రంగుల ప్రపంచంలో నటిగా రాణించిన జయలలిత నిజ జీవితంలో మాత్రం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంది. కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడు డైరెక్టర్‌ను ప్రేమించి పెళ్లాడింది. ఇంట్లో వాళ్లను ఎదిరించి మరీ మనసిచ్చినవాడితో ఏడడుగులు వేసింది. కానీ పెళ్లి తర్వాత ప్రియుడి నిజస్వరూపం బయటపడింది. ఆస్తి కోసమే ప్రేమను నటించాడని అర్థం అయింది. గృహ హింస తట్టుకోలేక విడాకులు తీసుకుంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలను చెప్పుకొచ్చింది.
కుటుంబమంతా నాపై ఆధారపడటంతో..
'నేను క్లాసికల్ డ్యాన్సర్‌ను. నేను పదో తరగతి రెండుసార్లు ఫెయిలయ్యాను. మయూరి, సప్తపది సినిమా ఛాన్సులు చేతిదాకా వచ్చినట్లే వచ్చి వెనక్కు వెళ్లిపోయాయి. తర్వాత ఎందుకోగానీ అన్నీ వ్యాంప్ క్యారెక్టర్లే వచ్చాయి. అలా ఐటం సాంగ్స్ చేశాను, పొట్టిపొట్టి డ్రెస్సులు వేసుకుని నటించాను. నా కుటుంబం నా మీద ఆధారపడి ఉండటంతో వచ్చిన ఆఫర్‌నల్లా ఒప్పుకుంటూ పోయాను. కానీ ఇలా ఐటం సాంగ్స్ చేయడం వల్ల క్లాసికల్ డ్యాన్స్‌కు దూరమయ్యాను.
ఇంటిపై దాడి
అయితే జయలలిత అనే పేరు నాకు తమిళనాడులో మైనస్ అయింది. జయలలిత అమ్మ పేరు పెట్టుకుని కమెడియన్‌గా చేస్తున్నావ్, ఐటం సాంగ్స్ చేస్తున్నావ్.. పేరు మార్చుకో అని ఆ పార్టీవాళ్లు మా ఇంటి మీద రాళ్లు రువ్వి దాడి చేశారు. నేను పేరు మార్చుకోననేసరికి అక్కడ అవకాశాలు తగ్గిపోయాయి. మలయాళ డైరెక్టర్ వినోద్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. మా ప్రేమ ఎలా మొదలైందంటే.. డేట్స్ విషయంలో పెద్ద గొడవ జరిగితే అతడు ముందుండి సమస్యను పరిష్కరించాడు.
పెళ్లయిన తెల్లారినుంచే ఆస్తి కోసం గొడవ
ఆ చిన్నదానికే లవ్‌లో పడిపోయాను. అతడి కోసం ఎన్ని సినిమాలు మానుకున్నానో! పరుచూరి గోపాలకృష్ణ, చలపతిరావు.. తొందరపడుతున్నావని హెచ్చరించడంతో ఆలోచనలో పడ్డాను. కానీ అప్పటికే అతడు రక్తంతో లెటర్స్ రాయడం, విషం తాగి చస్తానని బెదిరించడంతో భయంతో గుడిలో పెళ్లి చేసుకున్నాను.పెళ్లయిన మరుసటి రోజు నుంచే ఆస్తి కోసం పోరు మొదలుపెట్టాడు. లేదంటే పిల్లల్ని కనమని వేధించాడు.
పక్షవాతం.. నేనే డబ్బులు పంపించా
ఇంట్లో తెలియకుండా డాక్టర్ దగ్గరకు వెళ్లి పిల్లలు పుట్టకుండా మూడు నెలలపాటు టాబ్లెట్స్ వేసుకున్నాను. డబ్బు తీసుకురా లేదంటే యాసిడ్ పోస్తానని అత్తింటివారు బెదిరించారు. రూ.50 లక్షలు, నా బంగారు నగలు సహా ఉన్నదంతా ఊడ్చేశారు. 6 నెలలకే మేము విడిపోయాం. ఇటీవలే రోడ్డుప్రమాదంలో గాయపడగా కాలికి పక్షవాతం వచ్చింది. బెడ్ మీద నుంచి లేవలేని పరిస్థితిలో ఉన్నాడు. అతబి భార్య సరిగా చూసుకోకపోవడంతో మందుల కోసం నెలకు రూ.5 వేలు పంపించాను.
అమ్మా అమ్మా అంటూ రూ.4 కోట్లు కాజేశాడు
ఈ మధ్య నేను సంపాదించిన రూ.4 కోట్లు పోగొట్టుకున్నాను. అనిల్ గణపతి రాజు.. రాఘవేంద్రరావు దగ్గర డ్రైవర్‌గా పనిచేసేవాడు. రాఘవేంద్రరావుకు సంబంధించిన సీరియల్ చేసేటప్పుడు అనిలే ఇంటికి వచ్చి కారులో పిక్ చేసుకుని వెళ్లేవాడు. తర్వాత అతడు కుందనపు బొమ్మ అని సినిమా కూడా చేశాడు. అయితే సినిమా ఫ్లాప్ అవడంతో ఆ నష్టాన్ని పూడ్చేందుకు నా దగ్గర డబ్బులు తీసుకున్నాడు. అలాగే తన సీరియల్ కోసం కూడా నా దగ్గర వడ్డీకి డబ్బులు తీసుకున్నారు. అమ్మా అమ్మా.. అని అడుక్కోవడంతో ఉన్నదంతా ఇచ్చేశాను. అయితే డబ్బులు బాగున్నాయని విసిరేస్తోందని నా వెనకాల తిట్టేవాడు. ఇలా ఉన్నదంతా పోయి ఇబ్బందులు పడ్డప్పుడు సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరూ సపోర్ట్ చేయలేదు' అని చెప్తూ ఎమోషనలైంది జయలలిత.
చదవండి: పెద్ద పెద్ద స్టార్స్‌తో నటించింది.. 35 ఏళ్లకే కెరీర్ ముగించింది!
Comments
Please login to add a commentAdd a comment