
‘‘బాలకృష్ణగారు ఈ స్థాయిలో ఉన్నారంటే కారణం రెండు విషయాలు. ఒకటి ఆయనకు సినిమాలపై ఉన్న ఎడిక్షన్, రెండు సినిమాలో ఆయనకు ఉన్న డిక్షన్ (వాచకం). ఆయన చెప్పినట్లు డైలాగులు ఎవరూ చెప్పలేరు’’ అని అల్లు అర్జున్ అన్నారు. బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అఖండ’. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం డిసెంబరు 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన ‘అఖండ’ ప్రీ రిలీజ్ వేడుకలో ‘జై బాలయ్య’ పాటను దర్శకుడు రాజమౌళి విడుదల చేయగా, ఈ సినిమా రిలీజ్ టీజర్, బిగ్ టికెట్‌ను హీరో అల్లు అర్జున్ విడుదల చేశారు.
అల్లు అర్జున్ మాట్లాడుతూ – ‘‘రీల్‌లోనైనా.. రియల్‌గా అయినా బాలకృష్ణగారు రియల్‌గానే ఉంటారు. ఆయనలోని ఈ క్వాలిటీ నాకు ఇష్టం. సెకండ్ లాక్‌డౌన్ తర్వాత వస్తున్న పెద్ద సినిమా ‘అఖండ’ తెలుగు పరిశ్రమకు ఓ అఖండజ్యోతిలా వెలుగు ఇవ్వాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.
రాజమౌళి మాట్లాడుతూ – ‘‘బాలకృష్ణగారు ఓ ఆటమ్‌బాంబు. ఆ బాంబు ఎలా ప్రయోగించాలో బోయపాటి శ్రీనుకు తెలుసు. ఈ సినిమా మంచి విజయం సాధించి, ఇండస్ట్రీకి కొత్త ఊపును తీసుకురావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.
బాలకృష్ణ మాట్లాడుతూ – ‘‘అఖండ’ గురించి ఎక్కువగా చెప్పదలచుకోలేదు. థియేటర్స్‌లో చూస్తారు. దురదృష్టవశాత్తు కరోనా వల్ల ఫిల్మ్ ఇండస్ట్రీ స్తంభించిపోయింది. మా సినిమా తర్వాత ‘ఆచార్య’, ‘ఆర్‌ఆర్‌ఆర్’, ‘పుష్ప’.. ఇలా ఎన్నో సినిమాలు విడుదలవుతున్నాయి. పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలు కూడా ఆడాలని కోరుకుంటున్నాను. ఇందుకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సహకరించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘జై బాలయ్య’ పాటకు సాధన చేసే ప్రక్రియలో భాగంగా బాలకృష్ణగారు జారిపడ్డారు.. భుజానికి గాయమైనా బాలయ్య సాంగ్ చేశారు. అదీ బాలయ్య’’ అన్నారు బోయపాటి శ్రీను. ఈ వేడుకలో గాయకుడు ఎస్పీ చరణ్, గోపీచంద్ మలినేని, సాయి కొర్రపాటి, వై. రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment