
కల్యాణ్ రామ్, సయీ మంజ్రేకర్ జంటగా నటించిన చిత్రం ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’. ఈ సినిమాలో కల్యాణ్‌రామ్ తల్లి పాత్రలో విజయశాంతి నటించారు. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక్‌వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 18న విడుదల కానుంది. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించారు.
ఈ చిత్రం నుంచి ‘ముచ్చటగా బంధాలే ఇచ్చటనే కలిశాయే...’ అంటూ సాగే రెండో పాటని ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరులో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో విడుదల చేశారు. రఘురామ్ సాహిత్యం అందించిన ఈ పాటని హరిచరణ్ పాడారు. ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో విజయశాంతి మాట్లాడుతూ– ‘‘కల్యాణ్ రామ్ తల్లి గురించి చాలా అద్భుతంగా చెప్పాడు. ఈ సినిమా కోసం నిజాయతీగా చాలా కష్టపడ్డాం... చాలా పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.
కల్యాణ్ రామ్ మాట్లాడుతూ– ‘‘ఒక అమ్మప్రాణాన్ని పణంగా పెట్టి బిడ్డకి జన్మనిస్తుంది. మనం వేసే ప్రతి అడుగు అమ్మ నేర్పిందే. అలాంటి అమ్మలని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఆ బాధ్యత కోసం మనం ఎంత త్యాగం చేసినా సరిపోదు. ఈ కథాంశంతో రూపొందిన చిత్రం ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’. ఈ నెల 12న మా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి తమ్ముడు (ఎన్టీఆర్) వస్తాడు’’ అన్నారు.