జితేంద్ర అసలు పేరు రవికపూర్. కాని సినిమాల్లో రవీంద్ర కపూర్ అనే నటుడు ఉండటంతో తన పేరును జతేంద్ర అని మార్చుకున్నాడు. దాంతో జతిన్ ఖన్నాగా అసలు పేరు కలిగిన రాజేష్ ఖన్నా జితేంద్రకు దగ్గరగా ఉండే తన పేరు కాదని రాజేష్ ఖన్నా అని మార్చుకోవాల్సి వచ్చింది. రవికపూర్ (ఆర్.కె) అలా జితేంద్ర కపూర్ (జె.కె) అయితే జతిన్ ఖన్నా (జె.కె) పేరు మార్చుకుని రాజేష్ ఖన్నా (ఆర్.కె) అయ్యాడు. ఈ తారుమార్ల సంగతి ఇండియన్ ఐడెల్ తాజా ఎపిసోడ్‌లో ప్రేక్షకులతో పంచుకున్నారు జితేంద్ర. మార్చి 14న టెలికాస్ట్ అయిన ఇండియన్ ఐడెల్ ‘జితేంద్ర స్పెషల్’లో పాల్గొన్న ఆయన ముంబైలో ‘చాల్’లో తన 20వ ఏట వరకూ జీవించానని చెప్పారు. దాని వల్ల తాను పంజాబీ అయినా మరాఠి చాలా బాగా నేర్చుకోగలిగానని చెప్పారు.
‘మా ఇంట్లో మొదటిసారి ఫ్యాన్ బిగిస్తే దానిని చూడటానికి చాల్‌లో ఉన్న 60 ఇళ్ల వాళ్లూ వచ్చారు. అదో వింత. ట్యూబ్‌లైట్ బిగించినా వారికి వింతే. గణపతి పూజను కులమతాలకు అతీతంగా చేసేవారం. ఆ రోజులు మళ్లీ రావు’ అన్నాడాయన.‘నాకు జీవితంలో రెండు కోరికలు ఉన్నాయి. కలలు అనొచ్చు. ఒకటి ఇండియా బ్యాంటింగ్‌లో ఆరు వికెట్లు కోల్పోయినప్పుడు నేను బ్యాటింగ్‌కు వెళ్లి ఇండియాను గెలిపించడం. రెండు... మంచి గాయకుణ్ణి కావడం. కాని నా గొంతు చాలా చెడ్డగా ఉంటుంది.
పాటల చిత్రీకరణలో నేను పెద్దపెద్దగా పాడుతూ యాక్ట్ చేస్తాను. కాని సౌండ్‌లో నా కఠినమైన గొంతు ఎవరికీ వినిపించేది కాదు. ఒకసారి ఇలాగే షాట్‌లో పెద్ద పెద్దగా పాడుతూ నటిస్తున్నాను. ఇంతలో ఏదో వైర్ తెగి పాట ఆగిపోయింది. నా గొంతు మాత్రం అసహ్యంగా అందరికీ వినిపించింది. అయితే కొంతలో కొంత మేలు ఏమిటంటే నాతో పాటు నటిస్తున్న ఆశా పరేఖ్ కూడా నాలాగే పెద్దగా పాడుతూ యాక్ట్ చేస్తోంది. ఆమె గొంతు నాకన్నా ఘోరంగా ఉంది’ అని నవ్వించారాయన. జితేంద్ర వయసు ఇప్పుడు 78 సంవత్సరాలు. ఈ వయసులో కూడా ఆయన చలాకీగా స్టెప్పులేయడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment