ఎట్టకేలకు టాలీవుడ్ హీరో సిద్దార్థ్ పెళ్లి పీటలెక్కాడు. తెలుగు హీరోయిన్ అదితి రావు హైదరిని పెళ్లాడారు. వనపర్తి జిల్లాలోని శ్రీరంగపురం ఆలయంలో వీరిద్దరి పెళ్లికి జరిగింది. రెండు కుటుంబాల సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. అదితి, సిద్ధార్థ్ జంటగా అజయ్ భూపతి దర్శకత్వం వహించిన మహా సముద్రం(2021)చిత్రంలో నటించారు. ఆ మూవీ సమయంలోనే వీరిద్దరు ప్రేమలో పడినట్లు తెలుస్తోంది.
అయితే ఇన్నాళ్లు ఈ జంటపై వస్తున్న రూమర్స్‌ను నిజం చేస్తూ.. ఒక్కసారిగా వాటన్నింటికీ తెరదించారు. పెళ్లి జరిగిపోవడంతో వీరిద్దరి గురించి అభిమానులు తెగ వెతికేస్తున్నారు. అయితే ఈ జంట వయస్సు గురించి అభిమానులు చర్చ మొదలెట్టారు. ఈ జంటకు ఏజ్ గ్యాప్ ఎంత ఉందన్న విషయంపై ఆరా తీస్తున్నారు. మరీ మీరు ఈ విషయాలు తెలుసుకోవాలనుందా? అయితే ఆ వివరాలు ఏంటో చూసేయండి.
(ఇది చదవండి: హీరో సిద్దార్థ్ మాజీ భార్య గురించి తెలుసా?)
అదితి రావు హైదరి అక్టోబర్ 28న 1986న ఆంధ్రప్రదేశ్‌లోని హైదరాబాద్‌లో జన్మించింది. ప్రస్తుతం ఆమె వయస్సు 37 సంవత్సరాలు. మరోవైపు హీరో సిద్దార్థ్ 1979 ఏప్రిల్ 17న చెన్నైలో జన్మించారు. వీరిద్దరి మధ్య దాదాపు 7 సంవత్సరాల వయస్సు తేడా కనిపిస్తోంది. కాగా.. గతంలో అదితి సత్యదీప్ మిశ్రా అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. ఆ తర్వాత వీరిద్దరు విడిపోయారు. అతను ఇప్పుడు ఫ్యాషన్ డిజైనర్ మసాబా గుప్తాను రెండో పెళ్లి చేసుకున్నారు. సిద్ధార్థ్ సైతం మొదట మేఘనా నారాయణ్‌ను పెళ్లాడారు. ఆమెతో 2007లోనే సిద్ధార్థ్ విడాకులు తీసుకున్నారు.
ఇక సినిమాల విషయానికొస్తే అదితి రావు హైదరీ ప్రస్తుతం సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తోన్న నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్ హీరామండిలో కనిపించనుంది. హిందీలో ఎక్కువ చిత్రాలు చేసిన అదితి.. తెలుగులో సమ్మోహనం, వి, అంతరిక్షం, మహాసముద్రం మూవీస్‌లో హీరోయిన్‌గా మెరిసింది. మరోవైపు సిద్ధార్థ్.. కమల్ హాసన్ నటిస్తోన్న ఇండియన్ -2లో నటించనున్నారు. బాయ్స్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సిద్ధార్థ్.. నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు, ఆట, ఓయ్, ఓ మై ఫ్రెండ్ చిత్రాలతో మెప్పించారు.
Comments
Please login to add a commentAdd a comment