Wild Dog Movie Press Meet: Akkineni Nagarjuna Speech At Wild Dog Movie Press Meet - Sakshi
Sakshi News home page

వారి వల్లే స్టార్‌ అయ్యా: నాగార్జున

Published Thu, Apr 1 2021 12:40 AM | Last Updated on Thu, Apr 1 2021 10:29 AM

Akkineni Nagarjuna Speech At Wild Dog Movie Press Meet - Sakshi

‘‘ఒకే రకమైన జానర్స్‌లో చేసిన పాత్రలే మళ్లీ మళ్లీ చేస్తే బోర్‌ కొడుతుంది. కొత్త దర్శకులైతే నా పాత్రలు కూడా కొత్తగా ఉంటాయి. నా నటన కూడా రొటీన్‌గా కాకుండా మారుతుందనే నమ్మకం ఉంది. అందుకే కొత్త డైరెక్టర్స్‌తో పని చేయడానికి ఆసక్తి చూపిస్తాను. నేను ఈ రోజు ఇంత పెద్ద స్టార్‌ అయ్యానంటే కేవలం కొత్త దర్శకులు, కొత్తదనం వల్లే’’ అని హీరో నాగార్జున అన్నారు. అహిషోర్‌ సాల్మన్‌ దర్శకత్వంలో నాగార్జున హీరోగా తెరకెక్కిన చిత్రం ‘వైల్డ్‌డాగ్‌’. నిరంజన్‌ రెడ్డి, అన్వేష్‌ రెడ్డి నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో నాగార్జున చెప్పిన విశేషాలు.

► వాస్తవ సంఘటనలతో తెరకెక్కిన చిత్రం ‘వైల్డ్‌ డాగ్‌’. ఇలాంటి సినిమాలో కమర్షియల్‌ యాక్షన్‌కి వీలుండదు.. అందుకే ఒక కొత్త రకమైన యాక్షన్‌ ఎపిసోడ్స్‌ని ఈ సినిమాలో పెట్టాం. నాకు ఫిట్‌నెస్‌ అంటే ఇష్టం కావడంతో ఇందులో యాక్షన్‌ సీక్వెన్స్‌కి పెద్దగా కష్టపడలేదు. అయితే మనాలీలో యాక్షన్‌ సీక్వెన్స్‌ చేయడం కొంచెం కష్టం అనిపించింది. కానీ ఆ సీక్వెన్స్‌ ఆడియన్స్‌కి ఎగై్జటింగ్‌గా అనిపిస్తాయి.  

► ఈ సినిమాలో ఏసీపీ విజయ్‌ వర్మగా నటించాను. ఒక మంచి భర్త, మంచి తండ్రితో పాటు మంచి ఎన్‌ఐఎ టీమ్‌ లీడర్‌గా కనిపిస్తాను. దేశంలో శాంతి భద్రతకు విఘాతం కలిగించే టెర్రరిస్ట్‌ను పట్టుకోవడమే విజయ్‌ వర్మ లక్ష్యం. ‘వైల్డ్‌ డాగ్‌’ కొత్త కమర్షియల్‌ ఫిల్మ్‌. ఈ సినిమా, నా పాత్ర అభిమానులందరికీ నచ్చుతుంది.. వారందరూ గర్వపడతారు.


ట్రైలర్‌ చూసి సినిమాకి వెళ్లాలా? వద్దా? అని ప్రేక్షకులు ఓ నిర్ణయానికి వచ్చేస్తున్నారు. అందుకే సినిమాకి ఎంత జాగ్రత్తలు తీసుకున్నామో.. ట్రైలర్‌కి కూడా అంతే జాగ్రత్తలు తీసుకున్నాం.

► నా ప్రతి సినిమాని బాగా ప్రమోట్‌ చేస్తాను. అయితే ‘వైల్డ్‌ డాగ్‌’కి మాత్రం ఇంకొంచెం ఎక్కువ చేస్తున్నాను. ఎందుకంటే ఈ సినిమాలో నేనొక్కడే అందరికీ తెలుసు. దర్శకుడుతో సహా అందరూ కొత్తవాళ్లే.. పైగా ఇదొక న్యూ ఏజ్‌ ఫిల్మ్‌.  

► నేను ‘శివ’ సినిమా చేస్తున్నప్పుడు వయొలెన్స్‌ ఎక్కువగా ఉంది.. మహిళలకు నచ్చదేమో అనుకున్నారు. కానీ, ఆ సినిమాను మహిళలు కూడా బాగా ఆదరించారు.  ‘వైల్డ్‌ డాగ్‌’ సినిమా కూడా కుటుంబ ప్రేక్షకులకూ చేరువవుతుందనే నమ్మకం ఉంది.

► ‘బ్రహ్మాస్త్ర’ చిత్రంలో నాది పవర్‌ఫుల్‌ పాత్ర. కల్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో నేను, నాగచైతన్య కలిసి చేయనున్న ‘బంగార్రాజు’ స్క్రిప్ట్‌ రెడీగా ఉంది. నేను, అఖిల్‌ కలసి ఓ యాక్షన్‌ మూవీ చేయాలనుంది. నేను నిర్మాతగా రాజ్‌ తరుణ్‌ హీరోగా కొత్త దర్శకుడితో ఓ సినిమా షూటింగ్‌ జరుగుతోంది. ఆ తర్వాత వైష్ణవ్‌ తేజ్‌తో సినిమా ఉంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement