ఆలియా భట్.. అభినయమే ఆమెను అభివర్ణిస్తుంది..
సిద్ధార్థ్ మల్హోత్రా.. నటుడిగా నిరూపించుకోవాలన్న తపనే అతన్ని నిలబెడుతోంది..
కెరీర్, క్యారెక్టర్ మధ్య ఉన్న ఆ అంతరమే ఈ ఇద్దరి ప్రేమను కొనసాగనివ్వలేదు!
ఆ బ్రేకప్ స్టోరీనే చెబుతోంది ఇవ్వాళ్టి ‘మొహబ్బతే’...
వారసత్వ పరిఛాయే ఆలియాకు సినీరంగ ప్రవేశం కల్పించినా.. ప్రతిభతోనే స్థిరపడింది. అందం ఆమెకు అదనపు ఆకర్షణ మాత్రమే అయింది. ఆలియా ఎంట్రీకి పూర్తి భిన్నమైన ఇంట్రడక్షన్ సిద్ధార్థ్‌ది. పద్దెనిమిదో ఏటనే మోడలింగ్‌లోకి అడుగుపెట్టి.. ఆ గ్రాఫ్‌ని కిందపడకుండా చూసుకున్నాడు. అయినా ఆ రంగం మీద ఆసక్తి తగ్గిపోయి సినిమా వైపు కదిలాడు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా కరణ్ జోహార్ దగ్గర చేరి ‘మై నేమ్ ఈజ్ ఖాన్’కి పనిచేశాడు.
లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కాదు
2012లో ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ సినిమా విడుదలైంది. అది (వరుణ్ ధవన్‌తో పాటు) ఆలియా, సిద్ధార్థ్‌లకూ మొదటి సినిమా. అయితే ఇదివరకు చెప్పుకున్న సినిమా వాళ్ల ప్రేమ కథల్లా ఈ జంట మధ్య లవ్ ఆ సినిమా సెట్స్ మీద స్టార్ట్ కాలేదు. స్నేహం మాత్రమే ఏర్పడింది. అది అలా కొనసాగి కొనసాగి ప్రేమగా మారింది. ఆ విషయాన్ని కాఫీ విత్ కరణ్ షోలో సిద్ధార్థ మల్హోత్రే చెప్పాడు.. ‘మేమిద్దరం బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్‌గా కలవలేదు. అంటే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కాదు అని. డేటింగ్ కంటే ముందు నుంచే ఆలియా నాకు తెలుసు.. స్నేహితురాలిగా. మా ఫ్రెండ్‌షిప్ ఎప్పుడు ప్రేమగా మారిందో కూడా తెలీలేదు’ అని.
షికార్లు.. పుకార్లు యాజ్ యూజువల్..
వీళ్లిద్దరూ కలసి నటించింది ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’, ‘కపూర్ అండ్ సన్స్’ .. ఈ రెండు సినిమాల్లోనే. అందుకే సెట్స్ మీద పుట్టే ఆకర్షణ కన్నా.. సినిమాకవతలి అవగాహనతోనే దగ్గరయ్యారు. ఇద్దరి షెడ్యూల్స్‌లోని ఖాళీ సమయాల్లో షికార్లకెళ్లారు.. పార్టీలు చేసుకున్నారు.. హ్యాంగవుట్స్‌తో సేద తీరారు. అవన్నీ మీడియాలోని సినిమా కాలమ్స్‌లో ఎక్స్‌ట్రా స్పేస్‌ను తీసుకున్నాయి. బాలీవుడ్ జనాలు ఈ జంట మీద కామెంట్లు సంధించేకంటే ముందే తమ ప్రేమను ప్రకటించాలని నిర్ణయించుకున్నారిద్దరూ.
ఆలియా స్టార్ అయ్యింది..దూరం పెరిగింది
ఆలియా నటించిన సినిమాలు హిట్ల మీద హిట్లు కొడుతూ ఆమెను స్టార్‌గా మార్చేశాయి. సిద్ధార్థ్ ఎంచుకున్న సినిమాలు ఫ్లాప్‌లతో నటుడిగా అతన్ని నిరూపించుకునే ప్రయత్నలలోనే ఉంచేశాయి. ఇది సహజంగానే అతని ఈగోని ప్రభావితం చేసింది. మానసికంగా ఆలియాతో దూరాన్ని పెంచింది. ఆ దూరాన్ని తను నటిస్తున్న సినిమాల్లోని కథానాయికల దగ్గర సాన్నిహిత్యంగా మలచుకున్నాడు సిద్ధార్థ్. అలా అతని జీవితంలోకి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ వచ్చింది ‘ఎ జెంటిమన్’ చిత్రంతో.
సిద్ధార్థ్ లైఫ్‌లోకి జాక్వెలిన్ ఎంట్రీ
ఆ సినిమా సెట్స్ మీద వాళ్లిద్దరూ ఒకరి ఆకర్షణకు ఒకరు లోనయ్యారు. షూటింగ్ అయిపోయాక కూడా మియామీ (అమెరికా) బీచుల్లో గంటలు గంటలు కాలక్షేపం చేశారు. లాంగ్ డ్రైవ్‌లకు వెళ్లారు. డిన్నర్ డేట్స్ పెట్టుకున్నారు. ఆ సమయంలో ఆలియాతో మాటలు, మంచిచెడుల విచారణ మిస్ అయింది ఆ ప్రేమ డైరీలో. సిద్ధార్థ్ ఎందుకలా ప్రవర్తిస్తున్నాడు అని ఆలియాకు అనుమానం వచ్చేలోపలే జాక్వెలిన్‌తో అతని వ్యవహారం ఆమె చెవిన పడింది. ఫీలైంది. పొగిలి పొగిలి ఏడ్చింది. తనను అతను అర్థం చేసుకుంది అంతేనా? అని బాధ పడింది. ఆ ప్రేమకు బలం లేదని నిర్ధారించుకుంది. సిద్ధార్థ్‌ను క్షమించింది.. కెరీర్ మీద మరింత దృష్టి పెట్టింది.
బ్రేకప్‌కి కొన్ని కారణాలున్నాయి
ఇద్దరూ కలుసుకున్నప్పుడు.. సంజాయిషీ అడిగారు.. ఇచ్చుకున్నారు. ‘స్నేహాన్ని మాత్రం భద్రం చేసుకుందాం..’ అని నిశ్చయించుకున్నారు. ఆ మాట మీదే ఉన్నారు. అలా నాలుగేళ్ల ఆ ప్రేమకు బ్రేక్ పడింది. విడివిడిగా వాళ్ల ప్రయాణం కొనసాగింది. ‘కలసి ఉండాలి అనుకోవడానికి ఏ రీజన్ లేకపోయినా విడిపోవాలి అనుకోవడానికి కచ్చితంగా కారణం ఉంటుంది. అలా మా బ్రేకప్‌కీ మాకంటూ కొన్ని కారణాలున్నాయి. నాలుగేళ్ల మా సాహచర్యంలో సంతోషాలెన్నో.. స్పర్ధలూ అన్నే. స్పర్థలను మరిచిపోయి... హ్యాపీ మూమెంట్స్‌నే గుర్తుపెట్టుకోవాలి అనుకున్నాం. అందుకే విడిపోయినా ఫ్రెండ్స్‌గా హాయిగా.. హ్యాపీగా ఉన్నాం’ అని చెప్పాడు సిద్ధార్థ్ మల్హోత్రా కాఫీ విత్ కరణ్ షోలో.
‘సిద్ధార్థ్, నేను ఒకేసారి ఫీల్డ్‌లోకి వచ్చాం. మా ఇద్దరి మధ్య బోలెడంత చరిత్ర ఉంది. మేం కలసి చేసిన ప్రయాణంలోని ఎన్నో మలుపులకు ఇద్దరం సాక్షులమే. నిజం చెప్పాలంటే.. సిద్ధార్థ్ మీద నాకెలాంటి నెగెటివ్ థాట్స్ లేవు. అతనంటే అప్పుడెంత గౌరవం ఉందో.. ఇప్పుడూ అంతే ఉంది. నా విషయంలో తనూ అలాగే ఉన్నాడనుకుంటున్నాను. మాట్లాడాలనిపించినప్పుడు మాట్లాడుకుంటాం.. కలవాలనిపిస్తే కలుస్తాం.. ఎలాంటి బ్యాడ్ వైబ్స్ లేకుండా’ అని ఆలియా భట్ కూడా చెప్పింది ఓ ఇంటర్వ్యూలో. అయితే ఈ జంట విడిపోవడానికి సిద్ధార్థ్ మల్హోత్రా.. ఆలియాకు కమింట్‌మెంట్ ఇవ్వకపోవడమే కారణమంటాయి బాలీవుడ్ వర్గాలు.
∙ఎస్సార్
Comments
Please login to add a commentAdd a comment