
గతేడాదే కరోనా పీడ విరగడవుతుందనుకుంటే ఈసారి మరింత విజృంభిస్తూ జనాలను హడలెత్తిస్తోందీ మాయదారి వైరస్. అయితే ఈసారి కోవిడ్ టీకా అందుబాటులోకి రావడంతో కొంతలో కొంత ఉపశమనం లభిస్తోంది. కానీ అనేకమంది వ్యాక్సిన్ పనితీరుపై అనుమానం వ్యక్తం చేస్తూ టీకా వేసుకునేందుకు వెనుకడుగు వేస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ వ్యాక్సిన్ పనితీరు పట్ల సందేహాలు విడనాడండని పిలుపునిచ్చారు.
"నాకు కరోనా వచ్చిన మాట వాస్తవమే. కానీ రెండు వ్యాక్సిన్ డోసుల తర్వాత కరోనా సోకిందనేది నిజం కాదు. నేను ఒక వ్యాక్సిన్ డోసు తీసుకున్నాను. తర్వాత ముగ్గురం స్నేహితులం ఊరెళ్లాం. ఇక్కడికి వచ్చాక ముగ్గురికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అప్పటికే వ్యాక్సిన్ వేయించుకున్న నాకు, మరో మిత్రుడికి మూడు రోజుల పాటు కొద్దిగా జ్వరం వచ్చి పోయింది. కానీ వ్యాక్సిన్ వేయించుకోని ఇంకో మిత్రుడు మాత్రం ఆస్పత్రిలో చేరాడు. కాబట్టి వ్యాక్సిన్ వేయించుకుంటే కరోనా ఎక్కువగా ఇబ్బందిపెట్టదు అని చెప్పడానికి మేమే నిదర్శనం. వ్యాక్సిన్ వేయించుకున్న కొద్దిమందికి కూడా కరోనా చాలా ఆలస్యంగా వస్తుంది. టీకా వేయించుకోవడం వల్ల ఎటువంటి ప్రాణహాని ఉండదు. దీనికి నేనే ఉదాహరణ. అందరూ ఎటువంటి భయాలు పెట్టుకోకుండా తప్పకుండా వ్యాక్సిన్ వేసుకోండి" అని అల్లు అరవింద్ సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment