ప్రముఖ నటుడు, విలన్ భూపిందర్ సింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. తన పొలం సరిహద్దులో చెట్లు నరికే విషయంలో వివాదం తలెత్తడంతో అతడు తన రివాల్వర్‌తో విచాక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఓ యువకుడు అక్కడే ప్రాణాలు కోల్పోగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌లో ఈ ఘటన జరగ్గా భూపిందర్ సింగ్‌తో పాటు అతడి అనుచరుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
చెట్ల దగ్గర గొడవ..
వివరాల్లోకి వెళితే.. యూపీలోని కౌన్‌కేదా ఖాద్రీ గ్రామంలో భూపిందర్ సింగ్ ఫామ్ హౌస్ ఉంది. దీని పక్కనే గుర్దీప్ సింగ్ నివాసం ఉంటున్నాడు. ఇద్దరి స్థలం సరిహద్దులో కొన్ని చెట్లు ఉన్నాయి. ఆదివారం రోజు ఆ చెట్లను తొలగించే క్రమంలో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. ఆవేశంలో భూపిందర్ సింగ్ లైసెన్స్ పొందిన తన పిస్టోల్‌తో వరుస కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో గుర్‌దీప్ సింగ్, అతడి భార్య మీరాబాయ్, తనయుడు బుటా సింగ్ తీవ్రంగా గాయపడగా మరో తనయుడు గోబింద్ సింగ్ అక్కడికక్కడే మరణించాడు. ఈ విషయంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నారు.
ఎవరీ భూపిందర్ సింగ్?
జై మహాభారత్ సీరియల్‌తో కెరీర్ ఆరంభించాడు భూపిందర్ సింగ్. ఏక్ హసీనా తీ, తేరే షెహర్ మే, మధుబాల- ఏక్ ఇష్క్ ఏక్ జనూన్ వంటి పలు సీరియల్స్‌లో నటించాడు. తెలుగు సినిమాల్లో ఎక్కువగా విలన్ పాత్రలు పోషించాడు. తమ్ముడు, అన్నయ్య, దేవి పుత్రుడు, భలేవాడివి బాసు, విలన్, అంజి, శంకర్ దాదా ఎంబీబీఎస్ వంటి చిత్రాలతో తెలుగువారికి దగ్గరయ్యాడు. 2010లో సోచ్ లో అనే హిందీ సినిమాలో చివరిసారిగా కనిపించాడు. ఆ తర్వాత మరే సినిమాలోనూ కనిపించలేదు.
Comments
Please login to add a commentAdd a comment