ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనేప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో హిందీ చిత్రం ‘అకేలీ’ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.
పోరాట పటిమ కలిగి ఉన్న ఎంతోమంది స్త్రీమూర్తులను నాటి చరిత్ర నుండి నేటి వరకు వెండితెర పై చూస్తూనే ఉన్నాం. కానీ వర్ధమాన స్థితిగతులకు అనుగుణంగా వాస్తవ ఘటనల ఆధారంగా వచ్చిన ‘అకేలీ’ సినిమా నేటి తరం స్త్రీ యోధురాలిని ప్రతిబింబించింది. 2014లో మిడిల్ ఈస్ట్‌లోని తీవ్రవాద సంస్థ ఐసిస్ చేసిన ఓ ఘాతుకానికి రూపమే ఈ ‘అకేలీ’ సినిమా. అప్పట్లో మొసూల్ నగరం నుండి దాదాపు 39 మంది భారతీయులతో పాటు 46 మంది నర్సులను బంధీలుగా పట్టుకుంది ఐసిస్. ఆ తర్వాత ఎన్నో వ్యయప్రయాసలతో వారంతా క్షేమంగా విడుదలయ్యారు.
ఈ ఘటనను నేపథ్యంగా తీసుకుని దర్శకులు ప్రణయ్ మిశ్రమ్ ‘అకేలీ’ సినిమాను తీర్చిదిద్దారు. ఈ సినిమాలో ప్రధాన పాత్రను పోషించిన నుష్రత్ భరూచ కథలోని జ్యోతి పాత్రకుప్రాణం పోశారు. కథాపరంగా పొట్టకూటి కోసం భారతదేశం నుండి మొసూల్ బయలుదేరిన జ్యోతి ఆ దేశంలో అడుగుపెట్టడంతోనే అక్కడి ఓ ఘటనతో చలించిపోతుంది. ఆ తర్వాత ఐసిస్ తీవ్రవాదులు జ్యోతి గ్రూప్‌ను బంధీలుగా చేసుకుని తమ స్థావరాలకు తీసుకువెళతారు.
శత్రు దుర్భేద్యమైన ఐసిస్ స్థావరం, క్రూరత్వం కోరలు కలిగిన తీవ్రవాదుల మధ్య జ్యోతి ఎటువంటి కష్టాలను అనుభవించింది? ఎలా తప్పించుకొని తిరిగి భారతదేశం చేరిందన్నదే మిగతా సినిమా. అసాధ్యాన్ని సుసాధ్యం చేసే జ్యోతి పాత్ర ఈ సినిమాకి ఆయువుపట్టు. సినిమా నడుస్తున్నంతసేపు కుర్చీ నుంచి కదలకుండా చేస్తుంది స్క్రీన్ ప్లే. కొంత హింస, కొన్ని అశ్లీల సన్నివేశాలున్నాయి కాబట్టి పిల్లలను దూరంగా ఉంచి ఈ సినిమాని పెద్ద వాళ్లు మాత్రం చూడవచ్చు. ‘జియోసినిమా’ ఓటీటీలో ఈ చిత్రం స్ట్రీమ్ అవుతోంది. – ఇంటూరు హరికృష్ణ
Comments
Please login to add a commentAdd a comment