అల్లు అర్జున్ పేరు చెప్పగానే ఐకాన్ స్టార్, 'పుష్ప' హీరో అనే పదాలు గుర్తొచ్చేవి. ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది. ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు గెలుచుకోవడంతో ఆలోవర్ ఇండియా.. బన్నీ ఫుల్ ట్రెండ్ అవుతున్నాడు. అందరూ ఇతడి గురించే మాట్లాడుకుంటున్నారు. మరోవైపు 'పుష్ప 2' ఎలా ఉండబోతుందో అని ఇప్పుడే అంచనాలు పెంచేసుకుంటున్నారు.
అల్లు అర్జున్‌కి జాతీయ అవార్డు రావడం మాటేమో గానీ.. పుష్ప 2 మూవీపై ఒత్తిడి తీవ్రస్థాయిలో ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఈ అవార్డు వల్ల సీక్వెల్‌లో ఏమైనా మార్పులు ఉండబోతున్నాయా? ఇంతకీ సినిమా రిలీజ్ ఎప్పుడు? అనే విషయాలపై ఓ లుక్కేద్దాం.
(ఇదీ చదవండి: 'జై భీమ్'కి జాతీయ అవార్డ్ అందుకే మిస్ అయిందా?)
పెరిగిన అంచనాలు
2021 డిసెంబరులో 'పుష్ప' సినిమా రిలీజైంది. విడుదలైన రోజు.. మిక్స్‌డ్ టాక్ వచ్చింది. డబ్బింగ్, సినిమాటోగ్రఫీ విషయంలో కొందరు ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. మరికొందరైతే మూవీ బాలేదన‍్నారు. కానీ వీకెండ్ అయ్యేసరికి టాక్ మొత్తం మారిపోయింది. బ్లాక్‌బస్టర్ కలెక్షన్స్‌తో సౌత్-నార్త్ అనే తేడా లేకుండా దూసుకుపోయింది. రూ.300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇప్పుడు బన్నీకి అవార్డు రావడంతో సీక్వెల్‌పై అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయి.
మరోసారి తగ్గేదేలే అంటాడా?
'పుష్ప' సినిమా హిట్ అవడానికి స్టోరీ, అల్లు అర్జున్ యాక్టింగ్, హిట్ సాంగ్స్ ఇలా చాలా కారణాలు ఉన్నాయి. ఈ అవార్డుల వల్ల సీక్వెల్ చూసేందుకు బీభత్సమైన అంచనాలతో ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. కాబట్టి బన్నీ-సుక్కు ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నారనేది చూడాలి. అలానే ఫస్ట్ పార్ట్‌లో 'తగ్గేదే లే' అనే డైలాగ్ బాగా కలిసొచ్చింది. సీక్వెల్‌లో అలాంటిది ఇంకేమైనా ప్లాన్ చేశారేమో తెలియాల్సి ఉంది.
(ఇదీ చదవండి: ‘గాండీవధారి అర్జున’ మూవీ రివ్యూ)
రాబిన్‌హుడ్ స్టోరీ ఎలా?
'పుష్ప' తొలి భాగంలో పుష్పరాజ్ అనే ఓ వ్యక్తి.. డాన్ ఎలా అయ్యాడనేది మాత్రమే చూపించారు. సీక్వెల్‌లో డాన్‌గా ఎలాంటి సవాళ్లు ఎదుర్కొబోతున్నాడనేదే స్టోరీ. బన్నీ బర్త్‌డే సందర్భంగా రిలీజ్ చేసిన ప్రోమోలో.. పుష్పరాజ్ పాత్రని రాబిన్‌హుడ్ తరహాలో చూపించారు. అంటే పెద్దోళ్ల దగ్గర దోచుకున్నది పేదలకు పంచడం అనమాట. ఈ తరహా కాన్సెప్ట్‌తో గతంలో పలు సినిమాలు వచ్చాయి. వాటితో పోలిస్తే 'పుష్ప 2'లో కొత్తగా ఏం చూపిస్తారనేది బిగ్ క్వశ్చన్.
'పుష్ప'కి మూడో పార్ట్?
గతంలో సుకుమార్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'పుష్ప' కథని తొలుత వెబ్ సిరీస్‌గా తీయాలనుకున్నానని, కానీ సినిమా తీశానని చెప్పుకొచ్చాడు. ఇప్పటికే పుష్ప చిత్రాన్ని రెండు భాగాలు అనుకున్నారు. ఇప్పుడు అవార్డు రావడంతో అంచనాలు పెరిగాయి. దీంతో మూడో భాగానికి ఏమైనా స్కోపు ఉందా అనేది సుకుమార్ చేతుల్లోనే ఉంది. ఎందుకంటే తొలిపార్ట్‌లో ఊహించని మలుపులతో కిక్ ఇచ్చిన సుక్కు.. సీక్వెల్‌ని ఇంకెన్ని మలుపులు తిప్పబోతున్నాడో?
రిలీజ్ డేట్ అదేనా?
పుష్ప 2 షూటింగ్ ఇప్పటివరకు 40 శాతం పూర్తయింది. జాతీయ అవార్డు వచ్చిన ఊపులో మరింత ఎనర్జీతో అల్లు అర్జున్ సెట్స్ లో అడుగుపెట్టాలని ఫిక్స్ అయ్యాడు. నవంబరు కల్లా చిత్రీకరణ పూర్తి చేయాలని టార్గెట్ కూడా పెట్టుకున్నారట. వచ్చే ఏడాది మార్చి 22న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఇలా 'పుష్ప' సీక్వెల్ విషయంలో టీమ్ ముందు బోలెడన్ని సవాళ్లు ఉన్నాయి. మరి ఈసారి ఏం చేస్తారో చూడాలి.
(ఇదీ చదవండి: ‘బెదురులంక 2012’మూవీ రివ్యూ)
Comments
Please login to add a commentAdd a comment