అక్షయ్ కుమార్ కీలక పాత్రలో అమిత్ రాయ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఓ మై గాడ్ 2' ఎన్నో వివాదాల మధ్య విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇందులో పంకజ్ త్రిపాఠి, యామీ గౌతమ్, గోవింద నామ్‌దేవ్ కీలక పాత్రలు పోషించారు. అయితే దీని కోసం అక్షయ్ కుమార్ భారీగా రెమ్యునరేషన్ తీసుకున్నారని వార్తలు వచ్చాయి. తాజాగా వీటిపై నిర్మాతల్లో ఒకరైన అజిత్ అంధరే స్పందించారు.
ఈ సినిమా కోసం అక్షయ్ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు. ఈ సినిమా విడుదలైన రోజు నుంచే మంచి టాక్ తెచ్చుకోవడంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఇప్పటి వరకు రూ.150కోట్లు వసూళ్లు చేసిందని చిత్రబృందం ప్రకటించింది. అక్షయ్ కుమార్ శివుడి పాత్రను పోషించగా ఆయన భక్తుడిగా పంకజ్ త్రిపాఠి నటించారు.
(ఇదీ చదవండి: రెమ్యునరేషన్ తిరిగిచ్చేసిన మెగాస్టార్.. ఎంతో తెలుసా..?)
అక్షయ్ రెమ్యునరేషన్‌పై 'ఓమైగాడ్2' నిర్మాతల్లో ఒకరైన అజిత్ అంధరే ఇలా స్పందించారు 'ఈ సినిమా ప్రకటించిన సమయం నుంచి అక్షయ్ రెమ్యునరేషన్‌పై వస్తున్న వార్తలు చూస్తుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఆయన భారీగా పారితోషికం తీసుకున్నారని ప్రచారం జరిగింది. అందులో ఏ మాత్రం నిజం లేదు. ఈ సినిమా కోసం అక్షయ్ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. ఇంకా చెప్పాలంటే సినిమాకు బడ్జెట్ విషయంలో లోటుపాట్లు ఉంటే ఆయనే ఆర్థికంగా సాయం చేశారు.
మా మధ్య ఉన్న స్నేహం ఇప్పటిది కాదు. 'ఓ మైగాడ్' మొదటి భాగం వచ్చినప్పటి నుంచి మేము కలిసి సినిమాలు తీస్తున్నాం.' అని అన్నారు. ఈ సినిమా నిర్మాతల్లో అక్షయ్ కూడా ఒకరని అజిత్ అంధరే తెలిపారు. కాబట్టి సినిమాకు వచ్చిన లాభాల్లో మాత్రమే ఆయనకు షేర్ ఉంటుందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment