గర్భవతిగా ఉన్న నేను ఆ సీన్‌ చేస్తున్నప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను: పూర్ణ | Actress Poorna Struggles In Dasara Movie Shooting | Sakshi
Sakshi News home page

గర్భవతిగా ఉన్న నేను ఆ సీన్‌ చేస్తున్నప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను: పూర్ణ

Published Fri, Sep 29 2023 12:54 PM | Last Updated on Sat, Sep 30 2023 10:34 AM

Actress Poorna Struggles In Dasara Movie Shooting - Sakshi

టాలీవుడ్‌లో పూర్ణగా గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ అసలు పేరు షమ్నా కాసిమ్.. దక్షిణ భారత చలనచిత్రంలో ఆమె ప్రత్యేక గుర్తింపు పొందారు. మలయాళం ద్వారా కెరీర్ ప్రారంభించిన పూర్ణ అక్కడ షమ్నా కాసిమ్‌గా గుర్తింపు పొందింది. ఆ తర్వాత తమిళం, తెలుగులో చెప్పుకోదగ్గ పాత్రల ద్వారా అగ్రతారగా నిలిచింది. పూర్ణ మంచి డ్యాన్సర్‌ కూడా.. ఇప్పటికే పలు డ్యాన్స్‌ షోస్‌ ద్వారా కూడా అభిమానులను సంపాదించుకుంది. సినిమాలే కాకుండా బుల్లితెర ప్రపంచంలో కూడా పూర్ణకు ప్రత్యేకమైన స్థానం ఉంది. తన జీవితంలో కొత్త దశను దాటుతోంది. ఇటీవలే తల్లి పండంటి బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే.

(ఇదీ చదవండి: 40 ఏళ్ల వయసులో పెళ్లికి రెడీ అయిన శింబు.. అమ్మాయి ఎవరంటే)

తన ఇంటికి కొడుకు రాకతో ఆ కుటుంబం సంబరాలు చేసుకుంది. సినిమాలో తన పాత్ర కోసం ఎలాంటి ఛాలెంజ్‌లనైనా స్వీకరించడానికి ఆమె ఎప్పుడూ సిద్ధంగా ఉందటుంది. ఒకానొక సమయంలో సినిమా కోసం ఆమె జుట్టు కత్తిరించుకోవడం పెద్ద చర్చనీయాంశమైంది. తెలుగులో నాని సినిమా అయిన దసరా షూటింగ్‌లో తాను ఎదుర్కొన్న సవాళ్ల గురించి పూర్ణ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఈ సినిమా షూటింగ్‌ సమయంలో పూర్ణ గర్భవతి కాగా సినిమా విడుదల తర్వాత ఆమె బిడ్డకు జన్మనిచ్చింది.

దసరా సినిమా కోసం వర్షంలో రెండు రోజులు షూటింగ్‌ జరిగిందని గర్భవతిగా ఉన్న తాను ఎంతో ఇబ్బంది పడ్డానని చెప్పుకొచ్చింది. ఇందులో ఆమెకు సంబంధించిన చాలా సన్నివేశాలు రాత్రివేళల్లోనే జరిగాయని తెలిపింది. దీంతో  రెండు రాత్రులు వర్షంలోనే ఉండాల్సి వచ్చిందని పూర్ణ చెప్పింది. ఆ సమయంలో రాత్రి చాలా చలిగా ఉండటంతో చాలా ఇబ్బంది పడ్డానని తెలిపింది. గర్భవతిగా ఉన్న తనకు చాలా చల్లగా ఉన్న నీళ్లు తీసుకోవడం మరింత సమస్యలు తెచ్చిపెట్టిందని చెప్పింది. గర్భవతి అయిన తనకు ఆ సన్నివేశాల్లో నటించడం చాలా కష్టమైందని పేర్కొంది. కానీ అంత కష్టపడ్డా సినిమాలో తను నటించిన కొన్ని సన్నివేశాలు తొలిగించారని పేర్కొంది.

వర్షంలో తడిసిన సన్నివేశాలను చిత్రీకరించిన మేకర్స్‌ ఆపై తాను చాలా ఇబ్బంది పడటం గమనించి వేడినీళ్లు తెప్పించి పూర్ణపై పోస్తూనే ఉన్నారట.  సినిమాలోని మరో సన్నివేశం కోసం రాత్రిపూట నిర్మానుష్యమైన రోడ్డులో పరుగెత్తాల్సి వచ్చిందని అప్పుడు వీధికుక్కల అరుపులు విని భయపడ్డానని, అదృష్టవశాత్తూ అవి తనను కరిచలేదని పూర్ణ చెప్పింది. ఆ సన్నివేశంలో కాళ్లకు చెప్పులు కూడా లేకుండా చిత్రీకరించబడిందని పేర్కొంది. కానీ ఆ సమయంలో పెద్దగా గాయాలు ఏం కాలేదని పేర్కొంది. సినిమా షూటింగ్‌ సమయంలో మేకర్స్‌ తనకు ఎంతగానో తొడ్పడ్డారని తెలిపింది. వారి సాయంతోనే గర్భవతిగా ఉన్న తాను సురక్షితంగా సినిమా పూర్తి చేశానని పూర్ణ తెలిపింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement