అజిత్, వంశీ పైడిపల్లి, అల్లు బాబి, ‘దిల్’ రాజు, అల్లు అర్జున్, తమన్నా, మేఘన, జూపల్లి శ్రీరామ్, అల్లు అరవింద్
‘‘ఇప్పుడు టీవీ ఇండస్ట్రీ, సినిమా ఇండస్ట్రీలా డిజిటల్ ఇండస్ట్రీ కూడా ఒకటి.. దాన్ని తెలుగుకు తీసుకొచ్చినందుకు, అది కూడా పూర్తిగా తెలుగు భాషలో తీసుకురావడం చాలా గర్వంగా ఉంది’’ అన్నారు హీరో అల్లు అర్జున్. హైదరాబాద్‌లో శుక్రవారం జరిగిన ‘ఆహా’ ఓటీటీ గ్రాండ్ లాంచ్ కార్యక్రమంలో అల్లు అర్జున్ మాట్లాడుతూ– ‘‘రెండు మూడేళ్ల కిందట.. రాత్రి ఒంటి గంట, రెండు గంటలైనా నాన్న (అల్లు అరవింద్) టీవీ షోలు చూస్తుండేవారు.
ఈ మధ్య మీరు సినిమాలకంటే టీవీ షోలే ఎక్కువగా చూస్తున్నారు? అంటే.. బాగుంటున్నాయి.. వీటిని తెలుగుకి తీసుకురావాలి అన్నారు?. తెలుగులో ఓటీటీ కల్చర్ సాధ్యపడుతుందా? అన్నాను. కొన్ని రోజుల తర్వాత.. ‘మై హోమ్’ గ్రూప్ రామ్ జూపల్లిగారు ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలోకి అడుగుపెడుతున్నారని తెలిసింది.. తను నాకు మంచి ఫ్రెండ్. మేమందరం కలిసి మాట్లాడుకున్నప్పుడు ఓటీటీ ఐడియా వచ్చింది.
నేను చాలా గర్వపడాల్సిన సమయమిది.. మా నాన్నగారు ఐదు దశాబ్దాలుగా సినిమా ఇండస్ట్రీలో ఉంటూ ఎన్నో హిట్స్ సాధించారు.. అయితే ఈ ఓటీటీ మాత్రం చాలా ప్రత్యేకం. ఈ ప్లాట్‌ఫామ్ కంటెంట్‌కి సంబంధించింది.. అందుకే ఇండస్ట్రీలో కంటెంట్‌పై బాగా పట్టున్న ‘దిల్’ రాజుగారితో భాగస్వామ్యం అయ్యాం. ఓటీటీ అంటే యంగ్ మైండ్‌సెట్ ఉండాలి, యంగ్‌స్టర్ ఉండాలనుకున్నప్పుడు నాకు విజయ్ దేవరకొండ గుర్తొచ్చాడు.. తనతో మాట్లాడాం. భాగస్వామ్యం అయ్యాడు. ‘ఆహా’ తెలుగులో నంబర్ వన్ కావడం సంతోషంగా ఉంది’’ అన్నారు.
అల్లు అరవింద్ మాట్లాడుతూ– ‘‘ఫిబ్రవరి 8న ‘ఆహా’ని లాంచ్ చేశాం. ఉగాది నుంచి ఉగాది వరకు సుమారు 50షోలు చేయాలనుకున్నాం. ‘ఆహా’లో ‘కంటెంట్ మేనేజ్‌మెంట్ బోర్డ్’ చీఫ్ క్రియేటివ్ అడ్వైజర్‌గా వంశీ పైడిపల్లిని తీసుకున్నాం. ‘సామ్ జామ్’ అనే ఆసక్తికరమైన షోని సమంత చేస్తున్నారు.. ఈ షోకి అన్నీ తానై దర్శకురాలు నందినీరెడ్డి వెనకుండి నడిపిస్తున్నారు. ఈ దీపావళికి మరో మూడు షోలు రానున్నాయి’’ అన్నారు.
నిర్మాత ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘జూపల్లి రామేశ్వరరావుగారు, అరవింద్‌గారు, రామ్.. ‘ఆహా’లో నన్నూ భాగస్వామ్యం కావాలని కోరారు. సినిమాలతో నేను తీరిక లేకుండా ఉంటున్నాను. దీంతో నా కుమార్తె, నా అల్లుడు ‘ఆహా’లో జాయిన్ అయ్యారు. ‘ఆహా’ స్టార్ట్ అయిన తొమ్మిది నెలల్లో కోవిడ్ టైమ్‌లోనూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువాళ్లను అలరిస్తోంది. అరవింద్‌గారు ఏది మొదలు పెట్టినా దాన్ని సాధించే తీరుతారు. ఈ ‘ఆహా’ ద్వారా తెలుగును భారతదేశం మొత్తం తీసుకెళతారనడంలో సందేహం లేదు’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment