![Arbaaz Khan on Age Difference with Shura: She Knew What She Wanted in her life - Sakshi](/styles/webp/s3/article_images/2024/02/10/Arbaaz-Khan.jpg.webp?itok=KIdGasS1)
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ సోదరుడు, నటుడు అర్బాజ్ ఖాన్ రెండో పెళ్లి చేసుకున్నప్పటినుంచి వార్తల్లో నిలుస్తూ వస్తున్నాడు. ఇతడు కొన్నేళ్ల కిందట ఐటం గర్ల్ మలైకా అరోరాను పెళ్లి చేసుకుని తర్వాత విడాకులిచ్చాడు. అనంతరం జియార్జియా ఆండ్రియానితో నాలుగేళ్లపాటు లవ్‌లో ఉండి ఆమెకు బ్రేకప్ చెప్పేశాడు. ఈ బ్రేకప్ వార్తలు ఆలస్యంగా బయటకు రాగా, అదే సమయంలో రెండో పెళ్లి చేసుకుని అందరినీ సర్‌ప్రైజ్ చేశాడు. గతేడాది డిసెంబర్ 24న మేకప్ ఆర్టిస్ట్ షురా ఖాన్‌ను నిఖా చేసుకున్నాడు. వీరి వివాహం ఎంతో గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకలు అయిపోయాక భార్యతో కలిసి లంచ్, డిన్నర్, పార్టీలు, షోలు.. అంటూ తెగ ఎంజాయ్ చేస్తున్నాడు.
జీవితంలో ఏం కావాలో తనకు తెలుసు
అయితే షురా ఖాన్.. అర్బాజ్ కంటే చాలా చిన్నది. దీంతో అర్బాజ్‌పై ట్రోలింగ్ జరిగింది. ఈ వయసులో పెళ్లి చేసుకోవడం అవసరమా? చూస్తుంటే ఆ అమ్మాయిది చాలా తక్కువ వయసుగా కనిపిస్తోందని విమర్శించారు. తాజాగా ఈ విమర్శలపై అర్బాజ్ స్పందించాడు. 'నా భార్య నాకంటే చిన్నదే కావచ్చు. కానీ ఆమె 16 ఏళ్ల చిన్న పిల్ల కాదు. జీవితంలో తనకు ఏవి అవసరం? ఏవి అనవసరం అన్న విషయాలపై తనకు పూర్తి అవగాహన ఉంది. అలాగే నా జీవితానికి ఏం అవసరం అనేది నాకు తెలుసు. మేమిద్దరం ఏడాదిపాటు ఒకరి గురించి ఒకరం తెలుసుకున్నాం. మాకు ఏం కావాలి? భవిష్యత్తులో ఎలా ఉండాలనేది అన్నీ పరిశీలించుకున్నాం.
వయసు దాచిపెట్టి పెళ్లి చేసుకోలే
అంతేతప్ప ముందూవెనకా ఆలోచించకుండా తొందరపడి పెళ్లి చేసుకోవాలనుకోలేదు. అన్నీ ఆలోచించాకే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఏజ్ గ్యాప్ గురించి కామెంట్స్ చేస్తున్నారు. నేనేమీ నా వయసు దాచిపెట్టి ఈ పెళ్లి చేసుకోలేదు. ఇద్దరికీ ఒకరి గురించి మరొకరికి తెలుసు. మేము తీసుకున్న నిర్ణయం ఎలాంటిదో కూడా తెలుసు. అయినా ఒకే వయసులో ఉన్న ఇద్దరూ పెళ్లి చేసుకుని కలిసి ఉండవచ్చు లేదంటే ఏడాదికే విడిపోవచ్చు. కాబట్టి ప్రేమకు, బంధానికి వయసుతో పని లేదని గుర్తుంచుకోండి. ఇంకా చెప్పాలంటే ఏజ్ గ్యాప్ ఎక్కువున్న జంటలు ఎక్కువకాలం కలిసే ఉన్నారు. అలాంటి జంటల సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంది అని చెప్పుకొచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment