
పండగలప్పుడు పెద్ద హీరోల సినిమాలు విడుదల కావడం కామన్. అయితే ఈసారి ఓనమ్ పండగకి మలయాళంలో పెద్ద చిత్రాలేవీ విడుదల కాలేదు. ఆ రకంగా వెండితెర పండగ మిస్సయింది. అయితే లేట్ అయినా లేటెస్ట్‌గా వస్తామంటూ.. మలయాళ అగ్రహీరోలు మమ్ముట్టి, మోహన్‌లాల్, పృథ్వీరాజ్, దుల్కర్ సల్మాన్ తదితరులు తమ చిత్రాలను రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు. ఫ్యాన్స్‌కు ‘ఓనమ్’ శుభాకాంక్షలు తెలిపారు.
ఇక కొందరు కథానాయికలు గురువారం ‘అంగన్నె ఓనమ్ వన్ను’ (అలా ఓనమ్ వచ్చింది) అంటూ ఓనమ్ స్పెషల్ శారీ కట్టుకుని, ట్రెడిషనల్ జ్యువెలరీ పెట్టుకుని ఫొటోలు షేర్ చేశారు. బంగారు రంగు చారలున్న ఐవరీ కలర్ చీర, మల్లెపువ్వులు, ముత్యాల నెక్లెస్‌కి బంగారు లాకెట్, చెవి దుద్దులతో అందంగా ముస్తాబయ్యారు అనుపమా పరమేశ్వరన్. ‘ఓనమ్ చిరునవ్వు ఇదిగో’ అంటూ ఆ ఫొటోలు షేర్ చేశారు.
మరో మలయాళ కుట్టి కల్యాణీ ప్రియదర్శన్ కూడా జరీ అంచు ఉన్న తెలుపు రంగు చీర, గ్రాండ్‌గా ఉన్న చెవి దుద్దులు, చేతినిండా గాజులు, జడకు మల్లెపువ్వులు పెట్టుకుని తళతళలాడారు. ‘అందరికీ హ్యాపీ ఓనమ్’ చెప్పి, ఫొటో షేర్ చేశారు కల్యాణీ ప్రియదర్శన్. ఇంకో మలయాళ భామ రమ్యా నంబీసన్ కూడా తెలుపు రంగు చీర, చక్కని నగలతో పాటు నుదుట బొట్టుతో కళకళలాడారు. ‘అంగన్నె ఓనమ్ వన్ను’ అంటూ ఫొటో షేర్ చేశారు రమ్య. ఇక పండగ సందర్భంగా మంజు వారియర్ కూడా ప్రత్యేకంగా రెడీ అయ్యారు. ‘హ్యాపీ ఓనమ్’ అంటూ ఫొటో షేర్ చేశారు. ఇంకా ప్రియమణి, సంయుక్తా మీనన్, భావన తదితర తారలు తళుకులీనారు. ఇలా మలయాళ పరిశ్రమలో ఓనమ్ సందడి బాగా కనిపించింది.