దేవదాస్.. బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ కెరీర్‌లో గుర్తుండిపోయే చిత్రం. పారూ- దేవదాస్‌ల అమర ప్రేమకు దృశ్యరూపమైన ఈ హృద్యమైన ప్రేమకథా చిత్రం ప్రేక్షకుల చేత కంటతడి పెట్టించింది. విషాదాంతంతో ముగిసే ఈ సినిమా భగ్న ప్రేమికుల హృదయానికి అద్దం పట్టింది. షారుఖ్, మాధురీదీక్షిత్(వేశ్య పాత్ర), ఐశ్వర్యారాయ్ పోటీపడి మరీ నటించి తమ తమ కెరీర్ బెస్ట్ పర్ఫామెన్స్‌లో ఒకటిగా ఈ మూవీని పదిలం చేసుకున్నారు. ఇక సంజల్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ఈ రొమాంటిక్ డ్రామా విడుదలై 19 ఏళ్లు అవుతోంది. ఈ సందర్భంగా షారుఖ్ ఖాన్ గత జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నాడు.
ఈ మేరకు సోమవారం ఇన్‌స్టా వేదికగా.. ‘దేవదాస్’ సినిమా షూటింగ్ సమయం నాటి పలు ఫొటోలను షేర్ చేశాడు. ‘‘అర్ధరాత్రి వరకు షూటింగ్‌లు... పొద్దుపొద్దున్నే నిద్రలేవడం.. అబ్బో ఎన్నో కష్టాలు.. అయితే అవన్నీ మంచి అవుట్‌పుట్‌ను ఇచ్చాయి... ఇందుకు కారణం.. దిగ్గజ సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో మాధురీ దీక్షిత్, ఐశ్వర్యారాయ్, జాకీ ష్రాఫ్, కిరణ్ ఖేర్... ఇంకా టీం మొత్తం కలిసికట్టుగా పనిచేయడమే... అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు’’ అని సహచర నటుల పట్ల ప్రేమను కురిపించాడు.
అదే విధంగా... షూటింగ్ సమయంలో ధోతీ ఎప్పుడూ జారిపోతూ ఉండేదని, అన్నింటి కంటే తాను ఎదుర్కొన్న పెద్ద సమస్యే అదేనంటూ సరదాగా వ్యాఖ్యానించాడు. ఇక మాధురీ దీక్షిత్ సైతం.. ‘‘19 ఏళ్లు గడిచినా ఆ జ్ఞాపకాలు ఇంకా కొత్తగానే ఉన్నాయి. ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు థాంక్యూ సంజయ్’’ అని సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు చెప్పారు. అదే విధంగా ఇటీవల మరణించిన, ‘దేవదాస్’ దిలీప్ కుమార్(1955 నాటి సినిమా)ను ఈ సందర్భంగా మరోసారి నివాళి అర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment