సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనే పదం తరచుగా వినిపిస్తూనే ఉంటోంది. ఏదో ఒక సందర్భంలో ఇలాంటి అనుభవం ఎదురైన వారు ఇండస్ట్రీలో చాలామందే ఉంటారు. ఇలాంటి చేదు అనుభవాలను అందరూ ధైర్యంగా బయటికి చెప్పలేరు. మరికొందరు తమ కెరీర్‌లో ఎదుర్కొన్న ఇలాంటి సంఘటనలపై ఓపెన్ అవుతుంటారు. తాజాగా బాలీవుడ్ నటి ఐశ్వర్య సుస్మిత తనకెదురైన కాస్టింగ్ కౌచ్ అనుభవం గురించి మాట్లాడింది. ఇటీవల ఆమె 'బాడ్ కాప్' అనే వెబ్ సిరీస్‌లో కనిపించింది.
ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఎక్కువగా ఉందని ఐశ్వర్య సుస్మిత తెలిపింది. అయితే ఈ విషయాన్ని పెద్దది చేయడం ఒక్కటే మార్గం కాదని ఐశ్వర్య అన్నారు. తాను ఎప్పుడూ ఎలాంటి ఆడిషన్స్‌ను మిస్ చేసుకోలేదని పేర్కొంది. తాను విలువల విషయంలో రాజీ పడేది లేదని.. కష్టపడి పనిచేస్తానని చెప్పుకొచ్చింది.
ఐశ్వర్య మాట్లాడుతూ.. "నేను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొత్తలో ఇలాంటివీ చాలా విన్నా. చాలామంది వ్యక్తులు పలు విధాలుగా కథలు చెప్పేవారు. నేను అప్పటికీ మోడల్‌గానే ఉన్నా ఇంకా నటనలోకి అడుగు పెట్టలేదు. మీరు వారితో పడుకోకపోతే మీకు అవకాశాలు రావని నాకు చెప్పేవారు. కానీ పరిశ్రమలోకి రావడానికి ఇది ఒక్కటే మార్గం కాదు. కానీ ఆ సమయంలో కొందరు డైరెక్టర్స్, క్యాస్టింగ్ డైరెక్టర్స్ నన్ను పర్సనల్‌గా కలవమని చెప్పేవారు. కానీ ఇక్కడ మనల్ని ఎవరూ బలవంతం చేయడం లేదు. వెళ్లాలా? వద్దా? అనేది మన నిర్ణయం. ఇది కేవలం సినీ ఇండస్ట్రీలోనే కాదు.. కార్పొరేట్ రంగంలోనూ ఉంది.' అంటూ తన అనుభవాలను గుర్తు చేసుకుంది.
కాగా.. ఐశ్వర్య సుస్మిత మోడల్‌గా తన కెరీర్‌ని ప్రారంభించింది. 2016లో కింగ్‌ఫిషర్ క్యాలెండర్ గర్ల్‌గా తొలిసారి అవకాశం దక్కించుకుంది. ఆమె మోడలింగ్ నుంచి నటన వైపు అడుగులు వేస్తోంది. ప్రస్తుతానికి ఓటీటీలో అరంగేట్రం చేసిన ఐశ్వర్య సుస్మిత త్వరలోనే సినిమాల్లోనూ నటించేందుకు సిద్ధమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment