాడు. అదే సమయంలో ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ ఊహించని విధంగా నిఖిల్‌కు ఆ అమ్మాయి గట్టి షాక్ ఇస్తుంది. ఆ షాక్ నుంచి డిప్రెషన్‌లో వెళ్లిన నిఖిల్‌కు సహాద్యోగి బాగీ( సరయూ) అండగా నిలుస్తుంది. అనుకోకుండా సిద్దుకు రోడ్డు పక్కన ఒక రోజు డైరీ దొరుకుతుంది.
అది ఓ పల్లెటూరు అమ్మాయి నందిని(అనుపమ పరమేశ్వరన్)రాసిన డైరీ. అసలు ఆ డైరీ ఏముంది? నందిని చుట్టూ ఓ గ్యాంగ్ ఎందుకు తిరుగుతుంది? ఆ డైరీ చదివాక సిద్ధులో వచ్చిన మార్పులేంటి? అసలు నిఖిల్(సిద్ధు) నందినిని కలిశాడా? వారిద్దరి ప్రేమ సక్సెస్ అయిందా? లేదా? చివరికి ఈ కథలో ఎలాంటి మలుపులు చోటు చేసుకున్నాయన్నదే అసలు కథ.
ఎలా ఉందంటే..
థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో కూడిన ఓ స్వచ్ఛమైన ప్రేమ కథ ఇది. అమ్మాయిని చూడకుండా ప్రేమించడం అనే కాన్సెప్ట్‌తో ఈ కథనం సాగుతుంది. తెలిసిన కథే అయినా సుకుమార్ టీమ్ ట్రీట్‌మెంట్ చాలా ఫ్రెష్‌గా, కొత్తగా ఉంది. ఒకపైపు ప్యూర్ లవ్‌స్టోరీని చూపిస్తూనే.. మరోవైపు తర్వాత ఏం జరుగుతుందనే టెన్షన్‌ని ప్రేక్షకులకు కలిగించారు. ఊహించని ట్విస్టులతో ఆద్యంతం ఆసక్తికరంగా కథనం సాగుతుంది.
సినిమా మొత్తంలో హీరో, హీరోయిన్లు చివరి సీన్ వరకు అస్సలు కలుసుకోరు. కలుసుకున్నా కూడా వారిద్దరి మధ్య మాటలు అసలే ఉండవు. అయినా కూడా ఎక్కడ బోర్ కొట్టించకుండా స్క్రీన్‌ప్లే అదరగొట్టారు సుకుమార్. సుకుమార్ అనుకున్న పాయింట్‌ని తెరపై చూపించడంలో వందశాతం సఫలం అయ్యాడు దర్శకుడు పల్నాటి సూర్య ప్రతాప్. సినిమా ఫస్టాఫ్ హీరో హీరోయిన్ల ఇంట్రడక్షన్, పాటలు, సరదా సన్నివేశాలతో సాగింది. ఇంటర్వెల్ ట్విస్ట్ ఆకట్టుకుంటుంది.సెకండాఫ్ ఆద్యంత ట్విస్ట్‌లతో సాగుతుంది. కథ ముందుకు సాగే కొద్ది ఆసక్తి మరింత పెరుగుతుంది. మొత్తంగా 18 పేజీల డైరీతో సస్పెన్స్ లవ్ స్టోరీని చక్కగా తెరకెక్కించారు
ఎవరెలా చేశారంటే..
నిఖిల్ మరోసారి తన నటనతో ఆకట్టుకున్నారు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా నిఖిల్ ఈ సినిమాలో కొత్తగా కనిపించారు. నిఖిల్ ఎమోషన్స్‌తో మరోసారి ఆకట్టుకున్నారు. ఈ సస్పెన్స్ లవ్ స్టోరీలో అనుపమ పరమేశ్వరన్ మరోసారి తన నటనతో మెప్పించింది. మొబైల్ లేకుండా పల్లెటూరి అమ్మాయి పాత్రలో అనుపమ ఒదిగిపోయింది. సరయూ నిఖిల్‌కు సహాద్యోగిగా తెలంగాణ యాసలో అదరగొట్టింది. మధ్యలో రఘుబాబు కామెడీతో అలరించాడు. లాయర్ పాత్రలో పోసాని కృష్ణమురళి, డాక్టర్ సందీప్‌గా దినేశ్ తేజ్, కండక్టర్ పాత్రలో రమణ, విలన్ పాత్రలో అజయ్(తల్వార్) తమ పాత్రలకు న్యాయం చేశారు. జీఏ2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ సినిమా నిర్మాణ విలువలు బాగున్నాయి. గోపీసుందర్ బీజీఎంతో అదరగొట్టాడు. పల్నాటి సూర్య ప్రతాప్ డైరెక్షన్ బాగుంది. వసంత్ సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్ బాగున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment