టైటిల్: అశ్విన్స్
నటీనటులు: సంత్ రవి, విమలా రామన్, మురళీధరన్, సిమ్రాన్ పరీక్, ఉదయ దీప్, సరస్వతి మీనన్ తదితరులు
నిర్మాణ సంస్థ:శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర
నిర్మాత: బివిఎస్ఎన్ ప్రసాద్
దర్శకత్వం: తరుణ్ తేజ
సంగీతం: విజయ్ సిద్ధార్థ్
విడుదల తేది: జూన్ 23, 2023
థ్రిల్లర్స్ సినిమాలకు ఆడియన్స్ నుంచి ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుంది. అందుకే సస్పెన్స్, హర్రర్, థ్రిల్లింగ్ జానర్ లో తరచూ సినిమాలు వస్తుంటాయి. వాటిలో ఎక్కువశాతం బాక్సాపీస్ వద్ద విజయం సాధించినవే ఉంటాయి. ఇక తాజాగా ఇదే జానర్‌లో ‘అశ్విన్స్’అనే చిత్రం తెరకెక్కింది. తెలుగు, తమిళ భాషల్లో ద్విభాషా చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీలో ‘తారామణి’ ఫేం వసంత్ రవి, విమలా రామన్ కీలక పాత్రలు పోషించారు. తాజాగా మీడియా కోసం ఈ మూవీ ప్రివ్యూ వేశారు. థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రేక్షకులను భయపెట్టే హారర్ ఎలిమెంట్స్ ఏమున్నాయో రివ్యూలో చూద్దాం.
అశ్విన్స్ కథేంటంటే..
అర్జున్(వసంత్ రవి), రీతు, రాహుల్, గ్రేస్, వరుణ్..ఐదుగురు యూట్యూబర్స్. ఓ యూట్యూబ్ ఛానెల్‌కు డార్క్ టూరిజం మీద ఓ ఎపిసోడ్‌ను చిత్రీకరించాలని లండన్‌లోని ఓ దీవిలో ఉన్న భవంతికి వెళ్తారు. అక్కడ ప్రముఖ ఆర్కియాలజిస్ట్ ఆర్తి రాజగోపాల్(విమలా రామన్) ఆత్మ తిరుగుతుందని, గతంలో అక్కడి వెళ్లిన ఓ 15 మందిని ఆమే చంపేసిందనే ప్రచారం ఉంది.
ఈ విషయం తెలుసుకున్న అర్జున్ టీమ్.. ఆ భవంతిలో సంచరించే ఆత్మలను, అరుపులను తమ కెమెరాలో బంధించాలని ప్రయత్నిస్తారు. మరి అలా వెళ్లిన ఐదుగురికి భవంతిలో కలిగిన వింత అనుభవాలు ఏంటి? ఆర్కియాలజిస్ట్ ఆర్తి రాజగోపాల్ ఎలా చనిపోయింది. ఓ రైతుకు అశ్వినీదేవతలు ఇచ్చిన వరం ఏంటి? ఆ వరాన్ని రాక్షస ఆత్మ ఎలా తనకు అనుకూలంగా మార్చుకుంది. అశ్వినీ దేవతలు ఇచ్చిన రెండు బొమ్మలు కనుగొన్న తర్వాత ఆర్తి రాజగోపాల్ ఎదురైన సమస్యలు ఏంటి? తనవాళ్లను కాపాడుకోవడానికి అర్జున్ చేసిన సాహసం ఏంటి? తదితర విషయాలు తెలియాలంటే ‘ఆశ్విన్స్’ సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
ప్రతి మనిషిలోనూ మంచి, చెడు అనే రెండు పర్శ్వాలుంటాయి. బుద్ధి మంచి వైపు వెళదామని చెబితే... మనసు మాత్ర చెడు వైపు చూయిస్తుంది. ఎంతో నిగ్రహంతో మన మనసుని మార్చుకొని బుద్దితో మంచి వైపు ప్రయాణిస్తే అంతా బాగుంటుంది. మంచి.. చెడు ఈ రెండింటినీ కంట్రోల్ చేసే శక్తి మనిషికి మాత్రమే ఉంటుందనే సందేశాన్ని ఈ సినిమా ద్వారా చూపించారు దర్శకుడు తరుణ్ తేజ. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ కొత్తగా ఉంది. కానీ దానిని తెరపై చూపించడంతో కాస్త తడబడ్డాడు.
సినిమా మొత్తాన్ని ఐదు చాప్టర్లు( Two deaths,Two voices, Two curses, The mind of two worlds, The world of two minds) చూపించారు. రైతు ఇద్దరు కుమారు చనిపోవడం.. అశ్వినీదేవతలు ప్రత్యేక్షమై వరం ఇవ్వడం.. రాక్షస ఆత్మ ఆశ్వినీ దేవతలు ఇచ్చిన రెండు బొమ్మల్లో ఒకదానిని దొంగిలించి.. భూమి మీదకు రావడం..ఇలా ఇంట్రెస్టింగ్ స్టోరీతో సినిమా ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత కథంతా రొటీన్ హారర్ చిత్రాల్లాగే సాగుతుంది.
ఫస్టాఫ్‌లో కథ పెద్దగా ఉండదు కానీ విచిత్రమైన సౌండ్లతో ఆడియన్స్‌ని భయపెట్టడంతో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ఇక సెకండాఫ్‌లో ఆర్కియాలజిస్ట్ ఆర్తి రాజగోపాల్(విమలా రామన్)నేపథ్యంతో అసలు సినిమా స్వభావం ఏంతో తెలిసిపోతుంది. ఫస్టాఫ్ మొత్తం ప్రేక్షకులను భయపెట్టడం మీదే దృష్టిపెట్టిన దర్శకుడు.. సెకండాఫ్‌లో అసలు కథను వెల్లడించి థ్రిల్లింగ్‌కు గురి చేశాడు. అయితే ఫస్టాఫ్‌లో కొన్ని సాగదీత సీన్స్ ఇబ్బందిగా అనిపిస్తుంది. అలాగే అసలు కథను ప్రారంభించడానికి దర్శకుడు ఎక్కువ సమయం తీసుకున్నాడు. మొత్తంగా ప్రేక్షకులను భయపెట్టడంతో పాటు ఓ మంచి సందేశాన్ని అందించారు.
ఎవరెలా చేశారంటే..
అర్జున్ పాత్రలో వసంత్ రవి ఒదిగిపోయాడు. రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించిన రవి, ప్రతి పాత్రలోనూ వేరియేషన్ చూపించి ఆకట్టుకున్నాడు.ఇక రవి తర్వాత ఈ సినిమాలో బాగా పండిన పాత్ర విమలా రామన్‌ది. ఆర్కియాలజిస్ట్ ఆర్తి రాజగోపాల్‌గా ఆమె చక్కగా నటించి మెప్పించింది.మిగిలిన నటీనటులు తమ తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు.
ఇక సాంకేతిక విషయానికొస్తే.. ఈ సినిమాకు ప్రధాన బలం విజయ్ సిద్ధార్థ్ అందించిన నేపథ్య సంగీతం. తనదైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ఆడియన్స్‌ని భయపెట్టాడు. ముఖ్యంగా ఫస్టాఫ్ మొత్తం సౌండ్స్‌తోనే థ్రిల్లింగ్‌కి గురి చేశాడు. ఎ.ఎం.ఎడ్విన్ సాకే సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ఎడిటర్ వెంకట్రాజన్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. ముఖ్యంగా ఫస్టాఫ్‌లో కొన్ని సన్నివేశాలను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది.నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment