తండ్రి కె.డి.చంద్రన్‌తో...
నటి సుధాచంద్రన్ తండ్రి కె.డి.చంద్రన్ (86) మే 16న మరణించారు. సుధా చంద్రన్ విజయగాథ వెనుక ఆయన స్ఫూర్తి చాలా ఉంది. ‘మయూరి’ సినిమాతో సుధా చంద్రన్ దేశమంతా తెలిశారు. ఆమె తమిళ నాట్యకారిణి అయినా తెలుగువారి వల్లే దేశానికి తెలియడం విశేషం. తెలుగులో ‘మయూరి’, హిందీలో ‘నాచే మయూరి’ ద్వారా హిట్ అయిన సుధా చంద్రన్ ముంబయ్‌లో తన కెరీర్‌ను స్థిరపరుచుకున్నారు.
యాక్సిడెంట్ వల్ల కాలు కోల్పోయిన ఈమె ఆ తర్వాత కృత్రిమ కాలుతో డ్యాన్సర్‌గా, నటిగా కొనసాగారు. అయితే దీని వెనుక ఆమె తండ్రి కె.డి.చంద్రన్ మద్దతు, ప్రోత్సాహం చాలా ఉంది. హిందీ సినిమాలలో, సీరియల్స్‌లో నటుడుగా రాణించిన కె.డి.చంద్రన్ కూతురి కష్టకాలంలో ఆమెకు అండగా ఉన్నాడు. ఆమె కెరీర్‌లో కూడా తోడుగా ఉన్నాడు. కనుకనే మొన్న మే 16న ఆయన మరణించడంతో సుధా చంద్రన్ కన్నీరు మున్నీరు అవుతున్నారు.
‘ఆయనకు కోవిడ్ టెస్ట్ చేయించాం. నెగటివ్ వచ్చింది. ఆ తర్వాత మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ అని డాక్టర్లు చెప్పారు’ అని సుధా చంద్రన్ తెలియజేశారు. ‘నా ప్రతి అపజయాన్ని విజయంగా మార్చుకోవడం వెనుక మా నాన్న ఉన్నారు. యాక్సిడెంట్ వల్ల నా కుడి కాలు తీసేయాల్సి వచ్చినప్పుడు నా దగ్గరకు వచ్చి చేయి పట్టుకుని బాధపడకమ్మా... ఇకపై నేనే నీ కాలుగా ఉంటా అని అన్నారు.’ అని సుధా చంద్రన్ తండ్రి జ్ఞాపకాలతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు.
‘మా నాన్న ఒక్కటే చెప్పేవారు. ఎప్పుడూ ఓటమిని అంగీకరించొద్దు అని. ఆ మాటనే పాటించేదాన్ని. మా అమ్మ మరణించినప్పుడు ఆయన నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చారు. మా నాన్న ఎంతో సహాయకారి. ముంబయ్‌లో కేరళ కళాకారులను చాలామందిని సొంత డబ్బు ఇచ్చి ఆదుకునేవారు (సుధా చంద్రన్ పూర్వికులు పాలక్కాడ్‌కి వలస వెళ్లారు). మన దగ్గరకు సాయానికి వచ్చినవారు ఖాళీ చేతులతో వెళ్లకూడదు అనేవారు’ అని తండ్రిని గుర్తు చేసుకున్నారు.
‘పదేళ్లుగా నాన్న నాతోనే ఉంటున్నారు. అమ్మ చనిపోయాక ఆయన నాకు మరింత సమయం కేటాయిస్తూ వచ్చారు. ఉదయం ఆరు గంటలకే నిద్రలేచేవారు. తన కాలకృత్యాలు, దైనందిన చర్యలను క్రమం తప్పకుండా పాటించేవారు. కేవలం నటనా ప్రపంచంలోనే ఉండిపోకు. నీ చుట్టు పక్కల, ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకుంటూ ఉండాలి. జీవితంలో డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో, నువ్వు కష్టపడి సంపాదించిన ధనాన్ని ఉపయుక్తంగా ఖర్చు చేయడం, ఎంజాయ్ చేయడం కూడా అంతే ముఖ్యం. ఇలా ఎన్నో జీవిత సత్యాలను నాన్న నాకు తరచూ చెబుతుండేవారు’ అని తండ్రి చెప్పిన జీవిత సత్యాలను పేర్కొన్నారు.
‘అమ్మ చనిపోయినప్పుడు నేను చాలా భావోద్వేగానికి లోనయ్యాను. ఆ సమయంలో నాన్న నా దగ్గరికి వచ్చి... జన్మించిన ప్రతి ఒక్కరు మరణించక తప్పదు. ఇది జీవిత సత్యం. ఈ విషయాన్ని నువ్వు ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది నీకు అన్నారు. అలాగే జీవితంలో ప్రాక్టికల్‌గా ఉండు. వ్యక్తులు, వస్తువులు, ప్రత్యేక విషయాలపై ఎప్పుడూ ప్రేమను పెంచుకోకు. అవన్నీ ఒకరోజు మనకు దూరమయ్యేవే అని గుర్తు పెట్టుకో. ఇలాంటి విషయాలు చెప్పి ఆయన నన్ను జీవితంలో స్ట్రాంగ్‌గా, రియాలిటీకి దగ్గరగా బతికేలా చేశారు. మా నాన్నను నేను మళ్లీ కలిసేవరకు చెప్పాలనుకున్నది ఒక్కటే... మరో జన్మంటూ ఉంటే నా తల్లిదండ్రులకే మరోసారి కూతురిలా జన్మించాలని కోరుకుంటున్నాను’ అని ఎమోషనల్ అయ్యారు.
మహేశ్ భట్ సినిమాలలో నటించారు కె.డి.చంద్రన్. ‘హమ్ హై రాహీ ప్యార్‌కే’ అందులో ఒకటి. ‘మహేశ్ భట్‌కు ఈ వార్త (తండ్రి మరణించిన వార్త) తెలుసో లేదో. ఆయన నుంచి ఇంకా నాకు మెసేజ్ రాలేదు’ అని సుధా చంద్రన్ అన్నారు. తెలుగు డబ్బింగ్ సీరియల్స్ వల్ల సుధా చంద్రన్ తెలుగు ఇళ్లకూ దగ్గరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment