వెబ్‌డెస్క్: బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్‌గా పేరొందాడు ఆమిర్ ఖాన్. కుటుంబం మొత్తం సినీ నేపథ్యం ఉన్నదే. తండ్రి తాహిర్ హుస్సేన్ నిర్మాత. అంకుల్ నాసిర్ హుస్సేన్ 70వ దశకంలో బడా నిర్మాతగా, దర్శకుడిగా పేరు పొందాడు. ఇక ఆమిర్ ఖాన్ కజిన్ మన్సూర్ ఖాన్ కూడా దర్శకుడే. అతడి డైరెక్షన్‌లోనే ‘‘ఖయామత్ సే ఖయామత్ తక్’’తో సినీ హీరోగా అరంగేట్రం చేశాడు ఆమిర్. తొలి సినిమాతోనే.. ‘‘అరె.. పక్కింటి కుర్రాడిలా ఉన్నాడే’’ అనిపించేలా తనదైన సహజ నటనతో ఆకట్టుకున్నాడు. దిల్, దిల్ హై కే మాన్‌తా నహీ, ఇష్క్, జో జీతా హై వహీ సికిందర్ వంటి సినిమాలతో ఫర్వాలేదనిపించిన ఆమిర్ ఖాన్... 90వ దశకం నుంచి విలక్షణమైన పాత్రలు ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేకంగా అభిమానులను సంపాదించుకున్నాడు.
రంగీలా, ఇష్క్ వంటి సినిమాల్లో కనిపించిన అతడు.. రాజా హిందుస్థానీతో తొలి ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకున్నాడు. ఇక లగాన్, త్రీ ఇడియట్స్, పీకే వంటి చిత్రాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. లగాన్‌తో నిర్మాణ సంస్థను స్థాపించిన ఆమిర్ ఖాన్.. తారే జమీన్‌పర్‌తో డైరెక్టర్‌గానూ అదృష్టం పరీక్షించుకున్నాడు. కెరీర్‌లో ఇంతగా విజయవంతమైన ఆమిర్ ఖాన్.. వ్యక్తిగతంగా ముఖ్యంగా వివాహ బంధాన్ని నిలబెట్టుకోవడంలో మాత్రం విఫలమయ్యాడు. అది కూడా రెండుసార్లు.
పక్కింటి అమ్మాయి రీనాతో ‘ఇష్క్’
తమ పక్కింట్లో ఉండే అమ్మాయిపై మనసు పారేసుకున్నాడు ఆమిర్ ఖాన్. వీలు చిక్కినప్పుడల్లా.. గంటల తరబడి కిటికీలో నుంచే ఆమెను చూసేవాడు. మూగగా ఆరాధించేవాడు. రోజులు గడుస్తున్నాయి. అటువైపు నుంచి పెద్దగా స్పందన లేదు. ఇలా అయితే లాభం లేదనుకున్నాడు ఆమిర్. ఆఖరికి.. ధైర్యం చేసి.. ఒకరోజు రీనా దత్తాకు తన ప్రేమ గురించి చెప్పాడు. ఆమె.. ‘నో’ చెప్పింది. కానీ అతడు వదల్లేదు. పట్టువీడని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ప్చ్... అయినా రీనా మనసు కరగలేదు.
నువ్వంటే నాకూ ఇష్టమే
ఆమిర్ గుండె పగిలింది. తను మారదు... ఇక కుదరదులే అని ఆశలు వదిలేసుకున్న సమయంలో... రీనా స్వీట్ షాకిచ్చింది. ‘‘నువ్వంటే నాకూ ఇష్టమే’’ అని సిగ్గుల మొగ్గయింది. ఎగిరి గంతేశాడు ఆమిర్. ఇంకేముంది.. సరదాలు.. సంతోషాలు.. షికార్లు.. షరా మామూలే. రీనాను సర్‌ప్రైజ్ చేసేందుకు సగటు ప్రేమికుడు వేసే వేషాలన్నీ వేశాడు ఆమిర్. తనను ఇంప్రెస్ చేసేందుకు రక్తంతో ప్రేమలేఖ రాశాడు కూడా. కానీ రీనాకు ఇది అస్సలు నచ్చలేదు. ఇంకోసారి ఇలా చేస్తే.. నీతో మాట్లాడేదే లేదు అని కరాఖండిగా చెప్పేసింది. ప్రేమను నిరూపించుకునేందుకు ఇలాంటి పిచ్చి పనులు చేయొద్దని గట్టిగానే హెచ్చరించింది.
2002లో విడిపోయారు
ఆమిర్‌కు ఆమెపై ప్రేమతో పాటు గౌరవం కూడా పెరిగింది. పెళ్లి చేసుకోవాలనే నిశ్చయానికి వచ్చారిద్దరూ. 1986లో ఏప్రిల్ 18న వివాహం చేసుకున్నారు. ఈ జంటకు జునైద్ ఖాన్, ఇరా ఖాన్ సంతానం. పదహారేళ్లపాటు ఆమిర్- రీనా కాపురం సాఫీగా సాగిపోయింది. ఆ తర్వాత అభిప్రాయ బేధాలు తలెత్తిన కారణంగా స్నేహ పూర్వకంగానే విడిపోతున్నట్లు ప్రకటించారు. 2002లో వివాహ బంధానికి స్వస్తి పలికారు.
నిర్మాతగా మొదటి భార్య.. అసిస్టెంట్ డైరెక్టర్‌తో ప్రేమ!
విడాకులు తీసుకున్న తర్వాత కూడా రీనాతో అనుబంధం కొనసాగించాడు ఆమిర్ ఖాన్. ఇద్దరూ కలిసి పానీ ఫౌండేషన్ తరఫున సామాజిక సేవలో భాగమయ్యారు. ఇక లగాన్ సినిమాతో ప్రొడక్షన్ హౌజ్ ప్రారంభించిన ఆమిర్ ఖాన్... నిర్మాతగా వ్యవహరించాలని రీనాను కోరాడు. హీరోను పెళ్లాడినప్పటికీ రీనాకు సినిమాలపై పెద్దగా ఇంట్రస్ట్ లేదు. నిర్మాణ రంగంపై అసలే అవగాహన లేదు.
ఆమిర్ కోసం ఆమె.. ప్రేమలో అతడు
కానీ.. ఆమిర్ సాయం కోరాడన్న ఒక్క కారణంతో రీనా పెద్ద సాహసమే చేసింది. లగాన్ వంటి నేపథ్యం ఉన్న సినిమాను ప్రొడ్యూస్ చేసేందుకు సిద్ధపడింది. సుభాష్ ఘాయ్(ప్రముఖ ఫిల్మ్ మేకర్)ను కలిసింది. అప్పటి వరకు ల్యాబ్‌లో అడుగుపెట్టని ఆమె.. మన్మోహన్ శెట్టి(ల్యాబ్ యజమాని)ని అడిగి అన్ని వివరాలు తెలుసుకుంది. సినీ నిర్మాణ వ్యవహారాలపై అవగాహన పెంచుకుంది. ఎట్టకేలకు లగాన్‌ను పట్టాలెక్కించింది. అయితే, లగాన్ సినిమా సమయంలోనే ఆమిర్ ఖాన్‌కు రెండో ప్రేమ లభించింది. అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన కిరణ్ రావుతో ఏర్పడ్డ పరిచయం.. ప్రణయం, ఆపై పరిణయానికి దారి తీసింది.
ఆమె.. హీరోయిన్ అతిథి రావు హైదరి కజిన్. వీరిద్దరి పూర్వీకులు గద్వాల్(వనపర్తి- తెలంగాణ) సంస్థానానికి చెందిన వారు. 2005లో పెళ్లి బంధంతో ఒక్కటైన కిరణ్- ఆమిర్ సరోగసి పద్ధతిలో ఆజాద్ అనే కుమారుడికి జన్మనిచ్చారు. .కానీ, ఈ బంధం కూడా 15 ఏళ్లకే విడాకుల వరకు వెళ్లింది. తామిద్దరం భార్యాభర్తలుగా విడిపోతున్నామని, ఆజాద్‌కు మాత్రం... తల్లిదండ్రులుగా అన్ని బాధ్యతలు కలిసి నెరవేరుస్తామని శనివారం ప్రకటించారు కిరణ్ రావు- ఆమిర్ ఖాన్ దంపతులు. స్నేహితులుగా కొనసాగుతామని, రీనా దత్తా సీఓఓగా వ్యవహరిస్తున్న పానీ ఫౌండేషన్ వ్యవహారాల్లో కలిసి పనిచేస్తామని సంయుక్త ప్రకటన విడుదల చేశారు. దీంతో.. సినిమాల్లో మిస్టర్ పర్‌ఫెక్ట్‌గా ఉండే నువ్వు ఎందుకిలా చేశావు ఆమిర్ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment