టైటిల్: బెదురులంక 2012
నటీనటులు: కార్తికేయ, నేహా శెట్టి, అజయ్ ఘోష్, రాజ్ కుమార్ కసిరెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్, గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్, సత్య తదితరులు
నిర్మాణ సంస్థ: లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్
నిర్మాత: రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని
దర్శకత్వం: క్లాక్స్
సంగీతం: మణిశర్మ
సినిమాటోగ్రఫీ: సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు
ఎడిటింగ్: విప్లవ్ న్యాసదం
విడుదల తేది: ఆగస్ట్ 25, 2023
కథేంటంటే..
ఈ సినిమా కథంతా 2012 నాటి కాలంలో సాగుతుంది. బెదురులంక గ్రామానికి చెందిన శివ(కార్తికేయ) ఓ స్వేచ్ఛా జీవి. మనసుకు నచ్చినట్లు జీవిస్తాడు. హైదరాబాద్‌లో గ్రాఫిక్స్ డిజైనర్ జాబ్ మానేసి బెదురులంకకు వస్తాడు. అక్కడ అప్పటికే యుగాంతం రాబోతుందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. టీవీలో యుగాంతంపై వస్తున్న వార్తలను చూసి భూషణం(అజయ్ ఘోష్) ఊరి జనాలను మోసం చేసేందుకు పెద్ద ప్లాన్ వేస్తాడు. ఆ ఊర్లో దొంగ జాతకాలు చెబుతూ బతికే బ్రాహ్మాణుడు బ్రహ్మాం(శ్రీకాంత్ అయ్యంగార్), చర్చి ఫాదర్ కొడుకు డేనియల్(ఆటో రాంప్రసాద్)తో కలిసి నిజంగానే యుగాంతం రాబోతుందని ఊరి ప్రజలను నమ్మిస్తాడు.
యుగాంతాన్ని ఆపాలంటే అందరి ఇళ్లల్లో ఉన్న బంగారాన్ని తీసుకొచ్చి ఇవ్వాలని, దానితో శివలింగాన్ని, శిలువను తయారు చేసి గంగలో వదిలేస్తే యుగాంతం ఆగిపోతుందని చెబుతారు. ప్రెసిడెంట్‌గారు(గోపరాజు రమణ)ఆదేశంతో ఊరి ప్రజలంతా తమ వద్ద ఉన్న బంగారాన్ని ఇచ్చేస్తారు. కానీ శివ మాత్రం ఇవ్వడు. పైగా అదొక మూఢనమ్మకం అంటూ కొట్టిపారేస్తాడు. దీంతో శివని ఊరి నుంచి వెలేస్తాడు ప్రెసిడెంట్. ఆ తర్వాత ఏం జరిగింది? ఊరి ప్రజల్లో ఉన్న మూడనమ్మకాన్ని పోగొట్టేందుకు శివ ఏం చేశాడు? భూషణం ప్లాన్‌ని ఎలా బయటపెట్టాడు? ప్రెసిడెంట్‌గారి అమ్మాయి చిత్ర(నేహాశెట్టి)తో ప్రేమలో ఉన్న శివ.. చివరకు ఆమెను పెళ్లి చేసుకున్నాడా? లేదా? అనేదే మిగతా కథ.
ఎలా ఉందంటే..
2012లో యుగాంతం రాబోతుందని, భూమి నాశనమైపోతుందని వార్తలు రావడంతో అసలేం జరగబోతుందోనని అందరూ ఎదురుచూశారు. ఆ సమయంలో బెదురులంక అనే గ్రామంలో ఎలాంటి పరిణామాలు చేసుకున్నాయి?, మూఢవిశ్వాల కారణంగా జనాలు ఎలా మోసపోతున్నారనేది ఈ చిత్రం ద్వారా వినోదాత్మకంగా చూపించాడు దర్శకుడు క్లాక్స్. ప్రజల అమాయకత్వానికి, భయానికి మతం రంగు పులిమి కొందరు లబ్దిపొందే ప్రయత్నం చేస్తున్నారని, అలాంటివి పట్టించుకోవద్దనే సందేశాన్ని ఇచ్చాడు. తొలిసారే ఇలాంటి సరికొత్త సబ్జెక్ట్‌ను ఎంచుకున్న దర్శకుడి ప్రయత్నాన్ని ప్రశంసించాల్సిందే.
యుగాంతం కాన్సెప్ట్‌తో గతంలో హాలీవుడ్‌తో పాటు పలు భాషల్లోనూ సినిమాలు వచ్చాయి. కానీ బెదురలంక పాయింట్ చాలా కొత్తగా ఉంది. యుగాంతం రాబోతుందనే టీవీ వార్తతో సినిమా ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత తొలి సన్నివేశంలోనే శివ క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో చూపించారు. ఆ తర్వాత కథంతా బెదురులంక గ్రామం చుట్టే తిరుగుతుంది. ఊరి ప్రెసిడెంట్, భూషణం, బ్రహ్మా, డేనియల్ పాత్రల పరిచయం తర్వాత కథలో వేగం పుంజుకుంటుంది. ప్రెసిడెంట్‌గారి అమాయకత్వాన్ని వాడుకొని భూషణం చేయించే మోసాలు నవ్వులు పూయిస్తాయి.
మధ్యలో హీరో హీరోయిన్ల లవ్ ట్రాక్ నడుస్తుంది. అయితే అది అంతగా ఆకట్టుకోదు. అసలు కథ ప్రారంభించడానికి కాస్త సమయం తీసుకున్న దర్శకుడు.. ఫస్టాఫ్ మొత్తం సోసోగానే నడిపించాడు. అసలు కథ సెకండాఫ్‌లో ప్రారంభమవుతుంది. ఊరి ప్రజలల్లో ఉన్న మూఢనమ్మకాన్ని పోగొట్టేందుకు శివ చేసే పనులు థియేటర్లలో నవ్వులు పూయిస్తాయి. ముఖ్యంగా సత్య, వెన్నెల కిశోర్ పాత్రల ఎంట్రీ తర్వాత కథ ఆసక్తికరంగా, మరింత ఎంటర్‌టైనింగ్ సాగుతుంది. క్లైమాక్స్ సీన్‌ని పగలబడి నవ్వుతారు. కొన్నిచోట్ల డబుల్ మీనింగ్ డైలాగులు ఫ్యామిలీ ఆడియన్స్‌కి కాస్త ఇబ్బందిగా అనిపిస్తాయి. ఓవరాల్‌గా నవ్విస్తూనే ఓ మంచి సందేశం ఇచ్చిన సినిమా ‘బెదురులంక 2012’.
ఎవరెలా చేశారంటే...
ఎలాంటి పాత్రలో అయినా జీవించేస్తాడు కార్తికేయ.తెరపై చాలా ఎనర్జిటిక్‌గా కనిపిస్తాడు. ఈ చిత్రంలో కూడా అలానే కనిపించాడు. తనకు నచ్చినట్లుగా జీవించే యువకుడు శివ పాత్రకు కార్తికేయ న్యాయం చేశాడు. కామెడీతో పాటు యాక్షన్ సీన్లలో కూడా అదరగొట్టేశాడు. ఇక చిత్రగా నేహాశెట్టి పాత్ర నిడివి తక్కువే అయినా తనదైన అందచందాలతో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసింది. జనాలను మోసం చేసి డబ్బులు సంపాదించాలనే ఆశ ఉన్న భూషణం పాత్రలో అజయ్ ఘోష్ ఒదిగిపోయాడు. కొన్ని చోట్ల అజయ్ నటన.. కోటా శ్రీనివాసరావు చేసిన కొన్ని పాత్రలను గుర్తుకు చేస్తుంది. బ్రహ్మాగా శ్రీకాంత్ అయ్యంగార్, డేనియల్‌గా రాంప్రసాద్, కసిరాజుగా రాజ్ కుమార్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.
ఇక సాంకేతిక విషయాలకొస్తే.. మణిశర్మ సంగీతం పర్వాలేదు. పాటలు అంతగా ఆకట్టుకోలేవు కానీ.. నేపథ్య సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. ఎడిటర్ పనితీరు బాగుంది. సినిమాను చాలా షార్ప్‌గా కట్ చేశాడు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.
-అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్
Comments
Please login to add a commentAdd a comment