బంధాల్ని నిలుపుకోవడం, వాటిని కలకాలం కాపాడుకోవడమే బలం అని నిరూపించాడు దర్శకుడు వేణు. బలగం సినిమాతో కుటుంబ బాంధవ్యాలను కళ్లకు కట్టినట్లు చక్కగా చూపించాడు. ఈ సినిమాలో నారాయణ పాత్రలో మెప్పించాడు మురళీధర్ గౌడ్. తాజాగా ఆయన తన జీవితంలో ఎదురుచూసిన చేదు సంఘటనలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు.
'మెదక్ జిల్లా రామాయంపేట నా స్వస్థలం. సిద్దిపేటలో చదువుకున్నాను. ఎలక్ట్రిసిటీ బోర్డులో 27 ఏళ్లు పనిచేసి రిటైరయ్యాను. మేము నలుగురం అన్నదమ్ములం, ఒక చెల్లె. నేను డిగ్రీ చదువుతున్న రోజుల్లో మా ఇంట్లో పది రూపాయలు ఉండేవి కాదు. మా కోసం అమ్మానాన్న పడ్డ కష్టాలు కళ్లారా చూశాను. ఓసారి పది రూపాయలు అవసరమయ్యాయి. అమ్మ ఎవరినీ అడగలేక మా బంధువుల్లో కొంత ధనవంతుల ఇంటికి నన్ను రూ.10 అప్పు తీసుకురమ్మని పంపించింది.
నాకేమో వాళ్లు ఇస్తారో, ఇవ్వరోనని భయపడుతూనే వెళ్లి అడిగేవాడిని. మా నాన్న మాకు దూరంలో పని చేసేవాడు. ఆయన ఇంటికి వచ్చినప్పుడు ఆ పది రూపాయలు వాళ్లకు తిరిగి ఇచ్చేవాడిని. చిరిగిపోయిన బట్టలు వేసుకునేవాడిని. ఎగతాళి చేసేవారు. దారుణంగా అవమానించేవారు. నేను ఉద్యోగం చేసేటప్పుడు కూడా మా పరిస్థితి అంతంతమాత్రమే! నేను రిటైర్‌మెంట్ తీసుకున్నప్పుడు నా బ్యాంకు బ్యాలెన్స్ జీరో' అంటూ కంటతడి పెట్టుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment