
న్యూ ఢిల్లీ: త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానున్న “ఏకే వర్సెస్ ఏకే” చిత్రంలోని కొన్ని సన్నివేశాలను తీసివేయాలని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ డిమాండ్ చేసింది. ఈ చిత్రంలో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ యూనిఫాం తప్పుగా ధరించారని, వాడకూడని భాష మాట్లాడారని భారత వైమానిక దళం బుధవారం చేసిన ఓ ట్వీట్‌లో పేర్కొంది. ‘‘ఇది భారత దళాలలో ఉన్నవారి ప్రవర్తనా నిబంధనలకు అనుగుణంగా లేదు. సంబంధిత దృశ్యాలను తీసివేయాలి’’ అని చిత్ర నిర్మాత అనురాగ్ కశ్యప్, నెట్‌ఫ్లిక్స్ ఇండియాను ఈ ట్వీట్‌లో ట్యాగ్ చేసింది. ఈ నేపథ్యంలో చిత్ర హీరో అనిల్ కపూర్ స్పందించారు. బుధవారం ట్విటర్ వేదికగా క్షమాపణలు చెబుతూ ఓ వీడియోను విడుదల చేశారు.
‘‘నా కొత్త చిత్రం ఏకె వర్సెస్ ఏకె ట్రైలర్ కొంతమందిని బాధపెట్టిందని తెలిసింది. నేను భారత వైమానిక దళం యూనిఫాం ధరించి అభ్యంతరకర భాషను మాట్లాడి అందరినీ బాధపెట్టినందుకు నా వినయపూర్వకమైన క్షమాపణలు తెలియజేస్తున్నాను’’ అని అన్నారు. విక్రమాదిత్య మోత్వానీ దర్శకత్వంలో వస్తున్న సినిమా ఏకే వర్సెస్ ఏకే. ఈ చిత్రంలో అనురాగ్ కశ్యప్ అనిల్ కపూర్ ముఖ్య పాత్రల్లో నటించారు. డిసెంబర్ 24న ఈ చిత్రం విడుదల కానుంది.