అంగరంగ వైభవంగా ప్రారంభమైన బిగ్‌బాస్ నాల్గో సీజన్‌లో 19 మంది కంటెస్టెంట్లు పాల్గొన్నారు. 16 మందితో మొదలైన షోలో మరో మూడు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వచ్చి చేరాయి. కానీ ఏ వైల్డ్ కార్డ్ కంటెస్టెంటు కూడా ఫినాలేకు చేరుకోలేకపోయింది. కొందరు మెరుపు తీగల్లా వచ్చి వెళ్లిపోగా, భారీ అంచనాల మధ్య వచ్చిన మరికొందరు మాత్రం ఉనికిని కూడా చాటుకోలేక అభిమానులను నిరుత్సాహానికి గురి చేశారు. అలాంటి కంటెస్టెంట్లు ఎవరెవరే చూద్దాం...
సూర్యకిరణ్
తన కోపమే తన శత్రువు అన్న వాక్యం దర్శకుడు సూర్య కిరణ్ విషయంలో అక్షరాలా నిజమైంది. ఎదుటి వాళ్లు చెప్పేది వినకుండా, ప్రతిదానికి చిర్రుబుర్రులాడేవాడు. అందుకే షోలో అడుగు పెట్టిన మొదటి వారమే షో నుంచి నిష్క్రమించాడు. కానీ తను హౌస్‌లో ఉండాల్సిన వ్యక్తి అని, ఇలా ఎలిమినేట్ అయిపోతాననుకోలేదని చెప్పుకొచ్చాడు. కానీ రెమ్యూనరేషన్ మాత్రం ఊహించినదానికన్నా పది రెట్లు ఎక్కువే ఇచ్చారని చెప్పాడు. (చదవండి: వారం రోజులకు లక్షల్లో ఇచ్చారు)
కరాటే కల్యాణి
అప్పుడే కోప్పడుతూ అప్పుడే ఏడుస్తూ కల్యాణి ఎవరికీ ఓ పట్టాన అర్థం కాలేదు. చిన్నచిన్న విషయాలకు కూడా పెద్ద రాద్ధాంతం చేసేది. అలా ఆమె పెద్దపెద్దగా కేకలేస్తూ అందరి మీద నోరు పారేసుకోవడంతో సోషల్ మీడియాలో ఆమెను ట్రోల్ చేశారు. చాలామందితో కయ్యం పెట్టుకుని చివరికి రెండో వారంలో హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది. కానీ ఆమె అమ్మ రాజశేఖర్‌తో కలిసి అందరినీ తెగ ఎంటర్‌టైన్ చేసేది. (చదవండి: అభిజిత్ బిగ్‌బాస్‌కే గర్వకారణం)
స్వాతి దీక్షిత్
ఇంట్లో మూడో వైల్డ్ కార్డ్‌గా ఎంట్రీ ఇచ్చిన బొద్దు గుమ్మ స్వాతి దీక్షిత్. ఆమె ఎంట్రీ, ఎలిమినేషన్ రెండూ అందరినీ సర్‌ప్రైజ్ చేశాయి. ఇంట్లోకి వెళ్లగానే ఆమెను ఇంప్రెస్ చేసేందుకు అబ్బాయిలు పోటీపడ్డారు. చివరికి ఆమె అభిజిత్‌తో కనెక్ట్ కావడం, అభిజిత్-హారిక మధ్య గ్యాప్ రావడం, ఇంతలో ఆమె ఎలిమినేట్ కావడం చకచకా జరిగిపోయాయి. (చదవండి: స్వాతిలో అది నాకు నచ్చలేదు: లాస్య)
యాంకర్ లాస్య
లాస్య అనగానే గుర్తొచ్చేది చీమ-ఏనుగు జోకులు. ఆమె వేసే జోకులకు ఎవరూ నవ్వకపోయినా ఆమె మాత్రం పడీపడీ నవ్వేది. కానీ ఈ నవ్వే ఆమెకు నానాపేర్లు తెచ్చిపెట్టింది. ఫేక్ స్మైల్, కవరింగ్ స్మైల్ అంటూ మిగతావాళ్లు లాస్య గురించి ఎన్నో అన్నారు. ఇది పక్కన పెడితే ఈ యాంకర్ నుంచి ఆమె అభిమానులు ఎంతగానో ఆశించారు. కానీ ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌కు మ్యాచ్ అవకుండా ఆమె కిచెన్‌లోనే ఉండిపోయి వంటలక్కగా మారిపోయింది. టాస్కుల్లోనూ వెనకబడిపోయింది. (చదవండి: టాప్ 2: లాస్య జోస్యం నిజమయ్యేనా?)
జోర్దార్ సుజాత
తెలంగాణ యాసలో మాట్లాడే ఈ యాంకర్ కిలకిలా నవ్వుతూనే ఉండేది. ఎప్పుడు చూసినా లాస్యతో కలిసి ఇంట్లో జరిగే విషయాల గురించి గుసగుసలు పెట్టేది. అలా ఆమెకు గాసిప్ క్వీన్ అన్న ముద్ర పడిపోయింది. అయితే వ్యాఖ్యాత నాగార్జునను పట్టుకుని ఆమె బిట్టూ అని పిలవడం చాలామందికి నచ్చలేదు. దీంతో ఐదోవారంలోనే ముల్లెమూట సర్దుకుని ఇంటిబాట పట్టింది. బయటకు వచ్చాక సుజాత మాట్లాడుతూ తనను బిట్టూ అని బిగ్‌బాస్ యూనిటే పిలవమని చెప్పిందంటూ తనపై జరుగుతున్న ట్రోలింగ్‌కు గట్టి సమాధానం ఇచ్చింది. (చదవండి: బిట్టూ అని వాళ్లే పిలవమన్నారు: సుజాత)
కుమార్ సాయి
బిగ్‌బాస్ హౌస్‌లో అడుగు పెట్టిన మొట్ట మొదటి వైల్డ్ కార్డ్ కంటెస్టెంటు. ఎవరితోనూ కలవలేక, క్లారిటీ లేని సమాధానాలతో కన్ఫ్యూజన్ మాస్టర్‌గా నిలిచాడు. కొన్ని టాస్కుల్లో బాగా ఆడి కెప్టెన్ అయినప్పటికీ హౌస్‌లో ఉన్నానా? లేనా? అన్నట్టుగా ఉండటంతో అతడిని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. హౌస్‌లో కూడా ఇంటిసభ్యులు కుమార్‌ను తమలో ఒకరుగా ఫీల్ అవలేదు. దీంతో అతడు ఏకాకిగా మారిపోయాడు. చివరికి ఏడో వారంలో హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు. కానీ నాగార్జున స్క్రిప్ట్ చెప్పాలన్న కోరికకు నాగ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సంతోషంగా వీడ్కోలు తీసుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment