వైల్డ్ కార్డ్ కంటెస్టెంటుగా అడుగు పెట్టిన కుమార్ సాయి ఏకాకిగా మారాడన్న విషయం నేడు మరోసారి స్పష్టమైంది. ముందుగా ఊహించినట్టుగానే కళ్యాణి బిగ్‌బాస్ హౌస్‌కు గుడ్‌బై చెప్పింది. హీరో-జీరో గేమ్‌లో అమ్మ రాజశేఖర్ ఏడ్వడం, అందుకు కారణమైన లాస్యను దివి టార్గెట్ చేయడం, దీంతో ఖంగు తిన్న లాస్య దివిని నోరు అదుపులో పెట్టుకోమని వార్నింగ్ ఇవ్వడం జరిగాయి. మరి నేటి ఎపిసోడ్‌లో ఇంకా ఏమేం జరిగాయో చదివేయండి.
గంగవ్వను చెల్లెలని పిలిచిన నాగ్
ఇప్పుడు ఆరోగ్యం మంచిగైంది కాబట్టి ఇంట్లో నుంచి వెళ్లిపోనని గంగవ్వ స్పష్టం చేసింది. తిరిగి ఎప్పటిలాగే జోష్‌గా ఉంటూ అవినాష్‌ను బర్రె ముక్కు అని వెక్కిరించింది. కన్ఫెషన్ రూమ్‌లోకి వెళ్లిన గంగవ్వను నాగ్ చెల్లెలు అని పిలవడం గమనార్హం. అవ్వ అనడం మానేసి గంగమ్మ అని పిలిచారు. తర్వాత ఫొటో పోటీ జరిగింది. దీనికోసం మోనాల్.. అభికి ముద్దులిస్తూ ఫొటోకు పోజిచ్చింది. మెహబూబ్, దివి కూడా రకరకాల యాంగిల్స్‌లో ఫొటోలు క్లిక్‌మనిపించారు. అనంతరం అసలు సీన్ ప్రారంభమైంది. ఇంటి సభ్యులు ఎవరూ గేమ్‌ను సీరియస్‌గా తీసుకోవడం లేదని నాగ్ మండిపడ్డారు. (బిగ్‌బాస్: గంగవ్వకు కరోనా టెస్ట్)
రియల్ గేమ్ ఆడేవాళ్లకే ఓట్లు: నాగ్
బిగ్‌బాస్ హౌస్‌కు వచ్చేదే గెలవడానికని నామినేట్ అయిన కంటెస్టెంట్లకు నాగ్ గడ్డి పెట్టారు. నామినేషన్ ప్రక్రియను సీరియస్‌గా తీసుకోమంటే దానిపై కూడా జోకులు పేల్చుతూ పాట పాడుకున్నారని గరమయ్యారు. గంగవ్వను నామినేట్ అయేలా చేసినందుకు నోయల్‌ను తిట్టిపోశారు. మంచివాళ్లు అని మార్కులు కొట్టేసేందుకు త్యాగాలు చేస్తున్నారు, కానీ ప్రేక్షకులు నిజంగా గేమ్ ఆడేవాళ్లకు మాత్రమే ఓట్లు వేస్తారని స్పష్టం చేశారు. తర్వాత గంగవ్వ సేఫ్ అయినట్లు వెల్లడించారు. అనంతరం హీరో-జీరో గేమ్ ఆడించారు. హీరో అనుకున్నవాళ్లను కుర్చీ మీద కూర్చోబెట్టాలి. జీరో అనుకున్నవాళ్లను మెడబట్టి అక్కడ ఏర్పాటు చేసిన ద్వారం గుండా బయటకు గెంటేయాలని తెలిపారు.
బిగ్‌బాస్ పిచ్చి కామెడీ దారిలో వెళుతుంది: దేవి ఫైర్
నోయల్.. హీరోగా మాస్టర్‌ను, జీరోగా కుమార్ సాయిగా తెలిపారు. సుజాత.. హీరోగా అమ్మ రాజశేఖర్‌ను, జీరోగా కళ్యాణిని, సోహైల్.. హీరోగా నోయల్‌ను, జీరోగా కళ్యాణిని, దేవి.. హీరోయిన్‌గా అరియానాను, జీరోగా అమ్మ రాజశేఖర్ పేరు చెప్పింది. ఈ సందర్భంగా దేవి మాట్లాడుతూ.. బిగ్‌బాస్ పిచ్చి కామెడీ దారిలో వెళుతుందని ఏడుస్తూ చెప్పుకొచ్చింది. కామెడీ చేస్తే ఇక్కడ హీరోలా అని అమ్మ రాజశేఖర్‌ను దుమ్ము దులిపింది. నామినేషన్ ప్రక్రియ తర్వాత నుంచి తనను వేరు చేసి చూస్తున్నారని ఆవేదన చెందింది. తర్వాత మెహబూబ్.. హీరోయిన్‌గా లాస్యను, జీరోగా కుమార్‌ను, కుమార్.. హీరోగా అభిజిత్‌ను, జీరోగా నోయల్‌ను, హారిక.. హీరోగా అభిజిత్‌ను, జీరోగా కుమార్ సాయిని, లాస్య.. హీరోయిన్‌గా గంగవ్వను, జీరోగా అమ్మ రాజశేఖర్ పేరును వెల్లడించింది. (రొమాంటిక్ డ్యాన్స్; కళ్లు మూసుకున్న అరియానా)
పంపించేయండంటూ కన్నీళ్లు పెట్టుకున్న మాస్టర్
శ్రుతి మించిన కామెడీ నచ్చలేదని లాస్య చెప్పింది. దివి గర్భవతిగా నటించాల్సి వచ్చినప్పుడు మాస్టర్ వెళ్లి ఆమెకు పిల్లో సర్దడం నచ్చలేదని చెప్పింది. దీంతో హర్ట్ అయిన మాస్టర్ 'నేను వెళ్లిపోతాను, అసలు కామెడీనే చేయను, నన్ను పంపించేయండి' అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. షూటింగ్‌లో అవన్నీ సాధారణమేనని, తప్పేమీ కాదని, మాస్టర్ ఉండవల్సిందేనని గంగవ్వ బల్లగుద్ది చెప్పింది. అందరికీ నచ్చాల్సిన అవసరం లేదంటూ నాగ్ మాస్టర్‌ను ఊరడించారు. తర్వాత కళ్యాణి.. హీరోయిన్‌గా గంగవ్వను, జీరోగా సుజాతను, అరియానా.. హీరోయిన్‌గా గంగవ్వను, జీరోగా కళ్యాణిని, అఖిల్, మోనాల్.. హీరోగా గంగవ్వను, జీరోగా కుమార్ సాయిని, అవినాష్, గంగవ్వ.. హీరోగా అమ్మ రాజశేఖర్‌ను, జీరోగా కుమార్ సాయి పేర్లు చెప్పారు.
దివి, లాస్య మధ్య రాజుకున్న గొడవ
అభిజిత్.. హీరోగా గంగవ్వను, జీరోగా అరియానా, అమ్మ రాజశేఖర్.. హీరోగా నోయల్‌ను, జీరోగా దేవి నాగవల్లి, దివి.. హీరోగా అమ్మ రాజశేఖర్, జీరోగా సాయి కుమార్ పేర్లను చెప్పారు. దివి మాట్లాడుతూ.. మాస్టర్ హౌస్‌లో లేకపోతే అందరికీ మెంటలెక్కిపోతుందని చెప్పుకొచ్చింది. అతని ప్రవర్తన ఎవరికీ తప్పు అనిపించలేదని పేర్కొంది. తన ఫొటో కోసం అతను పిల్లో పెట్టడం తప్పు కాదని తేల్చి చెప్పింది. తన విషయం గురించి అందరి ముందు మాట్లాడినందుకు లాస్యపై ఆగ్రహం వ్యక్తం చేసింది. షటప్, నీతో మాట్లాడనవసరం లేదు అని ముఖం మీద చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోయింది. దీంతో షాకైన లాస్య నోరు అదుపులో పెట్టుకో అని వార్నింగ్ ఇచ్చింది. అనంతరం కళ్యాణి ఎలిమినేట్ అవుతున్నట్లు నాగ్ ప్రకటించగా ఇంటి సభ్యులు ఆమెను సాగనంపారు. (బిగ్‌బాస్: ఎక్కువ పారితోషికం అవినాష్‌కే)
Comments
Please login to add a commentAdd a comment