ఇంతకు ముందు గ్లామరస్ పాత్రలతో యువతను ఆలోచింప చేసిన నటి ఆండ్రియా సమీప కాలంలో నటనకు అవకాశం ఉన్న వైవిధ్యభరిత పాత్రలో నటిస్తూ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అలా తాజాగా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం అనిల్ మేలె పని తులి. ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్ తన గ్రాస్‌రూట్ ఫిలిమ్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రం ద్వారా ఆర్.కైసర్ ఆనంద్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. దర్శకుడు వెట్రిమారన్ శిష్యుడైన ఈయన పలు చిత్రాలకు కథా సహకారం అందించారన్నది గమనార్హం.
కాగా ఇందులో నటుడు యాదవ్ కనదాసం హీరోగా నటించగా అళగం పెరుమాళ్, ఇళవరసు, అనుపమ కుమార్, లౌవ్లీ చంద్రశేఖర్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. దీనికి సంతోష్ నారాయణన్ సంగీతాన్ని, వేల్‌రాజ్ చాయాగ్రహణం అందించారు. కాగా నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 18వ తేదీ నుంచి సోనీ లైవ్‌లో స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా బుధవారం చిత్ర యూనిట్ చెన్నైలో మీడియాతో ముచ్చటించారు. దర్శకుడు మాట్లాడుతూ ఇది స్త్రీల నేపథ్యంలో సాగే నేటి సమాజానికి కావాల్సిన అంశాలతో రూపొందించిన కథా చిత్రం అని చెప్పారు.
కథ విన్న దర్శకుడు వెట్రిమారన్ వెంటనే తన బ్యానర్‌లోనే ఈ చిత్రాన్ని నిర్మిస్తానని చెప్పారన్నారు. అలాగే కథానాయకి ఇతివృత్తంగా సాగే ఈ చిత్రంలో ప్రధాన పాత్రకు ఆండ్రియానే కరెక్ట్ అని భావించామని, దీంతో ఆమెకు కథ చెప్పగానే వెంటనే ఓకే చెప్పారని తెలిపారు. ఇది యథార్థ కథతో రూపొందించిన చిత్రం కాకపోయినా ఇందులోని సంఘటనలు ప్రేక్షకులకు కనెక్ట్ అవుతాయన్నారు. నటి ఆండ్రియా మాట్లాడుతూ.. ఒక పల్లెటూరి నుంచి ఉద్యోగం కోసం ఎన్నో కలలు కంటూ నగరానికి వచ్చిన యువతికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి?
వాటిని ఆమె ఎలా ఎదుర్కొంది అన్న పలు ఆసక్తికరమైన అంశాలతో ఈ చిత్రం ఉంటుందన్నారు. కలలు నిజమవుతున్న తరుణంలో ఎదురైన ఒక సంఘటన ఆమె జీవితాన్ని ఎలాంటి మలుపు తిప్పింది? ఆ సంఘటన ఏమిటి? అన్నదే అనల్ మేలె పని తులి చిత్రం అన్నారు. దర్శకుడు కథ చెప్పగానే తన మనసును టచ్ చేసిందని, అందుకే నటించడానికి అంగీకరించినట్లు తెలిపారు. ఆదవ్ కన్నదాసన్ మాట్లాడుతూ ఇది హీరోయిన్ కథా చిత్రం అయినా తన పాత్రకు, నటనకు అవకాశం ఉంటుందని చెప్పారు. ఒక మంచి చిత్రంలో తాను భాగం కావడం సంతోషంగా ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment