టైటిల్: బడవ రాస్కెల్
నటీనటులు: ధనుంజయ్, అమృత అయ్యంగార్, నాగభూషణ్, రంగాయణ రఘు, స్పర్శ రేఖ తదితరులు
దర్శకుడు : శంకర్ గురు
నిర్మాత : సావిత్రమ్మ ,అడవి స్వామి
సహనిర్మాత : ఖుషి
బ్యానర్ : రిజ్వాన ఎంటర్‌టైన్‌మెంట్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : రమణారెడ్డి ఎస్, దేవన్ గౌడ
సంగీతం: వాసుకి వైభవ్
డిఓపి : ప్రీత జయరామన్
ఎడిటర్ : నిరంజన్ దేవరామనే
లిరిక్స్ అండ్ డైలాగ్స్ : రామ్ వంశీకృష్ణ
విడుదల తేదీ: ఫిబ్రవరి 18
'పుష్ప` సినిమాలో జాలిరెడ్డి పాత్రలో నటించి మెప్పించాడు నటుడు ధనుంజయ్. కన్నడలో హీరోగా రాణిస్తున్న ఆయన నటించిన తాజా చిత్రం `బడవ రాస్కెల్`. శంకర్ గురు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కన్నడలో నటించి నిర్మించాడు ధనుంజయ్. గతేడాది డిసెంబర్‌లో రిలీజైన ఈ మూవీ సూపర్ హిట్ సాధించింది. దీంతో ఈ సినిమాను తెలుగులోకి డబ్బింగ్ చేసి రిలీజ్ చేశారు. ఈనెల 18న విడుదలైన బడవ రాస్కెల్ ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? అనేది రివ్యూలో చదివేయండి..
కథ
మధ్యతరగతి కుటుంబానికి చెందిన శంకర్(ధనుంజయ్) ఆటో డ్రైవర్ రంగనాథ్ (రంగాయణ రఘు) కొడుకు. ఎంబీఏ చదివినప్పటికీ తండ్రికి సాయంగా ఉండాలని ఆటో నడుపుతుంటాడు. ఈ క్రమంలో హీరో ఒక సంపన్న రాజకీయ నాయకురాయాలి కుమార్తె సంగీత (అమృత అయ్యంగార్)తో ప్రేమలో పడతాడు. ఇద్దరూ పెళ్లి చేసుకుని ఒక్కటవుదామనుకుంటారు. మీ అమ్మ నాన్నలతో వచ్చి మన పెళ్లి విషయం మా పేరెంట్స్‌తో మాట్లాడమని చెప్తుంది హీరోయిన్. సరేనని శంకర్ తన తల్లిదండ్రులతో వారి ఇంటికి వెళతాడు. ఆ సమయంలో అక్కడ జరిగిన సంఘటన ఇద్దరి జీవితాన్ని మలుపు తిప్పుతుంది, ఆ సంఘటన తర్వాత వాళ్లు దూరం అవుతారు. ఇంతలో హీరో కిడ్నాప్ అవుతాడు. అసలు హీరోహీరోయిన్లు ఎందుకు విడిపోయారు? శంకర్‌ను ఎవరు కిడ్నాప్ చేశారు? వీళ్ల ప్రేమకథకు శుభంకార్డు పడిందా? లేదా? అంటే బడవ రాస్కెల్ చూడాల్సిందే!
విశ్లేషణ
బడవ రాస్కెల్ ఒక మామూలు ప్రేమకథ, ఇందులో కొత్త పాయింట్ అంటూ పెద్దగా ఏమీ కనిపించదు. కాకపోతే దర్శకుడు ప్రధానంగా ఫ్యామిలీ సెంటిమెంట్ మీద ఫోకస్ పెట్టాడు. తల్లీ కొడుకు, తండ్రీకొడుకుల అనుబంధాన్ని చాలా బాగా చూపించడంలో సఫలమయ్యాడు. కానీ ఫస్టాఫ్ మీద పెట్టిన దృష్టి సెకండాఫ్ మీద కూడా చూపిస్తే బాగుండేది. ఫస్టాఫ్ పరుగులు పెట్టినా సెకండాఫ్ మాత్రం సాగదీతగా అనిపిస్తుంది. క్లైమాక్స్ కూడా పెద్దగా ట్విస్టులు లేకుండా ఊహించినట్లే ఉంటుంది. స్నేహం, ప్రేమ, ఫ్యామిలీ ఎమోషన్స్ ఈ సినిమాకు పెద్ద ప్లస్ అని తెలుస్తోంది.
నటీనటుల పనితీరు
మధ్య తరగతి యువకుడు శంకర్‌గా ధనుంజయ్ పాత్రలో లీనమయ్యాడు. ఎమోషనల్ సీన్స్‌లోనూ ఎక్కడా వెనకడుగు వేయలేదు. సంగీతగా హీరోయిన్ అమృత అయ్యంగార్ అందం, అభినయంతో ఆకట్టుకుంది. శంకర్‌కు స్నేహితుడిగా నటించిన నాగభూషణ్ మంచి కామెడీ పండిస్తూ అందరినీ నవ్వించే ప్రయత్నం చేశాడు. హీరో తల్లిదండ్రులుగా రంగాయణ రఘు, తారలు మెప్పించారు. హీరోయిన్ తల్లిగా స్పర్ష రేఖ నెగెటివ్ షేడ్స్‌తో అలరించింది.
సాంకేతిక నిపుణుల పనితీరు
డైరెక్టర్ శంకర్ గురు మధ్యతరగతి విలువలను తెరపై చక్కగా చూపించాడు ఫ్యామిలీ ఎమోషన్స్‌ను ప్రేక్షకులు ఫీల్ అయ్యేలా సన్నివేశాలను రూపొందించాడు. కానీ కథ, కథనం విషయంలో కొంత తడబడ్డట్లు కనిపించింది. వాసుకి వైభవ్ అందించిన సంగీతం వినసొంపుగా ఉంది. పాటలు, నేపథ్య సంగీతం సినిమాకు బలాన్నిచ్చాయి. ప్రీతం జయరామన్ అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ మీద మరికొంత కసరత్తు చేసుంటే బాగుండేది.
Comments
Please login to add a commentAdd a comment