తమిళ భాషే తీయనైనది.. అని ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ మరోసారి ఉద్ఘాటించారు. ఆంగ్ల భాషకు బదులు హిందీ భాష మాట్లాడాలి అన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు హిందీ భాషేతర రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. అమిత్ షా వ్యాఖ్యలకు సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ట్విట్టర్ ద్వారా గట్టిగానే బదులిచ్చారు. కాగా చెన్నైలో సీఐఐ ఆధ్వర్యంలో రెండు రోజులపాటు స్థానిక నందంబాక్కంలో సౌత్ ఇండియా మీడియా, ఎంటర్‌టైన్మెంట్ సదస్సును నిర్వహించిన విషయం తెలిసిందే.
ఆదివారం జరిగిన ముగింపు కార్యక్రమంలో నిర్వాహకులు సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్‌ను ఐకాన్ అవార్డుతో సత్కరించారు. ఈ వేడుకలో కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ ముఖ్యఅతిథి, పెప్సీ, తమిళనాడు సినీ దర్శకుల సంఘం అధ్యక్షుడు ఆర్కే సెల్వమణి, దక్షిణ భారత నటీనటుల సంఘం అధ్యక్షుడు నాజర్ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఆర్ రెహమాన్ మాట్లాడుతూ ఏడేళ్ల క్రితం మలేషియాలో కలిసిన చైనాకు చెందిన వ్యక్తి మీరు ఇండియనా అని అడిగారు అన్నారు.
తనకు నార్త్ ఇండియన్స్ అంటే చాలా ఇష్టం అని, చాలా అందంగా ఉంటారని, వారు నటించిన చిత్రాలు బ్రహ్మాండంగా ఉంటాయని అన్నారని, చైనాలో బహుశా ఆయన దక్షిణాది చిత్రాలు చూసి ఉంటారా అన్నది తెలియదన్నారు. అయితే ఆయన చెప్పింది తనను చాలా బాధించిందన్నారు. తనవరకు ఉత్తరాది చిత్రాలు, దక్షిణాది చిత్రాలన్న బేధం లేదని పేర్కొన్నారు. అనంతరం అమిత్ షా వ్యాఖ్యలపై మీడియా అడిగిన ప్రశ్నకు తమిళ్ భాషే తీయనైనదని ఏఆర్ రెహమాన్ మరోసారి ఉద్ఘాటించారు.
Comments
Please login to add a commentAdd a comment