అక్కినేని నాగేశ్వరావు జీవితంలో తక్కువగా తెలిసిన, కానీ ఎంతో లోతైన అంశం ఆయనకు ఇంగ్లీష్ భాషతో ఉన్న అనుబంధం. ఒకసారి అమెరికా వెళ్లినప్పుడు ఇంగ్లీష్ భాషలో ప్రవేశం లేనందుకు ఆయనని హేళన చేశారు. ఆ అవమాన భారంతో గుండెలు మండి బాత్ రూమ్‌లోకి వెళ్ళి బాధతో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ సంఘటన ఆయన జీవితంలో ఓ మలుపుగా మారింది. నాగేశ్వరరావు ఇంగ్లీష్ నేర్చుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇంగ్లీష్ పత్రికలను ప్రధాన వనరుగా చేసుకొని, ప్రతిరోజూ పత్రిక చదువుతూ, ఆంగ్ల భాషపై ప్రావీణ్యం సంపాదించడానికి కృషి చేశారు. కొంత కాలం పిదప ఆయన తన ఆంగ్ల భాషా ప్రావీణ్యం ప్రదర్శిస్తూ, చక్కటి శైలితో ఆకట్టుకున్నారు. ఒకప్పుడు బాధ పెట్టిన విషయమే ఆయనకు విజయంగా మారింది.
స్కూల్‌కు వెళ్లలేదు, కానీ తానే విశ్వవిద్యాలయం అయ్యాడు
అక్కినేని పాఠశాలకు వెళ్లలేదు. పెద్ద చదువులు చదవలేదు. కానీ సినీ కళపై ఉన్న అంకితభావంతో స్కూల్‌కు వెళ్లకపోయినా, నటన కళలో నైపుణ్యాన్ని సంపాదించుకున్నారు. సినిమాను తన తరగతి గది అనుకున్నారు. ప్రతి పాత్ర, ప్రతి సన్నివేశం ఆయనకు ఓ పాఠం. అంచలంచెలుగా ఎదిగారు. క్రమశిక్షణ, అకుంఠిత దీక్ష, పట్టుదల, కఠోర శ్రమ, శ్రద్ధతో నేర్చుకోవడం వలన ఆయన తానే ఓ విశ్వవిద్యాలయంగా ఆవిర్భవించారు. ఎంతో మందికి ఆదర్శవంతులయ్యారు.
-సందీప్ ఆత్రేయ, సాక్షి పోస్ట్
Comments
Please login to add a commentAdd a comment