‘‘సినిమా అంటే కేవలం ఫైట్స్, యాక్షనే అని నేను అనుకోవడం లేదు. కథలో పర్టిక్యులర్‌గా ఫలానా అంశాలు, లక్షణాలు ఉండాలని కోరుకోను. సినిమా బాగుంటే ఏ రకం జానర్ అయినా ప్రేక్షకులు థియేటర్స్‌కు వచ్చి చూస్తారు’’ అని బెల్లంకొండ గణేష్ అన్నారు. బెల్లకొండ గణేష్ హీరోగా లక్ష్మణ్ కె. కృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతున్న సినిమా ‘స్వాతిముత్యం’. ఇందులో వర్ష బొల్లమ్మ హీరోయిన్.. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా మంగళవారం జరిగిన విలేకర్ల సమావేశంలో బెల్లంకొండ గణేష్ చెప్పిన విశేషాలు...
► చిన్నతనం నుంచే నాకు యాక్టర్ కావాలన్న ఆలోచన ఉన్నప్పటికీ 2016 నుంచే సీరియస్‌గా తీసుకున్నాను. 2017లో ముంబైలో, 2018లో యూస్‌లో యాక్టింగ్ కోర్సులు చేశాను. 2019 నుంచి కథలు వినడం మొదలుపెట్టాను. అలా 2020లో ‘స్వాతిముత్యం’ కథ విన్నాను. ఈ కథతో ప్రేక్షకుల ముందుకు వస్తే ఓ నటుడిగా నన్ను ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్మి నిర్మాత నాగవంశీగారి దగ్గరకు వచ్చాను. ఆయనకూ ఈ కథ నచ్చింది.
► స్పెర్మ్ డోనేషన్ ఆధారంగా హిందీలో ‘విక్కీ డోనర్’ వచ్చింది. కానీ మా ‘స్వాతిముత్యం’ ఈ ఒక్క పాయింట్ ఆధారంగానే సాగదు. మరికొన్ని కొత్త అంశాలు ఉన్నాయి. వీటికి ఆడియ కనెక్ట్ అవుతారు.
► మా నాన్నగారు (నిర్మాత బెల్లంకొండ సురేష్) ‘స్వాతిముత్యం’ కథ విన్నారు. అయితే కథల ఎంపికలో నాదే తుది నిర్ణయం. ఈ సినిమాను మా బ్యానర్‌లోనే చేసి ఉండొచ్చు. అయితే మరో ప్రముఖ బ్యానర్‌లో చేయడం, లాంచ్ కావడం అనేది నాకు మరింత గౌరవాన్ని తీసుకువస్తుంది. మా నాన్న నిర్మాత కావడంతో నా చిన్నతనం నుంచే సెట్ వాతావరణం నాకు అలవాటు ఉంది. అయితే అప్పుడు కెమెరా వెనుక... ఇప్పుడు యాక్టర్‌గా కెమెరా ముందు.
► నా తొలి పది సినిమాలను పది రకాల జానర్స్‌లో చేయాలనుకుంటున్నాను. నా నెక్ట్స్ మూవీ ‘నేను.. స్టూడెంట్’ ఓ థ్రిల్లర్ సబ్జెక్ట్. ఇక నేను హీరోగా పవన్ సాదినేని దర్శకత్వంలో మొదలైన సినిమా షూటింగ్ యూఎస్‌లో చేయాలి. కోవిడ్ వల్ల అప్పట్లో కుదర్లేదు. ఇప్పుడు దర్శక–నిర్మాతలు ఓకే అంటే నేను రెడీ. ఎందుకంటే ఈ సినిమా సబ్జెక్ట్ కూడా బాగుంటుంది.
► చిరంజీవిగారి ‘గాడ్‌ఫాదర్’, నాగార్జునగారి ‘ది ఘోస్ట్’ సినిమాలు విడుదలవుతున్న రోజునే నేను హీరోగా పరిచయం అవుతున్న సినిమా ‘స్వాతి ముత్యం’ కూడా రిలీజ్ అవుతుండటం కాస్త టెన్షన్ గానే ఉంది. మల్టీప్లెక్స్‌లలో ఆ స్టార్ హీరోల సినిమా పోస్టర్స్‌తో పాటు నా సినిమాల పోస్టర్స్ కూడా కనిపిస్తుండటం కొంచెం హ్యాపీగా ఉంది. యాక్టర్‌గా నాకు వెంకటేశ్‌గారు స్ఫూర్తి. దర్శకులు రాజమౌళిగారి సినిమాలో నటించాలనేది నా డ్రీమ్.
Comments
Please login to add a commentAdd a comment