
తాను, తన ప్రపంచం అన్నట్టుగా జీవన విధానాన్ని మలుచుకున్న నటుడు అజిత్. ఈయన నటనతో పాటు ఫొటోగ్రఫీ, బైక్, కార్ రేసింగ్, చిన్న చిన్న డ్రోన్లు రూపొందించడం వంటి విషయాలపై ఆసక్తి కనబరుస్తుంటారన్న విషయం తెలిసిందే. ఆ మధ్య బైక్ పయనంతో దేశంలోని ప్రధాన నగరాలను చుట్టొచ్చారు. తాజాగా భూటాన్, నేపాల్ నగరాల్లో బైక్ విహార యాత్ర ముగించుకుని చైన్నెకి తిరిగొచ్చారు.
కాగా అనుహ్యంగా ఆయన సోమవారం మీడియాకు ఒక ప్రకటనను విడుదల చేశారు. అందులో తాను చాలాకాలం తనకు నచ్చిన జీవితాన్ని అనుభవిస్తున్నానన్నారు. జీవితం ఒక అందమైన ప్రయాణమని.. అందులోని మలుపులు, తెరిచిన మార్గాలను అనుభవించండి అని పేర్కొన్నారు. తన స్వదేశీ, విదేశీ బైక్ రైడింగ్ విహార యాత్రను ఇప్పుడు ఒక వృత్తిగా మార్చే ప్రయత్నం చేశానన్నారు.
ఏకే మోటో రైడ్ పేరుతో మోటార్ సైకిల్ విహార యాత్ర సంస్థను ప్రారంభించినట్లు తెలిపారు. దీని ద్వారా భారత దేశంలోని ప్రకృతి అందాలను, అంతర్జాతీయ రోడ్లపై ప్రయాణం చేయాలన్న ఆసక్తిని కనబరచేవారికి ఏకే మోటో రైడ్ సంస్థ విహార పయనం నేర్చుకోవడానికి సహకరిస్తుందన్నారు. అలాంటి వారికి తగిన భద్రతతో పాటు సౌకర్యవంతమైన మోటార్ బైక్లను సమకూర్చడం జరుగుతుందన్నారు. అదే విధంగా అనుభవం కలిగిన మోటార్ బైక్ రైడర్స్‌ను సమకూర్చడం జరుగుతుందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.