Viral: Ajay Devgn And Raveena Tandon Controversial Breakup Story Revealed - Sakshi
Sakshi News home page

పెళ్లికి ముందు అజయ్‌ దేవ్‌గణ్‌ ఓ ప్లే బాయ్‌!

Published Sun, Apr 18 2021 1:56 PM | Last Updated on Sun, Apr 18 2021 5:17 PM

Ajay Devgn And Raveena Tandon Breakup Love Story - Sakshi

• మొహబ్బతే

‘ఫ్యామిలీ మెన్‌’గా పేరుతెచ్చుకున్న చాలా మంది బాలీవుడ్‌ హీరోలు పెళ్లికి ముందు ‘ప్లే బాయ్‌’ ట్యాగ్‌ను మోసిన వాళ్లే. వాళ్లలో అజయ్‌ దేవ్‌గన్‌ ఒకడు. ఆశ్చర్యపోనవసరం  లేదు.. అతని లవ్‌ లిస్ట్‌లో కాజోల్‌ కంటే ముందు కరిష్మా.. ఆమె కంటే ముందు రవీనా టండన్‌ ఉన్నారు. 

అజయ్‌ సినిమా ఇండస్ట్రీకి వచ్చాక అతని ఫస్ట్‌ లవ్‌ రవీనా టండనే. ఆ ఇద్దరూ సినిమాల్లోకి రాకముందే అజయ్‌ సోదరి నీలం దేవగన్‌ రవీనాకు అత్యంత సన్నిహితురాలు. ఆ పరిచయం, చెలిమి అజయ్, రవీనా ఒకరంటే ఒకరు ఇష్టపడ్డానికి కారణమయ్యాయి.  ఆ ప్రేమ ‘దిల్‌వాలే’ సినిమా సెట్స్‌ మీద మొదలైంది. ‘ఏక్‌ హీ రాస్తా’తో మీడియాకు కబుర్లు పంచి పెట్టింది. సినీ పరిశ్రమలోనూ అజయ్, రవీనా లవ్వే టాపిక్‌ అయింది. ఆ ఇద్దరూ పెళ్లి  చేసేసుకుంటారనుకుంది. రవీనా కూడా అదే ఆశించింది. అజయ్‌ తనను పెళ్లి చేసుకుంటాడని కలలు కన్నది. కాని అజయే అంత సీరియస్‌గా లేడు ఆ రిలేషన్‌ పట్ల. తారల జీవితాల్లో అలాంటి సరదాలు సాధారణం.. తమ దోస్తీ గురించి రవీనానే చాలా ఎక్కువగా ఆలోచిస్తోంది అనుకున్నాడు అతను. 

ఆ సమయంలోనే.. 
అజయ్‌కి  కరిష్మా కపూర్‌ ఫ్రెండ్‌ అయింది. ఇద్దరూ కలసి ‘జిగర్‌’లో నటించారు. ఆ సినిమా షూటింగ్‌లోనే కరిష్మా అతణ్ణి ఆకట్టుకుంది. ఆమెను ప్రేమించడం మొదలుపెట్టాడు. ఈ కొత్త ఫ్రెండ్‌షిప్‌లో పడి రవీనాను నిర్లక్ష్యం చేయసాగాడు.  బిజీ షెడ్యూళ్ల వల్ల కలవలేకపోతున్నాడేమో అనుకుంది రవీనా. అందుకే  ఏ మాత్రం వీలు చిక్కినా తనే అజయ్‌కి ఫోన్‌ చేసేది (అప్పుడు సెల్‌ ఫోన్లు లేవు.. ల్యాండ్‌ ఫోన్లే). చాలా సార్లు షూటింగ్‌కి వెళ్లిపోయాడు అనే సమాధానం వచ్చేది అతని సంబంధీకుల నుంచి. అదృష్టవశాత్తు ఎప్పుడో ఒకసారి అజయ్‌ ఫోన్‌ అందుకున్నా... పొడిపొడిగానే మాట్లాడి కట్‌ చేసేవాడు. అతని ఆ తీరుకూ మనసును సర్దుబాటు చేసుకున్న ఆమె.. ఆ టైమ్‌లో కరిష్మా, అజయ్‌ గురించి మీడియాలో వస్తున్న కథనాలను మాత్రం కొట్టిపారేయలేకపోయింది.

అజయ్‌ చపలచిత్తం రవీనాను కలతకు గురిచేసింది. మోసం చేశాడని బాధ పడింది. ఆ అవమానాన్ని తట్టుకోలేక ఆత్మహత్యకూ ప్రయత్నించిందంటారు. కరిష్మాతో కలిసి  ‘అందాజ్‌ అప్నా అప్నా’లో నటించినా అజయ్‌ వల్ల ఆమెతో స్నేహాన్ని కొనసాగించలేకపోయింది రవీనా. పైగా ఇద్దరి మధ్య ప్రచ్ఛన్న యుద్ధమే నడిచిందట. పార్టీలు, ఫంక్షన్లలో ఒకరికొకరు తారసపడినా మొహం తిప్పేసుకునేవాళ్లని,  ఫొటోలకు పోజులిచ్చేవారు కాదని చెప్తుంది ముంబై మీడియా. కరిష్మా కోసం రవీనాకు దూరమై.. ఆ ఇద్దరి మధ్య వైరాన్ని సృష్టించిన అజయ్‌ కాజోల్‌ కోసం కరిష్మానూ కాదనుకున్నాడు.

చిరాకు, చిటపటలతోనే.. 
కాజోల్, అజయ్‌ కాంబినేషన్‌లో వచ్చిన తొలి సినిమా ‘హల్‌చల్‌’. ఆ చిత్రం సెట్స్‌ మీదకు వెళ్లేనాటికి ఆ ఇద్దరిలో  ఒకరంటే ఒకరికి ఆసక్తి అటుంచి సహజసిద్ధమైన కుతూహలం కూడా లేదు. ఆచితూచి మాట్లాడే అజయ్‌ దేవ్‌గన్‌కు గలగలా మాట్లాడే కాజోల్‌ వసపిట్టలా అనిపించింది. నిత్యం ఉల్లాసంగా ఉండే కాజోల్‌కు ఉదాసీనంగా కనిపించాడు అజయ్‌. పరస్పర విరుద్ధ స్వభాలున్న ఈ ఇద్దరినీ కలిపింది ఒకటే.. అప్పటికే విడివిడిగా మునిగున్న పీకల్లోతు ప్రేమ నుంచి బయటకు వచ్చేద్దామా? వద్దా? అన్న సంశయం.

అవును.. అజయ్‌ కరిష్మాతో.. కాజోల్‌ కార్తిక్‌ మెహతాతో ప్రేమలో ఉన్నారు. అయితే ఆ భాగస్వాములతో ఇద్దరూ సంతోషంగా లేరు.  వీళ్లిద్దరి మధ్య కొంచెం స్నేహం పెరిగాక కాజోలే చనువు తీసుకుంది..  కార్తిక్‌ మెహతాతో తన రిలేషన్‌కు సంబంధించి అజయ్‌ను సలహా అడిగి. ఆమె నిర్మొహమాటత్వం, లౌక్యంలేనితనం అజయ్‌కు నచ్చాయి. ‘జీవితాంతం ఈ అమ్మాయి తోడుంటే బాగుండు’ అనుకున్నాడు. ఆ క్షణం నుంచే కాజోల్‌ మీద అభిమానం కురిపించడం ప్రారంభించాడు. కొన్నాళ్లకు ఆ అభిమానం మరింత చిక్కపడి కాజోల్‌కు ప్రేమ భావనను పంచింది.  ‘ప్రేమిస్తున్నాను’ అనే మాటే చెప్పుకోకుండా ప్రేమించే మనసునే  ‘పెళ్లి’ మంత్రంగా  మార్చుకొని అన్యోన్యతను స్థిరం చేసుకున్నారిద్దరూ!  

అజయ్, కరిష్మా గౌరవంగానే విడిపోయినా.. అజయ్, రవీనా బ్రేకప్‌ మాత్రం మీడియాకెక్కింది. రవీనాతో ప్రేమలో పడ్డ విషయాన్ని అజయ్‌ ఎప్పుడూ ఒప్పుకోలేదు. ‘రవీనా పట్ల నేనెప్పుడూ ఆసక్తి చూపలేదు. ప్రేమనూ ఎక్స్‌ప్రెస్‌ చేయలేదు’ అని చెప్పాడు ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.  కానీ రవీనా అతని మాటలను కొట్టిపారేసింది.  ‘అజయ్, నేను ప్రేమించుకున్నాం.  లెటర్స్‌ కూడా రాసుకున్నాం’ అన్నది. ‘రవీనా పుట్టు అబద్ధాల కోరు. నేను ఆమెకు  లెటర్స్‌ రాసిన మాట నిజమే అయితే వాటిని చూపించమనండి.. పబ్లిష్‌ చేయమనండి.. ఎలా రాశానో చూడాలని నాకూ ఉంది’ అని సవాలు విసిరాడు అజయ్‌. అక్కడితో ఆగలేదు.. రవీనాకు మానసిక వైద్యం అవసరమని, ఆమె మెంటల్‌ హాస్పిటల్‌లో చేరితే మంచిదనీ కామెంట్‌ చేశాడు.  ఈ  ఘాటు విమర్శలతో వాళ్ల మధ్య ఉన్న  స్నేహం కూడా  ఇగిరిపోయింది.
- ఎస్సార్‌

చదవండి: బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవ్‌గణ్‌పై దాడి?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement