Red Movie
-
Ram Pothineni: ఆ ఘనత సాధించిన ఏకైక సౌత్ హీరో రామ్ ఒక్కడే
సినీ బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ ఎంతో కష్టపడుతూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకునన హీరో రామ్ పోతినేని. క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అన్ని రకాల సినిమాలు చేస్తూ ఎనర్జిటిక్ స్టార్‌గా పేరు సంపాదించుకున్నాడు. యాక్టింగ్‌తో పాటు స్టయిల్‌ను, ఎనర్జీని జోడించి వెండితెరపై కిర్రాక్ పుట్టించే యంగ్ హీరోల్లో రామ్‌ఒకరు. నేడు (మే 15) రామ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని ఆసక్తికర విషయాలు.. రామ్ పోతినేని మే 15, 1988న మురళీ పోతినేని, పద్మశ్రీ దంపతులకు జన్మించారు. ప్రముఖ సినీ నిర్మాత ‘స్రవంతి’రవికిశోర్ తమ్ముడే మురళీ పోతినేని. పెదనాన్న అడుగుజాడల్లో నడుస్తూ.. సినిమాలపై వైపు వచ్చాడు. 2002లో తమిళంలో తెరకెక్కిన అడయాళం అనే షార్ట్ ఫిలిమ్‌తో రామ్ తన యాక్టింగ్ కెరీర్‌ని ప్రారంభించారు. ఆ తర్వాత వైవీఎస్ చౌదరీ దర్శకత్వం వహించిన దేవదాస్(2006) సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యాడు. తొలి సినిమాలోనే రామ్ అదరగొట్టాడు. తన నటన, డ్యాన్స్‌కు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ సినిమా హిట్‌తో రామ్‌కి తెలుగులో వరుసగా ఆఫర్లు వచ్చాయి. అయితే రామ్ మాత్రం కథలను ఆచితూచి ఎంచుకున్నాడు. రెండో చిత్రం ‘జగడం’ప్లాపును మూట గట్టుకున్నప్పటికీ.. రామ్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత 2008లో శ్రీను వైట్ల దర్శకత్వంలో ‘రెడీ’చేసి బాక్సాఫీస్ వద్ద సత్తాచాటాడు. అయితే ఆ తర్వాత రామ్‌కి పెద్దగా హిట్లు లభించలేదు. అతను నటించిన ‘మస్కా’, ‘రామరామ కృష్ణకృష్ణ’, ‘ఎందుకంటే ప్రేమంట’, ‘ఒంగోలు గిత్త’, ‘మసాలా’, ‘పండగ చేస్కో’, ‘హైపర్’, ‘హలో గురు ప్రేమ కోసమే’ తదితర సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదు అనిపించాయి. ఇక 2019లో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ నటించిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా గ్రాండ్ సక్సెస్‌ని మూటగట్టుకుంది. ఈ సినిమా తొలి రోజే రూ.10 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను, 8 కోట్లకు పైగా షేర్‌ను సాధించడం విశేషం. ఈ చిత్రం ద్వారా తన బాక్సాఫీస్ పవర్‌ను 100 కోట్ల చేర్చాడు ఈ ఇస్మార్ట్ హీరో. అంతే కాదు ఈ సినిమాను డబ్ చేసి హిందీలో వదిలితే.. సెన్సేషన్ క్రియేట్ చేసింది. దాదాపు 100 మిలియన్ల వ్యూస్‌తో అదరగొట్టింది. అంతేకాకుండా హిందీలోకి డబ్ చేసిన ఆయన నాలుగు చిత్రాలు 100 మిలియన్ల వ్యూస్‌ను నమోదు చేసుకోవడం ఓ రికార్డు. దక్షిణాది సినీ పరిశ్రమలో నాలుగు సినిమాలను 100 మిలియన్ల వ్యూస్‌కు చేర్చిన తొలి హీరోగా ఘనతను దక్కించుకొన్నారు. ఇక ‘ఇస్మార్ట్ శంకర్’తర్వాత చాలా గ్యాప్ తీసుకొని ఈ ఏడాది ‘రెడ్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలో అతను తొలిసారిగా ద్విపాత్రాభినయం చేశాడు. ఈ సినిమా అతని కెరీర్లో ఓ మైలురాయిగా నిలిచింది. ప్రస్తుతం రామ్ లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇలాగే సినీ కేరీర్ రామ్ దూసుకెళ్తూ మరిన్ని రికార్డుకు క్రియేట్ చేయాలని ‘సాక్షి’ తరపున ఆయనకు బర్త్‌డే విషెష్ అందజేస్తుంది. -
షాకింగ్ న్యూస్ చెప్పిన రామ్.. త్వరలో వస్తానంటూ..
అభిమానులకు చిన్నపాటి షాకింగ్ న్యూస్ చెప్పాడు ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని. ‘రెడ్’హిట్‌తో ఫుల్ జోష్‌లో ఉన్న ఈ యువ హీరో... తన తర్వాతి ప్రాజెక్ట్ గురించి అప్ డేట్ ఇస్తాడనకుంటే.. సినిమాల నుండి చిన్న బ్రేక్ తీసుకుంటున్నానని చెప్పి సడన్ షాక్ ఇచ్చాడు. కారణం ఏంటంటే.. రామ్ శివ మాల వేసుకున్నాడు. ఈ మాల ధరిస్తే 41 రోజుల పాటు దీక్ష చెయ్యాలి. అందుకే రామ్ కొద్దిరోజులు సినిమాల నుండి బ్రేక్ తీసుకోవాలని డిసైడ్ అయ్యారు. శివ మాల ధరించి, గాగుల్స్ పెట్టుకున్న ఫొటోను ట్విటర్లో షేర్ చేస్తూ.. ‘ఓం నమః శివాయ, చిన్న బ్రేక్ తీసుకున్నాను. మళ్లీ వస్తాను’అని క్యాప్షన్ ఇచ్చాడు. అయితే ఈ బ్రేక్ సినిమాలకా..? లేక సోషల్ మీడియాకా..? అన్నది తెలియదు. కాగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా తరచుగా అయ్యప్ప స్వామి మాలను ధరిస్తుంటాడు. ఆ సమయంలో నిబంధనలను పాటిస్తూనే షూటింగ్‌ల్లోనూ పాల్గొంటుంటాడు. మరి రామ్ చెర్రీలా కాకుండా 41 రోజుల పాటు దూరంగా ఉంటాడా లేదా సోషల్ మీడియాకు మాత్రమే దూరంగా ఉంటారో చూడాలి. Om Namah Shivaya! Small break.. I’ll be back!! Love..#RAPO pic.twitter.com/VFrr5Xi9Zk — RAm POthineni (@ramsayz) February 6, 2021 -
నాలుగు రోజుల్లోనే లాభాలొచ్చాయి
‘‘నేను శైలజ’ వంటి క్లాస్ సినిమాతో పాటు ‘ఇస్మార్ట్ శంకర్’ వంటి మాస్ సినిమాలో చక్కగా నటించాడు రామ్. కానీ ఇప్పటివరకూ రామ్ ద్విపాత్రాభినయం చేయలేదు. ‘రెడ్’లో ఆదిత్య తో మాస్ ఆడియన్స్‌కి, సిద్ధార్థ క్యారెక్టర్‌తో క్లాస్ ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యాడు’’ అన్నారు ‘స్రవంతి’ రవికిశోర్. రామ్ హీరోగా, మాళవికా శర్మ, నివేదా పేతురాజ్, అమృతా అయ్యర్ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘రెడ్’. తిరుమల కిశోర్ దర్శకత్వంలో ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న విడుదలైంది. రవికిశోర్ మాట్లాడుతూ.. ‘‘ఈ నెల 22న మలయాళంలో, ఆ తర్వాత వివిధ భాషల్లో ‘రెడ్’ విడుదల కానుంది. ప్రేక్షకులకు మా సినిమా నచ్చుతుందని, వసూళ్లు వస్తాయని నమ్మకం ఉండేది.. అది నిజమైంది. నాలుగు రోజుల్లోనే లాభాలు వచ్చాయి. మంచి స్క్రిప్ట్ వచ్చి రామ్ ఎగ్జయిట్ అయితే తప్పకుండా ప్యాన్ ఇండియా రేంజ్లో సినిమా చేస్తాడనుకుంటున్నాను. మా బ్యానర్లో తర్వాతి చిత్రం ఇంకా ఫైనల్ కాలేదు’’ అన్నారు. -
నాకు వాళ్లతోనే అసలైన పోటీ: రామ్
సాక్షి, బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): గత 15 ఏళ్లగా తాను ఎవరికి పోటీ కాదని.. ఇప్పటినుంచి అభిమానులతోనే తనకు పోటీ అని సినీ హీరో రామ్ అన్నారు. శనివారం శ్రేయాస్ మీడియా ఆధ్వర్యంలో రెడ్ చిత్రం విజయోత్సవాన్ని గురజాడ కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామ్ మాట్లాడుతూ అభిమానులు తనను అందరించడంలో తనతో పోటీ పడుతున్నారన్నారు. తాను మంచి సినిమాలు చేసి వారికి పోటీ ఇస్తానన్నారు. లాక్డౌన్ తర్వాత వచ్చిన రెడ్ చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులను మరువలేమన్నారు. (చదవండి: కత్తితో కేక్ కట్ చేసిన హీరో.. క్షమాపణలు) సినిమాలో ఎన్ని ట్విస్టులు ఉన్నాయో? రిజల్ట్‌లో కూడా అన్ని ట్విస్ట్‌లు వచ్చాయన్నారు. ఉదయం షోలో డివైడ్ టాక్ వచ్చిన తమ చిత్రం సాయంత్రానికి హిట్ టాక్ సొంతం చేసుకుందన్నారు. ఈ చిత్రం కోసం అందరూ ఎంతో కష్టపడి పనిచేశారని.. ప్రేక్షకుల ఆదరణతో కష్టం మొత్తం మరచిపోయామన్నారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ మాళవిక శర్మ, నిర్మాత కృష్ణపోతినేని, దర్శకుడు తిరుమల కిశోర్, శ్రేయాస్ మీడియా శ్రీనివాస్, శ్రీముఖి తదితరులు పాల్గొన్నారు. (చదవండి: రెడ్ మూవీ రివ్యూ: నిరాశపరిచే రీమేకు ఇది!) -
నిరాశపరిచే రీమేకు ఇది!
చిత్రం: ‘రెడ్’; తారాగణం: రామ్, నివేదా పేతురాజ్, మాళవికా శర్మ, అమృతా అయ్యర్; సంగీతం: మణిశర్మ; కెమేరా: సమీర్ రెడ్డి; ఫైట్స్: పీటర్ హెయిన్; ఎడిటింగ్: జునైద్ సిద్ధిఖ్; నిర్మాత: స్రవంతి రవికిశోర్; దర్శకత్వం: కిశోర్ తిరుమల; రిలీజ్: జనవరి 14. ఒక భాషలో హిట్టయిన సినిమాను మరో భాషకు తెస్తున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? యథాతథంగా మాతృకనే అనుసరించవచ్చా? అలా అనుసరిస్తే ఈజీనా, ఇబ్బందా? ఇది నిజంగా చర్చించాల్సిన విషయమే. మరీ ముఖ్యంగా రామ్ హీరోగా సంక్రాంతికి రిలీజైన ‘రెడ్’ చూసినప్పుడు ఈ ప్రశ్నలన్నీ మదిలో మెదులుతాయి. పక్క భాషలో ఎంత హిట్టయిన కథనైనా, మన దగ్గరకు తెచ్చుకున్నప్పుడు లోకల్ సెన్సిటివిటీస్‌కు తగ్గట్టు మార్చుకోవడం ఎంత అవసరమో, హిట్‌కు కారణమైన అంశాల్ని కదిలించకపోవడమూ అంతే కీలకం. తమిళ హిట్ ‘తడమ్’ ఆధారంగా వచ్చిన ‘రెడ్’ ఆ సంగతి మరోసారి ప్రూవ్ చేసింది. కథేమిటంటే..: సిద్ధార్థ (రామ్) భవన నిర్మాణ రంగంలో పైకి వస్తున్న సివిల్ ఇంజనీర్. మహిమ (మాళవికా శర్మ)ను ప్రేమిస్తాడు. మరోపక్క ఆదిత్య (రామ్ ద్విపాత్రాభినయం), అతని స్నేహితుడు వేమా (సత్య) ఆవారాగా తిరుగుతుంటారు. వాళ్ళు డబ్బు కోసం ఇబ్బందిపడుతున్న టైమ్‌లో ఆదిత్యకు, గాయత్రి (అమృతా అయ్యర్) ఎదురవుతుంది. ఈ ఇద్దరి కథలూ ఇలా సాగుతుండగా బీచ్ రోడ్డులో ఓ హత్య జరుగుతుంది. ఆ హంతకుడు సిద్ధార్థ, రామ్‌లలో ఎవరు అనేది చిక్కుముడి. ఆ హత్య ఎవరు, ఎందుకు చేశారు? సిద్ధార్థ – ఆదిత్యల మధ్య సంబంధం ఏమిటి లాంటివన్నీ మిగతా కథ. ఎలా చేశారంటే..: తెర మీద లైవ్ వైర్ లాంటి ఎనర్జీ ఉన్న కొద్దిమంది తెలుగు హీరోల్లో ఒకరు రామ్. గత చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’లో అదేమిటో చూపిన హీరో రామ్ ఈసారి ‘రెడ్’లో ద్విపాత్రాభినయం చేశారు. సినిమాను తన రెండు పాత్రల భుజాల మీద మోశారు. కానీ, ఈ తమిళ రీమేక్ యాక్షన్ థ్రిల్లర్‌ను కొన్నిచోట్ల అనవసరంగా మార్చారు. కొన్నిచోట్ల అవసరం ఉన్నా మార్చలేదు అనిపిస్తుంది. దాంతో, తంటా వచ్చిపడింది. పోలీసు అధికారిగా నివేదా పేతురాజ్ ఉన్నంతలో తన పాత్ర బాగానే చేశారు. కానీ, ఆ పాత్రకున్న పరిధే తక్కువ. మాళవికా శర్మ చూడడానికి బాగున్నారు. సినిమాలో తక్కువ నిడివే ఉన్నా, బలంగా హత్తుకొనే గాయత్రి పాత్రలో అమృతా అయ్యర్ సరిగ్గా సరిపోయారు. కమెడియన్ సత్య కామిక్ రిలీఫ్ ఇస్తారు. అయితే, ఏ పాత్రా మనసుకు హత్తుకోకపోవడమే పెద్ద ఇబ్బంది. ఎలా తీశారంటే..: ఇప్పటికే ‘నేను శైలజ’, ‘చిత్రలహరి’ లాంటి సక్సెస్ఫుల్ సినిమాలు తీసిన దర్శక, రచయిత కిశోర్ తిరుమల ప్రయత్నించిన యాక్షన్ థ్రిల్లర్ ఇది. ఆయన తనకు అలవాటైన క్యూట్ లవ్ స్టోరీ ట్రాక్‌తోనే సినిమా మొదలెట్టారు. అక్కడక్కడ తనదైన మార్కు ఆకట్టుకొనే డైలాగులతో ఆకట్టుకున్నారు. అయితే, అసలు థ్రిల్లింగ్ కథ దగ్గరకు వచ్చేసరికి తన మార్కు చూపించలేకపోయారు. రెండు పాత్రల మధ్య వేరియేషన్ చూపడానికి ప్రయత్నించినా, ఒక దశలో కొంత కన్ ఫ్యూజింగ్గానూ అనిపిస్తుంది. సినిమాలోని పాత్రల పాత కథల మీద ఉన్న శ్రద్ధ, వర్తమానంలో వాటి మధ్య ఉన్న సంఘర్షణను తెరపై చూపడం మీద పెట్టలేకపోయారు. అలాగే, సినిమాలోని డ్యుయల్ రోల్లో ఎవరు ఏ రామ్ అన్నది కన్ఫ్యూజన్ లేకుండా చూపడంలోనూ యూనిట్ ఫెయిలైంది. అయితే, ఇటలీలో తీసిన పాటలలాంటివి కలర్‌ఫుల్ గా ఉన్నాయి. హెబ్బా పటేల్‌తో తీసిన ఐటమ్ సాంగ్ ‘ఢించక్ ఢించక్...’ మాస్‌ను ఆకట్టుకుంటుంది. పీటర్ హెయిన్ తీసిన పోలీస్ స్టేషన్ ఫైట్ లాంటివి, హీరో డ్యుయల్ రోల్ సీన్లను సహజంగా అనిపించేలా తీసిన కెమేరా వర్క్‌నూ అభినందించాల్సిందే. మణిశర్మ నేపథ్య సంగీతం అమృతా అయ్యర్ ఎపిసోడ్, మదర్ సెంటిమెంట్ లాంటి ఘట్టాల్లో ప్రత్యేకించి బాగుంది. రెండు పాత్రల రామ్... తనది డ్యుయల్ ర్యామ్ అనిపించుకున్నారు. కానీ కథ, కథన లోపాలు – మదర్ సెంటిమెంట్ కూడా యాంటీ సెంటిమెంట్‌గా అనిపించడం – మన నేటివిటీకి నప్పని స్త్రీ పాత్రల స్వభావాలు – ఇవన్నీ అసంతృప్తికి గురిచేస్తాయి. రెడ్ అనే టైటిల్‌కు జస్టిఫికేషనూ వెతుక్కుంటాం. వెరసి, ఈ థ్రిల్లర్ సినిమాలో థ్రిలింగ్ తక్కువ. వినోదమూ తక్కువే. కొసమెరుపు: ‘ఇస్మార్ట్ శంకర్’ రామ్ జోరుకు ఇది ఓ రెడ్ సిగ్నల్! బలాలు: ∙రెండు పాత్రల్లో రామ్ ఎనర్జిటిక్ నటన ∙మణిశర్మ నేపథ్యసంగీతం, నిర్మాణ విలువలు ∙అక్కడక్కడ మెరిసే డైలాగులు బలహీనతలు: ∙తెలుగు నేటివిటీకి పొసగని కొన్ని స్త్రీ పాత్రల ప్రవర్తన ∙నిదానంగా సా...గే కథనం ∙కన్విన్సింగ్ గా లేని కీలకమైన సెకండాఫ్ ∙పండని మదర్ సెంటిమెంట్ ∙పస తగ్గిన థ్రిల్లింగ్ అంశాలు -రివ్యూ: రెంటాల జయదేవ -
అంచనాలు మించి ‘రెడ్’ ఫస్ట్ డే కలెక్షన్స్
ఈ సంక్రాంతి కానుకగా ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ‘రెడ్’ మూవీ నిన్న విడుదలైన సంగతి తెలిసిందే. ఈసినిమాకు ముందు మాస్ మహారాజా రవితేజ ‘క్రాక్’ మూవీ, థలపతి విజయ్ ‘మాస్టర్’ చిత్రాలు విడుదలయ్యాయి. ఈ నేపథ్యంతో తక్కువ అంచనాలతో సంక్రాంతి సందర్భంగా గురువారం విడుదలైన ‘రెడ్’ మూవీ టాలీవుడ్ బక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఏపీ, తెలంగాణల్లో కలిపి మొదటి రోజే 6.7 కోట్ల రూపాయల షేర్స్‌ను రాబట్టింది. యాభై శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లలో విడుదలైన ఈ మూవీ రికార్డు కలెక్షన్లను కొల్లగొట్టడంతో హీరో రామ్ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. తాజా కలెక్షన్లకు సంబంధించి ‘రెడ్’ అఫీషియల్ పోస్టర్‌ను విడుదల చేశాడు. ఈ రేంజ్లో తనకు భారీ ఓపెనింగ్ అందించినందుకు ప్రేక్షకులకు అతడు కృతజ్ఞతలు తెలిపాడు. ‘ఇస్మార్ట్ శంకర్’లో మాస్ లుక్‌లో కనిపించిన రామ్ ‘రెడ్’ మూవీలో ద్విపాత్రాభినయం చేసి మెప్పించాడు. కాగా రెడ్ కలెక్షన్ల తాజా అప్డేట్ ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు 6.7 కోట్ల షేర్స్ రాగా గ్రాస్ కలెక్షన్స్ 8.9 కోట్లుగా ఉండొచ్చని సమాచారం. థియేటర్ల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ 50 శాతం ఆక్యుపెన్సీతో ఇన్ని కలెక్షన్లు రావడమంటే సాధారణ విషయం కాదంటున్నారు సినీ విశ్లేషకులు. -
రెడ్ మూవీ రివ్యూ
టైటిల్ : రెడ్ జానర్ : యాక్షన్ థ్రిల్లర్ నటీనటులు : రామ్ పోతినేని, మాళవికా శర్మ, నివేదా పేతురాజ్, అమృతా అయ్యర్, సంపత్ రాజ్, వెన్నల కిషోర్ తదితరులు నిర్మాణ సంస్థ : శ్రీ స్రవంతి మూవీస్ నిర్మాత : ‘స్రవంతి’రవికిశోర్ దర్శకత్వం : తిరుమల కిశోర్ సంగీతం : మణిశర్మ సినిమాటోగ్రఫీ : సమీర్ రెడ్డి ఎడిటర్ : జునైద్ సిద్దిఖీ విడుదల తేది : జనవరి 14, 2021 సినీ బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ ఎంతో కష్టపడుతూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను సొంతం చేసుకున్నాడు ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని. కెరీర్ ఆరంభంలోనే కొన్ని హిట్లను తన ఖాతాలో వేసుకున్న రామ్, ఆ తర్వాత వరుస పరాజయాలతో ఇబ్బందులు పడ్డాడు. ఇలాంటి పరిస్థితుల్లో డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ‘ఇస్మార్ట్ శంకర్' మూవీతో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు. ఇక ఇప్పుడు అదే జోష్‌ను కంటిన్యూ చేయాలని తనకు గతంలో‘నేను శైలజ', ‘ఉన్నది ఒకటే జిందగీ' వంటి హిట్లు ఇచ్చిన కిశోర్ తిరుమలతో ‘రెడ్' అనే సినిమా చేశాడు. తమిళ్ మూవీ తడమ్ రీమేక్‌గా వస్తున్న ఈ మూవీలో రామ్ తొలి సారిగా డ్యూయల్ రోల్ చేశాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్లు, పాటలు సినిమాపై పాజిటీవ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. దీంతో ఎన్నో అంచనాల మధ్య సంక్రాంతి కానుకగా నేడు‘రెడ్’ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమాతో రామ్ మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడా? కిశోర్ తిరుమల,రామ్ కాంబో హ్యాట్రిక్ విజయం సాధించిందా లేదా తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే. కథ సిద్దార్థ్(రామ్) ఒక సివిల్ ఇంజనీర్. తాను పని చేసే ఆఫీస్‌లోనే మహిమా(మాళవికా శర్మ)అనే యువతిని చూసి ఇష్టపడతాడు. తన ప్రేమను ఆమెతో వ్యక్తం చేయడానికి నానా ఇబ్బందులు పడుతాడు. చివరకు ఎలాగోలా తన ప్రేమ విషయాన్ని ఆమెతో చెప్పేస్తాడు. ఆమె కూడా సిద్దార్థ్‌ను ఇష్టపడుతుంది. కొద్ది రోజుల్లో పెళ్లికూడా చేసుకోవాలనుకుంటారు. కట్ చేస్తే.. ఆదిత్య(రామ్) ఓ తెలివైన దొంగ. చిన్న చిన్న దొంగతనాలు చేసి వచ్చిన డబ్బుతో.. జల్సాలు చేస్తుంటాడు. పేకాటలో లక్షలకు లక్షలు పొగొట్టుకుంటాడు. ఇలా ఒకసారి తన ఫ్రెండ్ వేమ(సత్య) దాచుకున్న డబ్బులు తీసుకొని వెళ్లి పేకాటలో పొగుట్టుకుంటాడు. దాని వల్ల వేమ ఓ ప్రమాదంలో ఇరుక్కుంటాడు. తన స్నేహితుడిని కాపాడటం కోసం ఆదిత్య 9 లక్షల రూపాయలు తీసుకొచ్చి ఓ రౌడీకి ఇస్తాడు. ఇదిలా ఉంటే.. ఆకాశ్ అనే ఓ యువకుడు దారుణ హత్యకు గురవుతాడు. ఈ హత్య కేసులో సిద్దార్థ, ఆదిత్య ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఈ కేసు సీఐ నాగేంద్ర కుమార్(సంపత్ రాజ్), ఎస్సై యామిని(నివేదా పేతురాజ్) ప్రతిష్టాత్మకంగా తీసుకొని విచారణ చేపడతారు. ఇక ఈ కేసులో సిద్దార్థ్‌ను ఇరికించడానికి సీఐ నాగేంద్ర కుట్ర చేస్తాడు. అసలు ఈ హత్యకు సిద్దార్థ్, ఆదిత్యలకు సంబంధం ఏంటి? ఇద్దరిలో ఆకాశ్‌ని ఎవరు హత్య చేశారు? సీఐ నాగేంద్రకు, సిద్దార్థ్‌కు మధ్య ఉన్న గొడవేంటి? సిద్దార్థ్, ఆదిత్యల మధ్య సంబంధం ఏంటి? పోలీసులు ఈ కేసును చేధించారా లేదా? అనేదే మిగత కథ నటీనటులు రెండు విభిన్న పాత్రలో కనిపించిన రామ్.. ప్రతి పాత్రలోనూ వేరియేషన్ చూపించి ఆకట్టుకున్నాడు. స్టైల్, యాక్షన్ తో మాస్ ఆడియన్స్‌ను అలరించటంలో తనకు తిరుగులేదని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. సిద్దార్థ్ పాత్రలో క్లాస్‌గా కనిపించి మెప్పించిన రామ్.. ఆదిత్య పాత్రలో ఊర మాస్‌గా అలరించాడు. తన నటనతో మరోసారి ఎనర్జిటిక్ స్టార్ అని నిరూపించుకున్నాడు. ఎస్సై యామినిగా నివేదా పేతురాజ్ మంచి ప్రదర్శన ఇచ్చారు. మహిమా పాత్రలో మాళవికా శర్మ మెప్పించారు. తెరపై కనిపించేది కొద్ది నిమిషాలే అయినా..తనదైన ముద్రవేశారు. మాళవిక శర్మ-రామ్ రొమాన్స్ బాగా పండింది. లిప్ లాక్‌లతో హీటెక్కించారు. ఇక అమాయకపు యువతి పాత్రలో అమృతా అయ్యర్ అద్భుతంగా నటించాడు. సంపత్ రాజ్, వెన్నల కిషోర్, సత్య తమ పరిధిమేర నటించారు. విశ్లేషణ ‘నేను శైలజ', ‘ఉన్నది ఒకటే జిందగీ' వంటి సూపర్ హిట్ల తర్వాత తిరుమల కిశోర్, రామ్ కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ చిత్రం రెడ్. ‘ఇస్మార్ట్ శంకర్'లాంటి సూపర్ హిట్ తర్వాతా రామ్ నుంచి వస్తున్న తొలి చిత్రం ఇదే కావడంతో ‘రెడ్’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలను కొంతమేర దర్శకుడు అందుకున్నాడు. తమిళ్ మూవీ తడమ్‌కు ఇది రీమేకే అయినా.. తెలుగు ఆడియన్స్‌కు నచ్చేలా కథలో మార్పులు చేసి మెప్పించాడు. ఫస్టాఫ్‌లోనే ఇద్దరు రామ్‌లను తెరపై పరిచయం చేసిన దర్శకుడు... ఆ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఏంటో సినిమా చివరి వరకు తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. ఇక ఇంటర్వేల్ ముందు ఓ ట్విస్ట్ ఇచ్చి.. సెకండాఫ్‌పై క్యూరియాసిటీని క్రియేట్ చేశాడు. ప్లాష్‌బ్యాక్ ట్విస్ట్‌లు కూడా ఆడియన్స్‌కి కథపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తాయి. అయితే రామ్‌లోని ఎనర్జిటిక్ని దర్శకుడు సరిగా వాడుకోలేకపోయాడు. కథలో ట్విస్ట్‌లు ఉన్నప్పటికీ.. సినిమా స్లోగా రన్ అవుతున్న భావన సగటు ప్రేక్షకుడికి కలుగుతుంది. ప్లాష్‌బ్యాక్‌లో రామ్ తల్లిని చూపించిన విధానం కూడా ప్రేక్షకులకు అంతగా నచ్చకపోవచు. సినిమాలోని డైలాగ్స్ బాగుండటంతో పాటు ఆలోచించే విధంగా చేస్తాయి. ‘రామాయణం మగాళ్లు కాకుండా ఆడాళ్లు రాసిఉంటే.. వారిపై అనుమానం ఉండేది కాదు అని ఒక్క డైలాగ్‌తో మహిళల బాధను తెలియజేశాడు. ‘నచ్చింది తినాలనుకున్నా.. తినకపోతే ఏమౌతుందిలే అనుకునే బతుకులు వాళ్లవి’ అంటూ మధ్యతరగతి బతుకులు ఏంటో తన డైలాగ్స్‌తో తెలియజేశాడు. ఇక ఈ సినిమాకి ప్రధాన బలం సంగీతం. మణిశర్మ బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌తో కొన్ని సీన్లకు ప్రాణం పోశాడు. ఒక పాట మినహా మిగిలినవి అంతంత మాత్రమే అయినా, తనదైన బిజీఎంతో మ్యాజిక్ చేశాడు. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు కథానుసారం బాగున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే రెడ్ మరీ ఉత్కంఠభరితమైన క్రైమ్ థ్రిల్లర్ కాదు కాని చూడాల్సిన చిత్రమే. ప్లస్ పాయింట్స్ : రామ్ నటన కథలోని ట్విస్టులు సెకండాఫ్ మైనస్ పాయింట్స్ స్లో నెరేషన్ ఫస్టాఫ్లొని కొన్ని సీన్లు అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
రామ్ 'రెడ్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్..
-
స్వర్గంలో అడుగుపెట్టి 15 ఏళ్లు: రామ్
తొలి చిత్రమే హిట్టయితే ఆ కిక్కే వేరప్పా.. అదిచ్చిన బూస్ట్‌తో జర్నీని బుల్లెట్ స్పీడ్‌లో నడిపేయొచ్చు. దేవదాసు సూపర్ హిట్ కావడంతో రామ్ పోతినేని కూడా అదే చేశాడు. కానీ కొన్ని చోట్ల సడన్ బ్రేకులు పడ్డాయి, మరికొన్ని చోట్ల బండి నెమ్మదించింది. ఇక మిగతా చోట్ల రేసింగ్ స్పీడులో దూసుకుపోయాడు. అయితే హిట్లు, ఫ్లాపుల లెక్క ఎలాగున్నా క్రేజ్ మాత్రం అంతకు రెట్టింపు అవుతూనే వస్తోంది. పదిహేనేళ్ల వయసులోనే నటించడం మొదలు పెట్టిన ఆయన దేవదాసు చిత్రంతో హీరోగా మారారు. ఈ సినిమా రిలీజై నేటికి 15 ఏళ్లవుతోంది. (చదవండి: ‘సోలో బ్రతుకే సో బెటర్’ మూవీ రివ్యూ) ఈ సందర్భంగా రామ్ పోతినేని సంతోషం వ్యక్తం చేశారు. తనకు దేవదాసుతో సినీ జీవితాన్ని ప్రసాదించిన దర్శకుడు వైవీఎస్ చౌదరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. "పదిహేనేళ్ల వయసులో టాలీవుడ్ అనే స్వర్గంలోకి అడుగు పెట్టాను. దేవదాసు రిలీజై సరిగ్గా పదిహేనేళ్లు అవుతోంది. మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఇండస్ట్రీకి వచ్చాను. ఎంటర్టైన్ చేస్తున్నాను, చేస్తూనే ఉంటాను కూడా! అభిమానులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు" అని ట్వీట్ చేశారు. దేవదాసు పోస్టర్‌ను సైతం పంచుకున్నారు. దీంతో ఆయన ఫ్యాన్స్ రెడ్‌బుల్ ఎనర్జీ స్టార్ రామ్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. దేవదాసు నుంచే నీకు అభిమానులమైపోయాం అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా రామ్ 'రెడ్' చిత్రం జనవరి 14న రిలీజవుతోంది. ఏడు భాషల్లో అనువదించనున్న ఈ చిత్రంలో హీరోయిన్లు మాళవికా శర్మ, నివేదా పేతురాజ్, అమృతా అయ్యర్ నటిస్తున్నారు. కన్నడ వెర్షన్ ఈ నెల 14నే విడుదల కానుంది. మిగిలిన వెర్షన్లను ఈ నెలాఖరున రిలీజ్ చేసే ప్లాన్‌లో ఉన్నాం. తమిళ వెర్షన్‌ని డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల చేస్తున్నాం. (చదవండి: రెడ్ ట్రైలర్: ఈ సారి మంట మాములుగా లేదు) -
ఏడు భాషల్లో రామ్ కొత్త సినిమా
రామ్ హీరోగా నటించిన చిత్రం ‘రెడ్’. మాళవికా శర్మ, నివేదా పేతురాజ్, అమృతా అయ్యర్ కథానాయికలు. తిరుమల కిశోర్ దర్శకత్వంలో ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న విడుదల కానుంది. రవికిశోర్ మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రాన్ని ఏడు భాషల్లో అనువదించాం. కన్నడం, మలయాళం, బెంగాలీ, భోజ్‌పురి, మరాఠీ, తమిళం, హిందీలో డబ్ చేశాం. కన్నడ వెర్షన్ ఈ నెల 14నే విడుదల కానుంది. మిగిలిన వెర్షన్లను ఈ నెలాఖరున రిలీజ్ చేసే ప్లాన్‌లో ఉన్నాం. తమిళ వెర్షన్‌ని డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల చేస్తున్నాం. తెలుగు వెర్షన్‌ని గ్రేట్ ఇండియా ఫిలింస్ ద్వారా అమెరికా, ఆస్ట్రేలియా, సింగపూర్, దుబాయ్‌లలో రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు. ‘‘ఇటీవల విడుదల చేసిన టీజర్, ట్రైలర్, పాటలకు అద్భుతమైన స్పందన వస్తోంది’’ అన్నారు చిత్రసమర్పకులు కృష్ణ పోతినేని. -
సంక్రాంతి బరిలో స్టార్ హీరోలు.. ఇక రచ్చ రచ్చే
2020.. చిత్ర పరిశ్రమకు భారీ నష్టాన్ని మిగిల్చింది. కరోనా మహమ్మారి వల్ల సినిమా షూటింగ్స్ ఆగిపోయాయి. థియేటర్లు మూతపడడంతో షూటింగ్ పూర్తయిన సినిమాలు విడుదలకు నోచుకోలేదు. దీంతో గత ఏడాది మొత్తం సినీ ప్రియులకు నిరాశే మిగిలింది. ఇప్పుడిప్పుడే థియేటర్లు తెరుచుకోవడం, ఇటీవల థియేటర్లలో రిలీజైన సోలో బ్రతుకే సో బెటర్ సినిమా హిట్ కావడం దర్శకనిర్మాతలకు నూతనోత్సాహాన్ని ఇచ్చింది. దీంతో ఈ సంక్రాంతికి థియేటర్లలో మోత మోగించడానికి స్టార్ హీరోలు రెడీ అవుతున్నారు. వరుసగా భారీ సినిమాలను విడుదల చేస్తూ ఇంత కాలం సినీ ప్రియులు కోల్పోయిన వినోదాన్ని వడ్డీతో సహా ఇవ్వడానికి సిద్దమయ్యారు. ఈ సంక్రాంతిలో సందడి చేయనున్న సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం. రచ్చ చేయనున్న మాస్ మహారాజ్ మాస్ మహారాజ్ రవితేజ, గోపిచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న హ్యాట్రిక్ చిత్రం ‘క్రాక్’. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. డాన్ శీను, బలుపు చిత్రాల తర్వాత రవితేజ, గోపిచంద్ కాంబినేషన్లో వస్తున్న హ్యాట్రిక్ సినిమా కావడంతో ‘క్రాక్’పై భారీ అంచనాలు ఉన్నాయి. థియేటర్లలో పాఠాలు చెప్పనున్న ‘మాస్టర్’ తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన ‘మాస్టర్’ సినిమాను జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మాళవిక మోహన్ హీరోయిన్గా నటిస్తోన్న ఈ చిత్రంలో విజయ్ సేతుపతి విలన్‌గా నటించాడు. ఈ చిత్రంలో ఆండ్రియా జెరెమియా, రమ్య సుబ్రమణియన్, అర్జున్ దాస్, శాంతను భాగ్యరాజ్, నాసర్, ధీనా, సంజీవ్, శ్రీనాథ్, శ్రీమాన్, సునీల్ రెడ్డి కీలకపాత్రల్లో నటించారు. తొలుత ఈ చిత్రాన్ని ఈ ఏడాది ఏప్రిల్ 9 న విడుదల చేయాలని భావించారు. కానీ కరోనా లాక్డౌన్ కారణంగా వాయిదా పడింది. దీంతో సంక్రాంతిని పురస్కరించుకొని జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. రెడీగా ఉన్న ‘రెడ్’ ఎనర్జిటిక్ స్టార్ రామ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం ‘రెడ్’. తమిళ మూవీ ‘తడమ్’కు ఇది రీమేక్. కిషోర్ తిరుమల దర్శకత్వంలో వహించిన ఈ సినిమాలో రామ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. నివేదా పేతురాజ్, మాళవికా శర్మ, అమృతా అయ్యర్లు కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతమందిస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అలరించేందుకు రెడీ అంటున్న ‘అల్లుడు’ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తాజాగా నటిస్తున్న సినిమా అల్లుడు అదుర్స్. కందిరీగ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాలో నభా నటేష్, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటించారు. ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ను సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు చిత్రయూనిట్. అల్లుడు అదుర్స్ ను జనవరి 15న రిలీజ్ చేస్తున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. వీటితో పాటు దాదాపు కొన్ని చిన్న సినిమాలు కూడా రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. ఇలా వరుస సినిమాలను విడుదల చేస్తూ.. ఇన్ని రోజులు మిస్ అయిన వినోదాన్ని అందించేందుకు చిత్రపరిశ్రమ సిద్దమైంది. మరీ ఇందులో ఏ సినిమా ప్రేక్షకులను అలరించి సంక్రాంతి హిట్‌గా నిలుస్తుందో చూడాలి. -
రెడ్ ట్రైలర్: ఈ సారి మంట మాములుగా లేదు
ఇస్మార్ట్ శంకర్’ మూవీతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం ‘రెడ్’. తమిళ మూవీ ‘తడమ్’కు ఇది రీమేక్. కిషోర్ తిరుమల దర్శకత్వంలో వహించిన ఈ సినిమాలో రామ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. నివేదా పేతురాజ్, మాళవికా శర్మ, అమృతా అయ్యర్లు కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతమందిస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల మందుకు తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలో గురువారం చిత్రబృందం సినిమా ట్రైలర్‌ని విడుదల చేసింది. ఇందులో రామ్ రెండు విభిన్న పాత్రల్లో నటించినట్లు చూపించారు.ఒకరు క్లాస్ అయితే మరొకరు ఊర మాస్. నచ్చిన అమ్మాయి.. కోరుకున్న ఉద్యోగంతో లైఫ్ సాఫీగా సాగిపోతోన్న సమయంలో హీరో లైఫ్‌లోకి ఓ వ్యక్తి ఎంట్రీతో ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయో చెబుతూ ట్రైలర్‌ను మొదలవుతుంది. ఇందులో రెండు గెటప్‌లతో రామ్ అదరగొట్టేసినట్లే కనిపిస్తోంది. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. ‘అసలే ఉన్నవంటే నాకు మంట.. తప్పు చేశావురా ఈ సారి మంట మాములుగా లేదు’, ‘వాడికి ఉన్న తెలివి తేటలకి సగం సిటీని తూకం వేసి అమ్మెయగలడు’ లాంటి డైలాగ్స్ బాగున్నాయి. ఇక, చివర్లో బట్టలు లేకుండా కనిపించి హీరో ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు.