తమిళసినిమా: అందం, అభినయానికి మారు పేరు నటి ఐశ్వర్యారాయ్. కథానాయికగా హిందీ, తెలుగు, తమిళం వంటి భాషా చిత్రాల్లో నటించి మేటి నటిగా పేరు తెచ్చుకున్నారు. దర్శకుడు మణిరత్నం కోలీవుడ్‌కు పరిచయం చేసిన నటి ఐశ్వర్యారాయ్ అన్న విషయం తెలిసిందే. ఆమె మణిరత్నంను గురువుగా భావిస్తారు. కాగా కథానాయకిగా పరిచయం చేసిన ఆయనే ఐశ్వర్యారాయ్‌ను ఇప్పుడు ప్రతినాయకిగా చూపిస్తూ ఆమెలోని నటిని మరో కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నట్లు తాజా సమాచారం. మణిరత్నం ఏ చిత్రాన్ని చేసినా దాంట్లో ప్రత్యేకత ఖచ్చితంగా ఉంటుంది.
అలా తాజాగా ఆయన తెరకెక్కిస్తున్న భారీ చారిత్రాత్మక కథా చిత్రం పొన్నియన్ సెల్వన్. ఇందులో విక్రమ్, కార్తీ, జయంరవి, జయరాం, ఐశ్వర్యారాయ్, త్రిష వంటి ప్రముఖ తారాగణం నటిస్తున్నారు. మణిరత్నం మద్రాస్ టాకీస్ సంస్థ, లైకా ప్రొడక్షన్స్ సంస్థతో కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం, రవివర్మ ఛాయాగ్రహణం అందిస్తున్నారు.
రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ చిత్రం తొలి భాగాన్ని సెప్టెంబర్ 30వ తేదీన తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడం భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాగా ఇందులో నటి ఐశ్వర్యారాయ్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు, అందులో ఒకటి ప్రతినాయిక పాత్ర అని తాజాగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో పొన్నియన్ సెల్వన్ చిత్రంపై అంచనాలు, ఆసక్తి మరింత పెరుగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment