కథను కీలక మలుపు తిప్పే ‘కీ’ రోల్స్ దాదాపు ప్రతి సినిమాలోనూ ఉంటాయి. ఈ కీ రోల్స్‌కి ఏజ్‌తో సంబంధం ఉండదు. చిన్నారులు కూడా కథలో పెద్ద మార్పుకు కారణం అవుతుంటారు. ‘ఆర్‌ఆర్‌ఆర్’, ‘బింబిసార’ వంటి సినిమాల్లో చిన్ని పాపలు కథకు ప్రాణంగా నిలిచారు. ఇలా ‘పాపే ప్రాణం’ అంటూ సాగే కథలతో రానున్న చిత్రాల గురించి తెలుసుకుందాం.
సంరక్షకుడు?
‘పసివాడి ప్రాణం, జగదేకవీరుడు అతిలోక సుందరి, అంజి’... వంటి సినిమాల్లో చిన్నారులతో చిరంజీవి చేసిన అల్లరి సన్నివేశాలు, అదే సమయంలో వారి ప్రాణ రక్షకుడుగా చేసిన సాహసాలు ప్రేక్షకులను అలరించాయి. మళ్లీ వెండితెరపై ఓ పాపకు సంరక్షకుడిగా ఉండే పాత్రలో చిరంజీవి నటించనున్నారనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. చిరంజీవి హీరోగా ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.
ఇటీవల విడుదలైన కాన్సెప్ట్ పోస్టర్‌ను బట్టి ఇది సోషియో ఫ్యాంటసీ ఫిల్మ్ అనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ చిత్రంలో ఓ పాప కీలక పాత్రలో నటించనుందని, ఈ పాప సంరక్షకుడిగా చిరంజీవి చేసే సాహసాలు అబ్బురపరచేలా ఉంటాయని టాక్. ఈ ఏడాది చివర్లో రెగ్యులర్ షూటింగ్ ఆరంభించి, వచ్చే ఏడాది ఈ సినిమాను విడుదల చేసే ఆలోచనలో యూనిట్ ఉందని తెలిసింది. ఈ సంగతి ఇలా ఉంచితే... వశిష్ట దర్శకుడిగా పరిచయం అయిన ‘బింబిసార’ చిత్రంలో ఓ పాప సెంట్రల్ క్యారెక్టర్‌గా ఉన్న సంగతి తెలిసిందే.
హార్ట్ ఆఫ్ సైంధవ్
శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా.. ఇలా ముచ్చటగా ముగ్గురు హీరోయిన్లు ఉన్నా కూడా హీరో ‘సైంధవ్’ మనసులో తొలి స్థానం చిన్నారి సారాదే. సారా అంటే ‘హార్ట్ ఆఫ్ సైంధవ్’ అన్నమాట. వెంకటేశ్ టైటిల్ రోల్‌లో నటిస్తున్న ఈ సైంధవ్ సినిమాకు ‘హిట్’ ఫ్రాంచైజీ ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. సైంధవ్ హార్ట్ సారా అని చిత్ర యూనిట్ అంటోందంటే కథలో చిన్నారి సారా పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంటుందని ఊహించవచ్చు. తమిళ నటుడు ఆర్య, హిందీ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ కీలక పాత్రలు చేస్తున్న ‘సైంధవ్’ చిత్రం డిసెంబరు 22న విడుదల కానుంది.
హాయ్ నాన్న
తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో తెలుగులో రూపొందుతున్న మరో చిత్రం ‘హాయ్ నాన్న’. ఈ ఎమోషనల్ మూవీలో నాని హీరోగా నటిస్తున్నారు. ‘సీతారామం’ ఫేమ్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రుతీహాసన్ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. శౌర్యువ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్ర కథ ఓ పాప పాత్ర చుట్టూ తిరుగుతుందని, ఈ క్రమంలో వచ్చే భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తాయని తెలుస్తోంది. ‘హాయ్ నాన్న’ డిసెంబరు 21న రిలీజ్ కానుంది.
గరుడ సాహసాలు
‘గరుడ’ సినిమా పోస్టర్ చూశారుగా.. సత్యదేవ్ వీపుపై కూర్చున్న ఓ చిన్నారి ఎంత భయంగా చూస్తుందో కదా! పైగా అది అడవి ప్రాంతం. ఆ చిన్నారి భయాన్ని పోగొట్టి, తనను సురక్షితంగా గరుడ ఎలా రక్షించాడనేది వెండితెర పైనే చూడాలంటోంది యూనిట్. సత్యదేవ్ హీరోగా క్రాంతి బాల దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘గరుడ’. సోషియో ఫ్యాంటసీ నేపథ్యంలో సాగే అడ్వంచరస్ మూవీగా ఈ చిత్రం ఉంటుందట. ఈ చిత్రం తొలి భాగం ‘గరుడ: చాప్టర్ 1’ త్వరలోనే రిలీజ్ కానుంది. ఇలా చిన్నారులు కీలకంగా నిలిచే చిత్రాలు మరికొన్ని ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment