
మా టీవీలో హీరో నాగార్జున హోస్ట్‌గా ఆదివారం ప్రారంభమైన బిగ్ బాస్ రియాలిటీ షో లోకి కడప జిల్లాకి చెందిన ప్రముఖ సినీ యాంకర్ లాస్య కాంటెంటెస్ట్‌గా ఎంటర్ అయింది. సినీ, టీవీ షో లతో పాపులర్ అయిన లాస్యది వైఎస్ఆర్ జిల్లా, వీరబల్లి మండలం గడికోట గ్రామం స్వస్థలం. ఆమె తండ్రి పేరు వీరబల్లి నరసింహారెడ్డి. జెమిని టీవీలో అంకితం లైవ్ షో ద్వారా కెరీర్‌ను ప్రారంభించిన లాస్య.. ఆ తరువాత మా టీవీ లో చేసిన సమ్‌థింగ్ స్పెషల్ అనే ప్రోగ్రాం ద్వారా మంచి పేరు సంపాదించుకుంది. ఇప్పుడు అదే మాటీవీలో ప్రసారమవుతున్న బిగ్ బాస్ షోకి వెళ్లడం నిజంగా విశేషమనే చెప్పుకోవాలి. ఈటీవీ లో ప్రారంభమైన ఢీ షో లాస్య కు మరో మెట్టు పైకి ఎక్కించింది. (గంగవ్వకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు)
అనేక ఈవెంట్లకు యాంకర్‌గా పనిచేసిన లాస్య పద్ధతిగా తనదైన శైలిలో అభిమానుల ఆదరణతో సినీ, టీవీ ఇండస్ట్రీ లో ఎటువంటి బాక్ గ్రౌండ్ లేకుండా స్వశక్తితో ఎదిగింది. లాస్య ఇప్పుడు బిగ్ బాస్ షో లోకి వెళ్లడం పట్ల వైఎస్ఆర్ జిల్లా వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా లాస్య తన జీవితంలో రెండుసార్లు పెళ్లి చేసుకుంది. తాను ప్రేమించిన మంజునాథ్‌తో 2010లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంది. తర్వాత పెద్దలను ఒప్పించి 2017లో మరోసారి అందరి సమక్షంలో భర్తతో ఏడడుగులు నడిచింది. పెళ్లి చేసుకున్నాక బుల్లితెరకు దూరమైన లాస్య చాలా సంవత్సరాలకు మళ్లీ ఎంటర్‌టైన్ చేసేందుకు సిద్ధమైంది. (బిస్‌బాస్-4 : ఇదిగో 16 మంది కంటెస్టెంట్స్)