మనుషులు అందరూ ఒకలా ఉండనట్లే, అందరి దగ్గరగా ఒకేలా ఉండరు. తమ కన్నా పైనున్న వాళ్ల దగ్గర ఒక మెట్టు కిందికి దిగి నిలబడతారు. తమకన్నా కింద ఉన్నవాళ్ల దగ్గర ఒక మెట్టు పైకి ఎక్కి కుర్చుంటారు. మనిషి స్వభావం. తన మెట్టు ఒకటి ఉంటుంది కదా, అక్కడైతే ఎప్పుడూ ఉండడు మనిషి. అభినందనలు స్వీకరించడంలో కూడా ఎక్కడం దిగడం ఉంటుంది. స్వీకరించడానికి మెట్లను చూసుకోనక్కర్లేదు. ఐనా కానీ పైనున్న వాళ్ల అభినందన మోయలేని పూలగుచ్ఛమై వెన్ను సంతోషంగా కృంగిపోతుంది. కింద ఉన్న వాళ్ల అభినందన చూసి కూడా కాళ్లతో తొక్కేసుకుంటూ వెళ్లిన పువ్వు అవుతుంది. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో పట్టభద్రుడు మనిషి పుట్టుకతోనే! డాన్ బాస్కో హై స్కూల్లో చదివి గురునానక్ కాలేజ్‌లో చదవలేక మానేసిన అక్షయ్ కుమార్ లా మెట్టు ఎక్కకుండా, మెట్టు దిగకుండా ఒకే చోట మనిషిలా ఉండిపోయే మనుషులు కూడా కొందరు ఉంటారు. శుక్రవారం అక్షయ్ కొత్త సినిమా ‘లక్ష్మీ బాంబ్’ ట్రైలర్ రిలీజ్ అయింది.
లారెన్స్ డైరెక్టర్. పిక్చర్ నవంబర్ 9 న డిస్నీ హాట్ స్టార్‌లో వస్తోంది. బాంబులా పేలింది ట్రైలర్. హార్రర్ క్యామెడీ. ‘ఎక్స్‌ప్లోజివ్’ అని లక్ష్మీ నారాయణ త్రిపాఠీ కాంప్లిమెంట్స్ ఇచ్చారు. లక్ష్మి ట్రాన్స్‌జెండర్ ఉమన్. అక్షయ్‌కి, అక్షయ్ టీమ్‌కి ఆమె అభినందనలు, ధన్యవాదాలు రెండూ తెలిపారు. అక్షయ్ ముఖం ఇంతయింది. అసలే ఎప్పుడూ ఇంతయింది ఉంటుంది, అది కొంచెం మరికొంత అయింది. ఏ గట్టునున్నాడో, ఏ మెట్టునున్నాడో చూసుకోకుండా.. ‘మీ అభినందన మాకు ఎంతగానో అవసరం అయినది. ఒక లక్ష్మి చేతుల మీదుగా ఇంకొక లక్ష్మికి ప్రశంసల హారం’ అంటూ తనూ ధన్యవాదాలు తెలిపారు. సినిమాలో అక్షయ్‌కి దయ్యం పడుతుంది. జీవితంలో ఎప్పుడూ ఆయనకు ఎక్కువ తక్కువల దెయ్యం పట్టలేదు. మోదీతో ఎలా ఉన్నారో, ముంబై మురికివాడల్లోని వాళ్లతోనూ అంతే గౌరవంగా, మర్యాదగా ప్రతిస్పందితుడై ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment