క్లాప్ బాయ్ నుంచి నేషనల్‌ అవార్డ్‌ విన్నర్‌గా.. 'రిషబ్‌ శెట్టి' ప్రయాణం | 70th National Film Awards Best Actor Winner Rishab Shetty Film Industry Journey And Life Success Story | Sakshi
Sakshi News home page

Rishab Shetty Success Journey: క్లాప్ బాయ్ నుంచి నేషనల్‌ అవార్డ్‌ విన్నర్‌గా 'రిషబ్‌ శెట్టి' ప్రయాణం

Published Fri, Aug 16 2024 4:47 PM | Last Updated on Fri, Aug 16 2024 5:27 PM

70th National Award Winner Rishab Shetty Film Industry journey

కాంతార సినిమాతో రిషబ్ శెట్టి పేరు పాపులర్‌ అయింది. కాంతార మూవీతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాందించుకున్నారు రిషబ్ శెట్టి. కన్నడలో విడుదలైన ఈ చిత్రం కేవలం మౌత్‌ టాక్‌తో అన్ని భాషల్లోనూ బాక్సాఫీస్‌ను శాసించింది. కాంతార అద్భుతమైన విజయంలో రిషబ్‌ శెట్టి పాత్ర  చాలా కీలకం.  2010లో సినీరంగంలోకి అడుగుపెట్టి సైడ్ క్యారెక్టర్లు చేస్తూ 2016లో రికి, కిరీక్ పార్టీ సినిమాలకు దర్శకతం వహించాడు. సాధారణ కుటుంబంలో జన్మించిన రిషబ్‌ శెట్టి తాజాగ విడుదలైన 70వ జాతీయ ఉత్తమ నటుడిగా (కాంతార) అవార్డు అందుకునే స్థాయికి చేరుకున్నారు. అసలు రిషబ్ బ్యాక్‌ గ్రౌండ్ ఏంటి?  సినిమాల్లోకి రాకముందు ఆయన ఏం చేశారు?  అనే విషయాలు తెలుసుకుందాం.

కర్ణాటకలోని కెరాడి అనే మారుమూల గ్రామంలో మధ్యతరగతి కుటుంబంలో రిషబ్‌ జన్మించారు. తన తండ్రి భాస్కర శెట్టి జ్యోతిష్కుడు కాగా అమ్మ రత్నావతి. కుటుంబంలో అందరికంటే చిన్నవాడు రిషబ్‌. ఆయనకు అక్క, అన్నయ్య ఉన్నారు. సినిమాల్లో అరంగేట్రానికి ముందు అనేక ఉద్యోగాలు  రిషబ్ శెట్టి  చేశారు. తన అవసరాల కోసం నాన్నను ఎప్పుడూ డబ్బు అడగలేదని గతంలో ఓ ఇంటర్వ్యూ ద్వారా వెల్లడించారు.ఇండస్ట్రీలో మొదట క్లాప్ బాయ్‌గా తన జర్నీని ప్రారంభించిన రిషబ్‌ ఆపై అసిస్టెంట్ డైరెక్టర్‍గా కూడా పనిచేశారు.

ఇండస్ట్రీలో పరిచయాలు లేకుండానే..
తన సినీ ప్రస్థానం గరించి రిషబ్ శెట్టి మాట్లాడుతూ.. 'నేను నటుడిని కావాలనుకున్నా. కానీ పరిశ్రమలో నాకు ఎటువంటి పరిచయాలు లేవు. ఎలా అప్రోచ్ అవ్వాలనేది నా ఆలోచన. అందుకే నేను ఒక కన్నడ నటుడి కథను చదివా. అతను అసిస్టెంట్ డైరెక్టర్‌గా ప్రారంభించి.. హీరోగా ఎలా మారాడనే దాని గురించి చదివాను. నా చదువు తర్వాత ఫిల్మ్ మేకింగ్‌పై షార్ట్‌టర్మ్ కోర్సు చేశా. ఆపై అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసి.. ఏడేళ్ల తర్వాత నటన వైపు మొగ్గు చూపా.' అని అన్నారు.

(చదవండి: 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు.. విజేతల జాబితా ఇదే)

కూలీ పనులకు కూడా వెళ్లేవాడు
రిషబ్ శెట్టి నటుడిగా అరంగేట్రానికి ముందు చాలా పనులు చేశాడు. చిన్నతనంలో బాగా అల్లరి చేస్తున్న రిషబ్‌ పై చదువుల కోసం తన గ్రామం నుంచి బెంగుళూరుకు మకాం మార్చాడు. ‌ డిగ్రీ చదివేటప్పుడు సినిమా చూసేందుకు నాన్నను డబ్బులు అడగలేక.. కూలీ పనులకు వెళ్లేవాడు.  2004 నుంచి 2014 వరకు తన మొదటి డైరెక్షన్ చేసేవరకు 10 ఏళ్లపాటు వాటర్ క్యాన్‌లు అమ్మడం, రియల్ ఎస్టేట్, హోటల్స్‌లో పనిచేశారు. అలా తన గమ్యాన్ని చేరుకునేందుకు ఎంతో కష్టపడ్డారు.

సినీ ఇండస్ట్రీలో రిషబ్ శెట్టి ప్రయాణం
చదువుకునే సమయంలోనే రిషబ్‌కు సినిమాలు అంటే పిచ్చి. ఆ సమయంలోనే అవకాశాల కోసం ప్రయత్నించారు. కానీ అక్కడ పరిచయాలు లేకపోవడంతో సినీ పరిశ్రమలో క్లాప్ బాయ్, స్పాట్ బాయ్‌గా పనిలో చేరారు. ఆపై అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. తుగ్లక్ అనే చిత్రంలో తన మొదటి పాత్రను పోషించారు. 2016లో రక్షిత్ శెట్టి హీరోగా రిషబ్ తొలి దర్శకత్వం వహించిన చిత్రం రికీ విడుదలై బాక్సాఫీస్ వద్ద యావరేజ్ టాక్ అందుకుంది. ఆపై అదే ఏడాది దర్శకత్వ వహించిన మరో చిత్రం కిరిక్ పార్టీ మూవీ  హిట్‌గా నిలిచింది. ఈ సినిమాతో ఆయన పేరు ఒక్కసారిగా మారుమ్రోగిపోయింది.

‘కాంతార’ ప్రభంజనం
చిన్న చిత్రంగా వచ్చి భారీ విజయం సాధించిన చిత్రం ‘కాంతార’. 2022 సెప్టెంబర్‌ 30న కేవలం కన్నడలో విడుదలైన ఈ చిత్రం ఆక్కడ ప్రభంజనం సృష్టించింది. అక్కడ కేజీయఫ్‌ రికార్డులను బద్దలు కొట్టింది. శాండిల్‌ వుడ్‌లో కేజీయఫ్‌2 తర్వాత ఈ స్థాయి వసూళ్లను రాబట్టిన చిత్రం ‘కాంతారా’నే.  కేవలం రూ. 30 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద సుమారు రూ. 400 కోట్లు రాబట్టి రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. తెలుగులో సుమారు రూ. 75 కోట్లకు పైగానే కలెక్షన్స్‌ రాబట్టింది. 

కాంతార చిత్రంలో రిషబ్‌ ప్రధాన కథానాయకుడిగా నటించిడమే కాకుండా  డైరెక్షన్‌ కూడా చేశారు. ఇప్పుడు 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో రిషబ్‌ శెట్టి సత్తా చాటారు. జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డ్‌ దక్కించుకున్నారు.  2018లో రిషబ్‌ దర్శకత్వం వహించిన సర్కారీ హిరియ ప్రాథమిక షాలే, కాసరగోడు (Sarkari Hi. Pra. Shaale, Kasaragodu) సినిమాకుగాను జాతీయ అవార్డ్ అందుకున్న విషయం తెలిసిందే. ఉత్తమ బాలల చిత్రంగా 66వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఎంపికైంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement