రేణకాస్వామి హత్య కేసులో కన్నడ స్టార్ హీరో దర్శన్ A2 గా ఉన్నారు. దీంతో బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో గత 30 రోజులుగా దర్శన్ ఉండటం వల్ల తను నటిస్తున్న సినిమా షూటింగ్ ఆగిపోయింది. దాదాపు పూర్తి కావచ్చిన డెవిల్ సినిమా షూటింగ్ ఇప్పుడు అర్దాంతరంగ ఆగిపోయింది. అయితే, దర్శన్ జైల్లో ఉండగానే ‘డెవిల్’ సినిమా షూటింగ్ లో పాల్గొనవచ్చా అనే చర్చ కన్నడ చిత్రసీమలో జరుగుతోంది. అందుకు ఉదాహరణగా బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఉదంతాన్ని తెరమీదకు తీసుకొస్తున్నారు.
గతంలో బాలీవుడ్ హీరో సంజయ్ దత్ జైలులో శిక్ష అనుభవిస్తూనే సినిమా షూటింగ్‌లో కూడా పాల్గొన్నాడు. దాన్ని ఉదాహరణగా పెట్టుకుని దర్శన్ కూడా ‘డెవిల్’ సినిమాను పూర్తి చేయగలడా? అని ఆయన అభిమానులు చర్చిస్తున్నారు. ‘కాటేరా’ సినిమా తర్వాత దర్శన్ ‘డెవిల్’ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మిలన్ ప్రకాష్, దర్శన్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో 'డెవిల్'పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. దురదృష్టవశాత్తు 'డెవిల్' సినిమా షూటింగ్‌ను ఆపేయాల్సి వచ్చింది. ప్రస్తుతం నిందితుడి స్థానంలో ఉన్నప్పటికీ దర్శన్ జైలులోనే ఉండాల్సి రావడంతో సినిమా షూటింగ్ ఆగిపోయింది.
ముంబై పేలుళ్ల కేసులో సంజయ్ దత్‌కు కూడా ఐదేళ్ల జైలు శిక్ష పడిన సంగతి తెలిసిందే. అయితే సంజయ్ దత్ జైలులో ఉండగానే కోర్టు నుంచి ప్రత్యేక అనుమతి పొంది సినిమా షూటింగ్‌లో పాల్గొన్నారు. 2013లో పెరోల్ పొంది ‘జంజీర్’ సినిమాతో పాటు పోలీస్ గిరి చిత్రాల్లో నటించారు. జైలులో శిక్ష అనుభవిస్తూనే ఈ రెండు సినిమాల పనులను ఆయన పూర్తి చేశారు.
ఇప్పుడు దీన్నే ఉదాహరణగా తీసుకుని దర్శన్ ఫ్యాన్స్ కూడా ‘డెవిల్’ సినిమా తీస్తారా..? అని ఎదురు చూస్తున్నారు. దర్శన్ కూడా పెరోల్ పొంది జైలు నుంచి బయటకు వచ్చి సినిమా షూటింగ్‌లో పాల్గొనవచ్చని అభిప్రాయ పడుతున్నారు. అయితే, ఇది ఇప్పట్లో సాధ్యం కాదని న్యాయవాదులు అంటున్నారు.
దర్శన్ ఇప్పటికీ నిందితుడుగానే ఉన్నారని వారు తెలుపుతున్నారు. పోలీసులు ఛార్జిషీటు దాఖలు చేసిన తర్వాత కోర్టులో వాదనలు జరగాలి. ఆ తర్వాత దర్శన్ నేరం చేసినట్లు దోషిగా తేలితే శిక్షను న్యాయమూర్తి ప్రకటిస్తారు. ఆ తర్వాతే పెరోల్‌పై బయటకు వచ్చి షూటింగ్‌లో పాల్గొనవచ్చని న్యాయ నిపుణులు అంటున్నారు. అదికూడా అర్దాంతరంగా ఆగిపోయిన సినిమాల్లో మాత్రమే నటించే ఛాన్స్ ఉంటుందని వారు తెలిపారు. చార్జిషీట్ సమర్పించే వరకు అంతా వేచి చూడాల్సిందేనని లాయర్లు తెలుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment