2020.. చిత్ర పరిశ్రమకు భారీ నష్టాన్ని మిగిల్చింది. కరోనా మహమ్మారి వల్ల సినిమా షూటింగ్స్ ఆగిపోయాయి. థియేటర్లు మూతపడడంతో షూటింగ్ పూర్తయిన సినిమాలు విడుదలకు నోచుకోలేదు. దీంతో గత ఏడాది మొత్తం సినీ ప్రియులకు నిరాశే మిగిలింది. ఇప్పుడిప్పుడే థియేటర్లు తెరుచుకోవడం, ఇటీవల థియేటర్లలో రిలీజైన సోలో బ్రతుకే సో బెటర్ సినిమా హిట్ కావడం దర్శకనిర్మాతలకు నూతనోత్సాహాన్ని ఇచ్చింది. దీంతో ఈ సంక్రాంతికి థియేటర్లలో మోత మోగించడానికి స్టార్ హీరోలు రెడీ అవుతున్నారు. వరుసగా భారీ సినిమాలను విడుదల చేస్తూ ఇంత కాలం సినీ ప్రియులు కోల్పోయిన వినోదాన్ని వడ్డీతో సహా ఇవ్వడానికి సిద్దమయ్యారు. ఈ సంక్రాంతిలో సందడి చేయనున్న సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం.
రచ్చ చేయనున్న మాస్ మహారాజ్
మాస్ మహారాజ్ రవితేజ, గోపిచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న హ్యాట్రిక్ చిత్రం ‘క్రాక్’. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. డాన్ శీను, బలుపు చిత్రాల తర్వాత రవితేజ, గోపిచంద్ కాంబినేషన్‌లో వస్తున్న హ్యాట్రిక్ సినిమా కావడంతో ‘క్రాక్’పై భారీ అంచనాలు ఉన్నాయి.
థియేటర్లలో పాఠాలు చెప్పనున్న ‘మాస్టర్’
తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన ‘మాస్టర్’ సినిమాను జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మాళవిక మోహన్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో విజయ్ సేతుపతి విలన్‌గా నటించాడు. ఈ చిత్రంలో ఆండ్రియా జెరెమియా, రమ్య సుబ్రమణియన్, అర్జున్ దాస్, శాంతను భాగ్యరాజ్, నాసర్, ధీనా, సంజీవ్, శ్రీనాథ్, శ్రీమాన్, సునీల్ రెడ్డి కీలకపాత్రల్లో నటించారు. తొలుత ఈ చిత్రాన్ని ఈ ఏడాది ఏప్రిల్ 9 న విడుదల చేయాలని భావించారు. కానీ కరోనా లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడింది. దీంతో సంక్రాంతిని పురస్కరించుకొని జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.
రెడీగా ఉన్న ‘రెడ్’
ఎనర్జిటిక్ స్టార్ రామ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం ‘రెడ్’. తమిళ మూవీ ‘తడమ్’కు ఇది రీమేక్. కిషోర్ తిరుమల దర్శకత్వంలో వహించిన ఈ సినిమాలో రామ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. నివేదా పేతురాజ్, మాళవికా శర్మ, అమృతా అయ్యర్‌లు కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతమందిస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
అలరించేందుకు రెడీ అంటున్న ‘అల్లుడు’
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తాజాగా నటిస్తున్న సినిమా అల్లుడు అదుర్స్. కందిరీగ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాలో నభా నటేష్, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటించారు. ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ను సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు చిత్రయూనిట్. అల్లుడు అదుర్స్ ను జనవరి 15న రిలీజ్ చేస్తున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది.
వీటితో పాటు దాదాపు కొన్ని చిన్న సినిమాలు కూడా రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. ఇలా వరుస సినిమాలను విడుదల చేస్తూ.. ఇన్ని రోజులు మిస్ అయిన వినోదాన్ని అందించేందుకు చిత్రపరిశ్రమ సిద్దమైంది. మరీ ఇందులో ఏ సినిమా ప్రేక్షకులను అలరించి సంక్రాంతి హిట్‌గా నిలుస్తుందో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment