
ఓటీటీలో ఇది చూడొచ్చు అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో తమిళ చిత్రం అప్పత్తా ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.
నవ మాసాలు మోసి, కన్న బిడ్డపై తల్లికి జీవితాంతం మమతానురాగాలుంటాయి. కానీ అదే బిడ్డ తన తల్లిని తల్లిగా చూడక స్వార్థంతో హింసిస్తే ఆ తల్లి తిరిగి ఎలా ప్రవర్తిస్తుంది... ఇదే ఇతివృత్తంతో తీసిన సినిమా ‘అప్పత్తా’. నానమ్మ లేదా అమ్మమ్మ అని అర్థం. ఇంకా చె΄్పాలంటే ప్రేమతో పెద్దవాళ్లని పిలిచే పదం ‘అప్పత్తా’. ఇదో తమిళ సినిమా.
ఈ సినిమాకి దర్శకులు ప్రియదర్శన్. ప్రముఖ నటి ఊర్వశి ఈ అప్పత్తా పాత్రలో నటించారు... కాదు కాదు జీవించారు. ప్రస్తుత కాలమాన పరిస్థితులకు అద్దం పట్టే ఓ ఫీల్ గుడ్ మూవీ ‘అప్పత్తా’. ఈ చిత్రకథ విషయానికొస్తే... ఓ చిన్న గ్రామంలో అప్పత్తా ఒక్కటే ఉంటుంది. ఎవరికైనా చిన్న ఇబ్బంది ఉన్నా వెంటనే తానున్నానని వాళ్లకి పరిష్కారం చూపుతూ నలుగురికీ సాయపడుతూ ఉంటుంది. అప్పత్తాకు కుక్కలంటే మాత్రం చచ్చేంత భయం. భర్తను పోగొట్టుకున్న ఈవిడ తన కష్టంతో కొడుకును చదివిస్తూ ఉంటుంది. కొడుకు పేరు శ్యామ్. అప్పత్తా ఊరగాయ పచ్చళ్లు బాగా చేస్తుంది.
అప్పత్తా ఊరగాయలంటే ఆ చుట్టు పక్కల ఊళ్లల్లో బాగా ఫేమస్. ఆ ఊరగాయలతోనే తన బిడ్డను చదివించుకుంటూ ఉంటుంది. కానీ అదే ఊరగాయ వాసన, అలాగే ఆమె పేదరికం నచ్చని కొడుకు చదువు పేరుతో అప్పత్తాని వదిలి నగరానికి వెళతాడు. కానీ సిటీకి వెళ్లడానికి, అక్కడ ఉండడానికి అప్పత్తా ఇచ్చిన డబ్బులు వాడుకుంటాడు. శ్యామ్ సిటీలోనే సెటిలై ప్రేమ వివాహం చేసుకుంటాడు. కొన్నేళ్ల తరువాత సడెన్‌గా సిటీలో ఉన్న తన కొడుకు దగ్గర నుండి పిలుపు వచ్చి అప్పత్తా గేటెడ్ కమ్యూనిటీలో ఉంటున్న కొడుకు ఇంటికి వెళుతుంది.
సిటీకి మొట్టమొదటిసారిగా వచ్చిన తన తల్లిని కనీసం తీసుకురావడానికి కూడా వెళ్లని సదరు కొడుకు అప్పత్తాని ఎందుకు పిలిచాడంటే తన ఫ్యామిలీతో హాలిడే కోసం కొన్ని రోజులు బయటకు వెళుతూ ఇంట్లో ఉన్న కుక్కని చూసుకోవడానికి మనిషి కోసం ఆమెను రప్పించుకుంటాడు. అసలే కుక్కంటే భయపడే అప్పత్తా కొడుకు ఇంట్లో ఉన్న కుక్కని ఎలా ఎదుర్కొంటుంది? అన్నదే ఈ ‘అప్పత్తా’. సినిమా మొత్తం కామెడీగా సాగిపోతూ చివర్లో చక్కటి మెసేజ్ ఇచ్చారు దర్శకుడు. మనల్ని కనడానికి మన తల్లి పడ్డ బాధ మనకు తెలియకపోవచ్చు. కానీ మనల్ని పెంచి పోషించిన తల్లిని మాత్రం ఎప్పటికీ బాధపెట్టకూడదు. అందుకే ఇది అమ్మ కోసం చూడాల్సిన సినిమా. మస్ట్ వాచ్... ఫీల్ గుడ్ మూవీ. వాచిట్ ఆన్ జియో హాట్ స్టార్.
– ఇంటూరు హరికృష్ణ
Comments
Please login to add a commentAdd a comment