రాజకీయాల్లోకి సినిమా నటులు రావడం అనేది సహజం. కానీ తమిళనాట మాత్రం అది సంచలనం. తొలుత ఎంజీఆర్ (ఎంజీ రామచంద్రన్) ప్రభంజనం సృష్టించగా.. పురట్చి తలైవి జయలలిత దాన్ని కొనసాగించారు. తాజాగా కమల్ హాసన్ కూడా రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇక రజనీకాంత్ ఊరించి ఊరించి ఉసూరు మనిపించారు. ప్రస్తుతం అశేష అభిమానగణం సంపాదించుకున్న దళపతి విజయ్.. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ ప్రవేశమే లక్ష్యంగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.
జల్లికట్టు నుంచి జీఎస్టీ వరకు..
తమిళుల సాంప్రదాయ క్రీడ జల్లికట్టు నుంచి జీఎస్టీ (వస్తుసేవల పన్ను) వరకు ప్రతి అంశంపై విజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాక తన సినిమాల్లోనూ రాజకీయాలకు సంబంధించిన పంచ్ డైలాగ్‌లు విసరడం వివాదాస్పదమైంది. అలాగే నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్) విషయంలో బలవన్మరణాలకు పాల్పడిన విద్యార్థుల కుటుంబాలకు సైతం ఓదార్పుగా నిలిచి ప్రభుత్వ తీరును ఎండగట్టారు.
అలాగే సినిమా ఫంక్షన్‌లలో ‘కుట్టి స్టోరీ’ పేరుతో తన అభిప్రాయాలను అభిమానులకు తెలియజేయడమే కాకుండా ప్రభుత్వాలపై తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధించారు. ఫలితంగా ఆయన సినిమాలు విడుదలకు ముందే వివాదాస్పదమయ్యాయి. అదే అదునుగా ప్రభుత్వాలు కూడా పోలీసుల ద్వారా పలు ఆంక్షలు విధించాయనే వాదన కూడా ఉంది. ఇక అదే కారణంతో ఇటీవల లియో సినిమా ఆడియో ఫంక్షన్‌ను కూడా నిర్మాతలు రద్దు చేసుకున్నారు.
లియో విజయోత్సవ వేదికపై..
ఇక లియో సినిమా విజయోత్సవ వేదికపై సూపర్ స్టార్ ఎవరనే అంశంపై నర్మగర్భ వ్యాఖ్యలు చేసి సంచలనం సృష్టించారు. వివరాల్లోకి వెళితే.. తమిళనాట సూపర్ స్టార్ ఎవరనే అంశంపై రజనీకాంత్, విజయ్ అభిమానుల మధ్య చాలా కాలంగా పెద్ద వివాదమే జరుగుతోంది. తాజాగా ఈ వివాదానికి విజయ్ పూర్తి క్లారిటీ ఇచ్చారు. ‘దయచేసి ఓపిక పట్టండి. మన లక్ష్యం ఇది కాదు. వేరే ఉంది. అది గొప్పది. ఆ దిశగా అడుగులేద్దాం. భవిష్యత్తులో మనమేంటో చూపిద్దాం’ అంటూ నటుడు విజయ్ తన అభిమానులను ఉద్దేశించి చెప్పారు.
తాజాగా నెహ్రూ ఇండోర్ స్టేడియంలో లియో విజయోత్సవాన్ని భారీ ఎత్తున నిర్వహించారు. ఈ వేడుకలో పాల్గొన్న విజయ్ పాట పాడి, డాన్స్ చేసి అభిమానులను సంతోషపరిచారు. అనంతరం ఎప్పటిలానే ఒక చిన్న స్టోరీని చెప్పారు. ఆ తర్వాత ఆయన ‘‘సూపర్ స్టార్ ఎవరనే విషయంపై వివరణ ఇస్తూ పురట్చి తలైవర్ (విప్లవ నాయకుడు ఎంజీఆర్) ఒక్కరే. నడిగర్ తిలగం (శివాజీ గణేషన్)ఒక్కరే. పురట్చి కలైంజ్ఞర్ (కరుణానిధి) ఒక్కరే. అదే విధంగా విశ్వనటుడు (కమలహాసన్) ఒక్కరే. సూపర్ స్టార్ (రజనీకాంత్) ఒక్కరే. తల అంటే (అజిత్) ఒక్కరే. ఇక దళపతి అంటారా (విజయ్) నాకు సంబంధించినంత వరకు దళపతి అంటే రాజుల ఆజ్ఞను పూర్తి చేసేవాడు.
నాకు రాజులు అంటే ప్రజలైన మీరే. మీరు చెప్పండి నేను చేసి చూపిస్తాను. మనం ఎవరి మనసుల్ని బాధించరాదు. మనకు చాలా పని ఉంది. పెద్ద లక్ష్యం పెట్టుకుని చేధించాలి. ఏది అసాధ్యమో దాన్ని సాధించడమే విజయం. అహింస నిజమైన ఆయుధం.’’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వ్యాఖ్యాత రానున్న 2026 సంవత్సరం గురించి అడిగిన ప్రశ్నకు ఆ ఏడాది ఫుట్‌బాల్ టోర్నీ జరగనుందని, ఇందులో కప్పు సాధించడమే ముఖ్యం అని చెప్పడంతో తమ అభిమాన నటుడి రాజకీయ రంగప్రవేశం ఖాయం అంటూ నినాదాలు హోరెత్తాయి.
రాజకీయ వర్గాల్లో జోరందుకున్న చర్చలు
ఇక అదే వేదికపై నటుడు అర్జున్ మాట్లాడుతూ హీరో విజయ్ త్వరలోనే రాజకీయ రంగ ప్రవేశం చేస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై విజయ్ రాజకీయ రంగ ప్రవేశాన్ని ఆహ్వానిస్తున్నట్లు బహిరంగంగానే ప్రకటించారు. నామ్ తమిళర్ నేత సీమాన్ కూడా విజయ్ రాజకీయాల్లోకి వస్తే వెల్‌కమ్ చెబుతామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకే వర్గాలు ఎలా స్పందిస్తాయనేది ఉత్కంఠగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment